Aranya Krishna……… కనీస నిజాయితీ, ఆర్ట్ లేని సినిమా! కొంతమందిని సమాజమే నేరాల వైపు పురికొల్పితే మరికొందరు సమాజాన్ని నేరపూరితం చేస్తారు. నేరాలు చేసే వారిలో కొందరిని సంఘమే పుట్టు నేరస్తులుగా ముద్ర వేస్తే రాజకీయాలలో భాగంగా హత్యలు, దాడులు చేసేవాళ్లని, అధికారం కోసం ఎన్నికల రిగ్గింగ్ కి పూనుకోవడం, డబ్బులు సారా విచ్చలవిడిగా పంచడం వంటి రాజకీయ నేరాలు చేసేవాళ్లని, ప్రభుత్వాలతో కుమ్ముక్కై క్విడ్ ప్రోకో స్కాంస్ వంటి ఆర్దిక నేరాలు చేసే కార్పొరేట్లని మాత్రం పెద్ద మనుషులుగా గుర్తిస్తుంది. ఏ నాగరిక ఫలాలకి, అభివృద్ధికి, విద్యకి, సంక్షేమానికి, భద్రతకి, భరోసాకి నోచుకోని ఓ వెనుకబడ్డ తెగకి కొంతకాలం పాటు దొంగతనాన్ని, దారి దోపిడీల్ని బతుకుతెరువుగా వ్యవస్థ నెత్తిన రుద్దితే తప్పెవరిది?
ఎప్పుడో 1871లో ఎరుకుల తెగని బ్రిటీష్ ప్రభుత్వం “క్రిమినలైజ్” చేస్తే 1952లో ఆ ముద్రని తీసేసినా స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తరువాత కూడా వారు ఆ ముద్ర నుండి బైటపడలేకపోతున్నారు. బ్రిటీష్ కాలంలోనే నేరస్తుల్ని సంస్కరించే పేరుతో ఏర్పాటు చేసిన స్టువార్ట్ పురం వాసి ఐన టైగర్ నాగేశ్వరరావు 1970లలో సమాజం దృష్ఠిలో నెగెటీవ్ గా ముద్రపడ్డ వాడు. గద్దల్ని కొట్టి కాకులకి పంచిన రాబిన్ హూడ్ తరహా నిజ జీవిత హీరో నాగేశ్వరరావు.
పులిలా పరిగెత్తగలడు కాబట్టి అతనికి టైగర్ అనే బిరుదుని తమిళనాడు పోలీసులిచ్చారు. ఆయన జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, నెత్తురు, నిరాశ, అవమానం, సాహసం, తెగింపు, హింస, తిరుగుబాటు, కారుణ్యం, దయ, మానవత్వం అన్నీ వున్నా ఆయనకి దొంగగానే పేరున్నది. చివరికి నేరాన్ని కాక నేరస్తుల్ని నిర్మూలించే ప్రభుత్వ యంత్రాంగంచే ఒక ఫేక్ ఎన్ కౌంటర్లో హత్య చేయబడ్డాడు. ఇప్పుడు ఆయనకున్న ఇమేజిని సొమ్ము చేసుకోడానికి ఆయన బయో పిక్ వచ్చింది. మంచి సినిమాల ద్వారా ఎవరికైనా సొమ్ములొస్తే అభ్యంతరమేముంటుంది? కానీ సొమ్ము చేసుకోడానికే వాస్తవాల్ని అభ్యంతరకరంగా మార్చి, నిజ జీవిత వ్యక్తుల వ్యక్తిత్వాల్ని దారుణంగా హత్య చేయడానికి పూనుకుంటే ఎలా ఒప్పుకోగలం?
Ads
ఓ అరగంటకు పైగా సినిమాని కత్తిరించినా 2.40 గంటల పాటు సాగే సినిమా భారంగా కొనసాగుతుంది. సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఓ కాలేజి అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపినట్లు (ఆ అమ్మాయి ఎపిసోడ్ చూస్తుంటే “పోకిరి” సినిమా గుర్తొస్తుంది), తమ సమస్యల్ని గుర్తింపచేయడానికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి ఇంట్లోనే దొంగతనం చేసినట్లు, విలన్ డెన్లో ఒకే రోజు 24మందిని హత్య చేసినట్లు (నిజానికి నాగేశ్వరరావు హత్యలు చేసేంత హింసాత్మక ప్రవృత్తి వున్న వాడు కాదు), ఇంకా ఎన్నెన్నో చూపించారు. నాగేశ్వరరావు గురించి వాకబు చేయడానికి ప్రధానమంత్రి అంతరంగిక భద్రతాధికారి మారువేషంలో స్టువార్ట్ పురంలో సంచరించాడని తీసేంతవరకు ఈ సినిమాటిక్ లిబర్టీ పైత్యం వెళ్లింది. అందుకే ఈ సినిమా నాగేశ్వరరావు గురించి కాదు, రవితేజ హీరోయిజం గురించి తీసిన సినిమా అనిపించింది. సినిమాకి “టైగర్ నాగేశ్వరరావు” కాకుండా “రవితేజ” అని పెడితే సముచితంగా వుండేది.
టైగర్ నాగేశ్వరరావు జీవితం కంటే గత సంవత్సరం వచ్చిన “పుష్ప”, ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం వచ్చిన “పోకిరి” ఈ సినిమాకి ఎక్కువగా ముడిసరుకుని అందించాయి. పుష్ప లో మాదిరే డార్క్ రియాలిటీ సెట్టింగ్స్, హీరో యాటిట్యూడ్, సైడ్ కేరక్టర్స్ ప్రవర్తన వుంటాయి. గుంటూరు, ప్రకాశం ప్రాంత వాసులు చిత్తూరు యాసలో, మాండలికంలో మాట్లాడటంతో ఈ సినిమా పుష్పకి కజిన్లా తయారైంది. పాత్రలు “ఏమప్పా”, “దుడ్లు” అంటూ మాట్లాడుతుంటాయి. వాస్తవికత గురించి ఏ మాత్రం పట్టింపు, స్పృహ లేకపోవడం ఈ సినిమాకున్న మరో దౌర్భాగ్య కోణం. ఇంక “పోకిరి” ప్రభావం కూడా తక్కువేమీ లేదు.
ఇంక అది నేపథ్య సంగీతం కాదు తండ్రీ! డ్రమ్ములో రాళ్లేసి దొర్లించినట్లు అదో హోరు. ఒక్క పాట గుర్తుంటే ఒట్టు. సుదీర్ఘ రైలు దోపిడీ సీన్ చూస్తుంటే ఏదో యానిమేషన్ చూసినట్లే నాసిగా అనిపిస్తుంది. చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఒక్కటీ లేదు. రవితేజ అదేదో హస్కీ వాయిస్లో మాట్లాడతాడు. అలా మాట్లాడటం గాంభీర్యం అనుకోవాలి కాబోలు. యలమంద – పుష్పలో అజయ్ ఘోష్ ని, కాశీ – ధనంజయని, కంచరపాలెం కిషోర్ – కేశవ్ ని, ఇందులో షణ్ముఖ పుష్పలో తన పాత్ర జక్కారెడ్డినే మనకి గుర్తుకు తెస్తే అది మన తప్పెంత మాత్రమూ కాదు. స్టోరీ బోర్డ్ సమయంలో దర్శకుడికి టైగర్ నాగేశ్వరరావు జీవితం కాక పుష్ప, పోకిరి సినిమాలు ముఖ్యమైపోయాయనేది అసలు పాయింట్. ఇంక హేమలత లవణంగారి పాత్ర వేసిన రేణూ దేశాయి ఏదో పిండిముద్దలా అభావంగా కనిపిస్తారు.
ఈ సినిమా మేకింగ్లో కనీస నిజాయితీ లేదు. అది పక్కన పెట్టినా స్క్రిప్టుని తయారు చేసుకోడంలో కనీస స్థాయిలో బుర్ర వాడలేదు. టైగర్ నాగేశ్వరరావు బయో పిక్ అని చెబితే ప్రేక్షకులు అందుకే సిద్ధంగా వుంటారు కానీ మరోసారి పుష్ప, పోకిరిలు చూడటానికి ఎందుకిష్టపడతారు? తెలుగు సినిమాకి పెద్ద విలన్ హీరోనే అని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. తెలుగు సినిమా వదిలించుకోవాల్సిన పెద్ద జాడ్యం హీరో! నోట్: ఈ సినిమా ఏ ఓటీటీలో వుందని నన్నడక్కండి. అమెజాన్ ప్రైంలో అందుబాటులో వుందనే దారుణ నిజాన్ని చెప్పాల్సి వస్తుంది. తరువాత నన్ను తిట్టుకునేరు మళ్లీ!
Share this Article