ఆమధ్య ఈటీవీలో బుల్లెట్ భాస్కర్ కావచ్చు, ఒక స్కిట్‌లో ఓ మాటంటాడు.,. ఒరేయ్, సినిమా మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ కూడా పూర్తి గాకుండానే రివ్యూ పోస్ట్ చేశారేమిట్రా అని… ప్రస్తుత రివ్యూల ధోరణి మీద పర్‌ఫెక్ట్ వన్ లైనర్ పంచ్ అది… నిజమే అది… ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించి బోలెడు ఫేక్ రివ్యూలు యూట్యూబును ముంచెత్తుతున్నయ్…
అసలు ఎక్కడా బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు వేయకుండానే… సినిమా రిలీజు కాకుండానే… సినిమా ఏడ్చింది, బొక్క, డిజాస్టర్ అంటూ భీకరమైన థంబ్ నెయిల్స్‌తో వీడియోలు ముంచెత్తుతున్నయ్… (ఈ స్టోరీ రాసే సమయానికి)… ఎవరు విజయ్‌ను టార్గెట్ చేశారో ఇండస్ట్రీ ముఖ్యులైనా సస్పెక్ట్ చేయగలుగుతున్నారో లేదో తెలియదు గానీ… అన్నీ ప్లాంటెడ్ రివ్యూలు… సినిమా మీద నెగెటివిటీని పెంచి, అసలే బజ్ లేకుండా సతమతమవుతున్న సినిమాకు మరింత తొక్కే కుట్ర… పైగా చాన్నాళ్లుగా తనకు వరుస ఫ్లాపులు…
గతంలో కూడా విజయ్ సినిమాల మీద ఇలాంటి క్యాంపెయిన్ నడిచినా సరే, మరీ ఇప్పుడున్నంత తీవ్రత లేదు… ఇప్పుడైతే అన్ని హద్దులూ దాటేశాయి ఫేక్ రివ్యూలు… సినిమా ఎలా ఉంటుందనేది పక్కన పెడితే, వరుస హాలీడేస్ సినిమాకు అడ్వాంటేజ్… ఐతే ఇప్పుడు సినిమా వారం పది రోజుల్లో బ్రేకీవన్ అయిపోవాలి, వసూళ్లు కుమ్మేయాలి, అది జరగాలంటే బజ్ ఉండాలి, పాజిటివ్ వైబ్స్ ఉండాలి… అదుగో దాన్ని దెబ్బ తీస్తున్నారు ఈ డొల్ల రివ్యూల కుట్రదారులు… చాలా బీభత్సమైన ప్లాన్…
Ads
ఎలాగూ యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు కదా జనం… దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు… నిజానికి నెగెటివ్ రివ్యూల బెడద అరికట్టడానికి నిర్మాతలు, పీఆర్వోలు సినిమా రిలీజ్ కాగానే వరుసగా పాజిటివ్ పెయిడ్ రివ్యూలు తమ బాపతు సైట్లలో, యూట్యూబ్ చానెళ్లలో ప్రసారం చేయిస్తున్నారు… మస్తు రేటింగులు ఇస్తుంటారు… ఇదీ ఓతరహా కౌంటర్ స్ట్రాటజీ… మంచి మౌత్ టాక్ కోసం ప్రణాళిక… ఇవే ముదిరి ముదిరి ఇప్పుడు నెగెటివ్ క్యాంపెయిన్‌కూ దారితీస్తున్నయ్, దారి చూపిస్తున్నయ్…
ఆమధ్య ప్రమోషన్ మీట్‌లో ‘పెళ్లిచూపులు’ సినిమా తరువాత తాను బైకులో ఎప్పుడూ ఫుల్ పెట్రోల్ కొట్టిస్తున్నానని ఏదో సరదా వ్యాఖ్య చేశాడు, ఇంకేముంది మరుక్షణంలో మీమ్స్, వెక్కిరింపులు, చెణుకులు, వ్యంగ్యాలు స్టార్ట్… కొత్త దర్శకులతో పెద్ద సినిమాలు ప్లాన్ చేస్తే బడ్జెట్ పర్మిట్ చేయదని మరో మాటన్నాడు, వెంటనే మళ్లీ ఎదురుదాడి… అసలు విజయ్ ఎప్పుడు విజయ్ దొరుకుతాడా అని చూడటం కాదు, దొరక్కపోయినా దొరకపుచ్చుకుని మరీ ఆడుకుంటున్నారు… మరి విజయ్ క్యాంపు ఏం చేయాలి..? (ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ రివ్యూలతో, రేటింగులతో తన గామి సినిమాను ఐఎండీబీ రేటింగ్స్‌ను టార్గెట్ చేశారని విష్వక్సేన్ ఆరోపించాడు ఈమధ్యే గుర్తుంది కదా…)
ముందుగా కేరళ హైకోర్టు విచారణలో ఉన్న ఓ వార్త చదవాలి… అదేమిటంటే..? సోషల్ మీడియా మూవీ రివ్యూలపై అడ్వొకేట్ శ్యామ్ పద్మన్‌ను అమికస్ క్యూరీగా కోర్టు నియమించింది… ఆయన కోర్టుకు సబ్మిట్ చేసిన ఓ రిపోర్టులో ఏమంటున్నాడు అంటే..? ‘‘సినిమా విడుదలయ్యాక కనీసం 48 గంటల వెయిటింగ్ పీరియడ్ ఇవ్వాలి… ఈ కూలింగ్ పీరియడ్ ఎలా అమలు చేయాలో పోలీసులు ప్లాన్ చేయాలి… సినిమా మీద ప్రేక్షకులే సొంతంగా ఓ అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకునే వ్యవధి ఇవ్వాలి… ‘రివ్యూ బాంబింగ్’ (భలే పదం వాడుతున్నది కేరళ ఇండస్ట్రీ) అరికట్టడానికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ ఓ పోర్టల్ క్రియేట్ చేసి, కంప్లయింట్స్ స్వీకరించాలి, యాక్షన్ వెంటనే ఉండాలి…’’
‘‘ప్రజల సినిమా వీక్షణంపై సోషల్ మీడియా ప్రభావం ఖచ్చితంగా ఉంటోంది… అయితే సినిమాల ప్రమోషన్ లేదంటే హానిచేయడం… ఈ రివ్యూల్ని కంట్రోల్ చేయడానికి తప్పనిసరిగా ఓ నియంత్రణ పద్ధతి అవసరం… జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అభిప్రాయాల్ని నియంత్రించాలని 2022- Prevention of Misleading Advertisements and Endorsements for Misleading Advertisements అమలు చేయాలని Central Consumer Protection Authority కూడా చెబుతోంది… BIS రివ్యూలకు కూడా పాటించబడాలి..’’ ఇదీ ఆయన రిపోర్ట్ సారాంశం… కోర్టు అంతిమంగా ఏమంటుందో చూడాలి…
ఈ కేసు ఎందుకొచ్చిందీ అంటే..? ‘Aromalinte Adyathe Pranayam’ అనే సినిమా దర్శకుడు మూవీ రిలీజయ్యాక వారం రోజులు పాటు వ్లాగర్స్, సైట్స్ వంటి ఏ సోషల్ మీడియా ప్లేయరైనా రివ్యూ రాయకుండా నియంత్రించాలని కోర్టుకు ఎక్కాడు… కనీసం సినిమాను కూడా చూడకుండానే దురుద్దేశపూర్వక సమీక్షలు వెలువరిస్తున్నాయని తన ఆరోపణ… అవి నిర్మాతలను మానసిక క్షోభకు, ఆర్థిక కష్టాలకు కారణమవుతున్నాయని అంటాడు…
2023 నవంబరులో జస్టిస్ రామచంద్రన్ ‘‘రివ్యూల ఉద్దేశాలు వేరు, అవి destroy లేదా extort కోసం కాదు… సంస్థలు ఉండవు, అక్రెడిటేషన్లు ఉండవు, గైడ్ లైన్స్ ఉండవు, మరి ఇదెలా..?’’ అని అభిప్రాయపడ్డారు… ఇక్కడ రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛ అనే ఇష్యూ వస్తుంది… సినిమా ఒక సరుకు, ఒక ఉత్పత్తి… వినియోగదారుడిగా తన అభిప్రాయాన్ని, సమీక్షను, క్వాలిటీ విశ్లేషణను జనంతో పంచుకోవడాన్ని ఎలా నిరోధించగలరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది… ఆ స్వేచ్ఛకూ పరిమితులు ఉంటాయంటారు జడ్జి గారు… ఏమో, చివరిగా ఈ ‘రివ్యూ బాంబింగ్’ మీద అంతిమ తీర్పు ఏమిస్తారో చూడాలి…
ఇప్పుడు విజయ్ కూడా కోర్టు మెట్లు ఎక్కితే ఏం జరుగుతుందో చూడాలి… కానీ ఎక్కడో ఓ చోట ఇది మొదలు కావాలి… లేకపోతే ఇండస్ట్రీలో ఈ నెగెటివ్, ఫేక్, క్యాంపెయిన్, డొల్ల, కుట్ర రివ్యూలతో ఇంకా ప్రమాదం ఖాయం…!!
Share this Article