అప్పట్లో మలయాళంలో ఈ సినిమా విడుదలైనప్పుడు… ఓటీటీల్లో దీన్ని చూసిన చాలామంది మిత్రులు ఆహా ఓహో అన్నారు… కానీ అంత సీనేమీ కనిపించడం లేదు… ఆమధ్య తమిళంలో కూడా డబ్ చేసి వదిలిన ఈ సినిమాను తాజాగా కన్నడం, తెలుగుల్లో కూడా డబ్ చేసి ఓటీటీకి ఎక్కించారు… సినిమా పేరు ది గ్రేట్ ఇండియన్ కిచెన్…
ఎంచక్కా తెలుగు వంటగది అని పెడితే బాగుండేది అంటారా..? భలేవారే… కథలో హీరోయిన్ బాగా చదువుకుంది… మంచి క్లాసికల్ డాన్సర్… మరీ పాతచింతకాయ పచ్చడిలా వంటిల్లు, వంటగది, బొగ్గులకుంపటి, కట్టెల పొయ్యి, గ్యాస్ సిలిండర్ అని పెడితే ఏం బాగుంటుంది..? అలా అనుకున్నాడేమో దర్శకుడు… ఈ సినిమాలో తీసుకున్న స్టోరీ పాయింట్ బాగుంది… హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటన బాగుంది… ఐనా ఆమె నటన బాగాలేకపోతేనే వార్త… బాగా నటించడమే ఆమెకు తెలుసు…
అవునవును… మన పాత కమెడియన్ శ్రీలక్ష్మి సోదరుడి బిడ్డ… అప్పట్లో హీరోగా చేసిన రాజేష్ బిడ్డ… తల్లి సినిమాల్లో ఓ డాన్స్ అసిస్టెంట్… తాత అనగా రాజేష్ తండ్రి అమరనాథ్ నటుడు, నిర్మాత… ఆయన అన్న అప్పారావు పట్నాయక్, దర్శకుడు… ఆమె నెత్తురులో నటన ఉంది… అనువంశిక ప్రతిభ అన్నమాట… ఈ సినిమాలో ఆధునిక భావాలు కలిగిన అమ్మాయిగా, అన్నీ సర్దుకుపోయే భార్యగా మంచి హావభావాాలు ప్రదర్శించింది…
Ads
ఎవరెవరో తెల్లపిండి ముద్దలను తీసుకొచ్చి, తెరపై ఆడిస్తారు మనవాళ్లు… కానీ అందుబాటులోనే ఉన్న మన పిల్లను మాత్రం దేకరు… అదే ఐరనీ అంటే..! రెండేళ్ల క్రితం తను నటించిన వైఫ్ ఆఫ్ రణసింగం పాత్రకు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నారు అందరూ… ఇక సినిమా సంగతికి వస్తే మంచి పాయింటే… వంటింట్లో కష్టపడుతూ, చివరకు రుతుదినాల్లో సైతం చాకిరీ తప్పని మహిళల అవస్థల్ని ప్రొజెక్ట్ చేయాలని అనుకున్నాడు దర్శకుడు…
కంటెంట్ బేసిక్ లైన్ మంచిదే అయినా ప్రజెంట్ చేయడంలో వైఫల్యం ఉంది… వంటింట్లో మహిళ కష్టాన్ని బలంగానే ప్రొజెక్ట్ చేసే వీలున్నా సరే, ఎంతసేపూ కిచెన్‌లో దోసెలు వేయడం, అంట్లు కడగటం, చట్నీలు చేయడాన్నే ఎక్కువగా చూపించాడు… నిజానికి భార్య ఆవేదనను బలంగా ఎక్స్‌పోజ్ చేయడానికి భర్తలోనూ నెగెటివ్ షేడ్స్ పెట్టాడు గానీ ఇదే పాయింట్‌ను కాస్త పాజిటివ్‌గా ప్రజెంట్ చేస్తే బాగుండేదేమో… భార్యాభర్తలు ఇద్దరూ కొలువులు చేసే ఇళ్లల్లో ఇద్దరూ కలిసి ఇంటిపనులు చేసుకుంటున్న ఉదాహరణలు బోలెడు…
గంటన్నర సినిమాలో పెద్ద మెరుపులేమీ లేవు… సంగీతం గట్రా సోసో… బలమైన ఎమోషన్ లేకపోవడంతో కథనం బోరింగుగా అనిపిస్తుంది… ఒరిజినల్‌ను యథాతథంగా దింపేయడం గాకుండా కాస్త మార్పులు చేర్పులతో ప్రజెంట్ చేస్తే బాగుండేదేమో… ప్చ్, మన ఐశ్వర్యం నటన వేస్ట్ అయిపోయి ఫీలింగ్ కలుగుతుంది సినిమా అంతా అయిపోయాక…!!
Share this Article