Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బెజవాడ ఆత్మగీతం… జ్ఞాపకాల పులకరింత… పలవరింత… బోలెడంత…

January 25, 2022 by M S R

(….. Mohammed Khadeerbabu ఫేస్‌బుక్ వాల్ నుంచి సేకరణ) ………….    నేను జర్నలిజంలోకి వచ్చే సమయానికి ప్రకాష్‌ గారు జర్నలిజం నుంచి రిటైర్‌ అయిపోయారు. 1995… సోషల్‌ మీడియా లేదు. ఘనకీర్తులు చెప్పుకోవడం ఇప్పటిలా ఫ్యాషన్‌ కాదు. ఆకులందు అణిగిమణిగి కళా కోకిల పలుకవలెనోయ్‌… లెఫ్ట్‌ సంప్రదాయం. కాల సంస్కారం. మహా మేధావి బాలగోపాల్‌ రెడ్‌ హిల్స్‌ వీధుల్లో పాత స్కూటర్‌ మీద కనిపించేవారు. తెలుగులో తొలి మహిళా న్యూస్‌ ఎడిటర్‌ వేమన వసంత లక్ష్మి ప్రెస్‌క్లబ్‌ మీటింగ్‌లలో సగటు ప్రేక్షకురాలిగా ఉండేవారు. ‘ద్వారకా’ వెళితే ముగ్గుబుట్ట తలతో చేకూరి రామారావు ఏ భేషజం లేకుండా నవ్వుతూ పలకరిస్తుండేవారు. పుచ్చలపల్లి హాల్లో తారసపడిన వివి సిమెంట్‌ కలర్‌ ప్యాంట్, లేత రంగు చొక్కాలో ప్రశంసగా చూస్తూ ఆప్యాయంగా హత్తుకునేవారు. శివారెడ్డి గారు తన ఖర్చుతో కాఫీ పోయించేవారు. మోహన్‌ గారి దగ్గరకు వెళితే ఇంటి పేరు అడక్కుండా బువ్వ పెట్టేవారు. ప్రకాష్‌ గారు అక్కడ ఉండేవారు.

మార్క్స్‌ను డ్రైవర్‌గానూ మావోను గార్డ్‌గానూ పెట్టుకున్న సాహితీ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ఒక కాలాన తెలుగు నేలన భుగభుగలతో పరిగెత్తి, మెల్లగా స్పీడు కోల్పోతూ, ప్లాట్‌ఫామ్‌ దొరక్క, సిగ్నల్స్‌ తికమకలతో అతి మెల్లగా ఆఖరు స్టేషన్‌వైపు వెళుతున్నదా అనిపించినప్పుడు కూడా లోపల ఉన్నవారితో పాటు పొలాల గట్టున ఉండి చేతులు ఊపుతున్నవారినీ ప్రభావితం చేసింది. ఆఖరు పెట్టె గ్లిమ్స్‌ పొందిన వారూ ఆ గాలి తగిలి శ్వాసనాళాల్లో ఉన్న తెమడ కొద్దో గొప్పో బయటకు ఊశారు.

గొప్ప ఆలోచనలు కొద్దిగానే పుడతాయి. వాటి సజీవత్వానికి మనుషులు పెనుగులాడతారు. మార్క్సిజం చదవక్కర్లేదు. లెఫ్ట్‌ ఉద్యమాల్లో చేయనక్కర్లేదు. కాని మార్క్సిస్టు ఆవరణం తెలియకపోతే, ఆ దృక్పథం ఉన్న ఆలోచనాపరులతో కనీస పరిచయం కూడా లేకపోతే ఏ కళాకారుడికైనా ఒక కన్ను ఒక రెక్క ఎప్పటికీ తెరుచుకోవు అనిపిస్తుంది. ఏమి గీయాలి, ఏమి పాడాలి, ఏమి రాయాలి… అంతిమంగా ఇవన్నీ ఎందుకు చేయాలి… తెలుస్తుంది. కొందరి కళ నిలుస్తుంది చూడండి. ఇందుకే కావచ్చు. కొందరి కళ గౌరవించ బుద్ధేస్తుంది. ఇందుకే కావచ్చు. ‘ఓపెన్‌ హౌస్‌’.. కుల, మత, ప్రాంత అనే తేడా లేకుండా సహస్ర కళల సమస్త చిహ్నాల వారు మోహన్‌ గారి ఆఫీస్‌లో ఉండేవారు. అర్హతగా ప్రతాపాలు చూపించనక్కర్లేదు. మనిషి కోసం కొంత హామీ ఇస్తే చాలు. ప్రకాష్‌ గారు అక్కడ ఉండేవారు.

Ads

నవోదయ రామ్మోహనరావు గారు, ఖాదర్‌ గారు, పెద్దిభొట్ల, మో, భమిడిపాటి జగన్నాథరావు… తదితరులు అట్రాక్షన్‌గా మిగలగా బెజవాడ దాదాపుగా ఖాళీ అయ్యింది. అక్కడ పని చేస్తూ వచ్చిన జర్నలిస్టులు, కవులు, రచయితలు హైదరాబాద్‌ వచ్చేశారు. 1995కు అటు ఇటుగానే. త్రిపురనేని శ్రీనివాస్‌ సండే మేగజీన్‌కు ఇన్‌చార్జ్‌గా వచ్చి సిటీ డెస్క్‌లో చేస్తున్న నన్ను ఫీచర్స్‌లోకి తీసుకున్నాడు. ఈ చిన్న మార్పు జరగకపోయి ఉంటే నా కథ సంపూర్ణంగా వేరే ఉండేది. మోహన్‌ గారు, వసంత లక్ష్మి గారు, ఆమె ఇంటికి అడపాదడపా వచ్చే చలసాని ప్రసాద్‌ గారు, డానీ గారు వీళ్లందరి మాటల్లో బెజవాడ తాలూకు సంఘటనాయుతమైన ఘనత హైదరాబాద్‌లో పునరుజ్జీవమై వినిపిస్తూ ఉండేది. ఆ నగరం క్యారెక్టర్‌ను వినడమూ దానిని నిర్మించిన వాళ్లను చూడటమూ బాగుండేది. మద్రాసును నేటికీ ఓన్‌ చేసుకోవడమే రక్తంలో ఉన్న నాబోటి నెల్లూరు వాడికి బెజవాడతో ఏ బాదరాయణ బంధం లేకపోయినా ఆ క్రానికల్స్‌ను తెలుసుకోవడం అక్కరగా అనిపించేది. ముఖ్యం ప్రకాష్‌ గారి డ్రమెటిక్‌ రీవైండ్‌ మాటల్లో.

eluru road

సాంస్కృతిక పట్టణాలు– తెలుగు వారివి– హైదరాబాద్, విజయనగరం, విశాఖ, రాజమండ్రి, వరంగల్, విజయవాడ, తిరుపతి.. వీటి ఉత్థాన పతనాలు… రేపిన అలలు… తిరుగాడిన పెద్దలు… నాటి విలువలు.. పేచీలు.. పరిహాసాలు… ఇవన్నీ తెలుగువారి ఉమ్మడి చరిత్ర. పరస్పర ఆధారితం. పరస్పర ప్రేరేపితం. ఈ ప్రాదేశిక చరిత్రే దేశ చరిత్ర. మద్రాసు గురించి తమిళులు, కోల్‌కతా గురించి బెంగాలీలు, లక్నో గురించి ముస్లింలు, బెనారస్‌ గురించి హిందువులు రాసుకున్నట్టుగా తెలుగువారు తమ ఘన పట్టణాల గురించి రాసుకున్నా అవన్నీ ఒక వాకిట ప్రకాష్‌ గారు బెజవాడ గురించి రాసిన ఈ ‘ఏలూరు రోడ్‌ ఆత్మగీతం’ ఒక వాకిట. ఇది విట్టీ. ఇది టియర్‌ఫుల్‌. ఇది నోస్టాల్జిక్‌. ఇది పొజెసివ్‌. ఇది ప్రైడ్‌. ఇది ప్రౌడ్‌.

జననము, చదువు, సంపాదన, రెండు భవంతులు, ఒక కారు.. ఇది నిజమే కాని ఇది లేకుండా వేరే ఏదో చేసేవారు, ఈ గానుగెద్దుగా ఉన్నా విడిపించుకుని వెళ్లి ఏదో ఒక బీడు చదును చేయాలనుకునేవారు, చిటారు కొమ్మన కూచుని ముక్కును దిక్కులకు విసురుతున్న పిట్టను చూడటమే ధన్యత అనుకునేవారు, పెళ్ళిళ్లకు హాజరవడాన్ని బోర్‌ ఫీలయ్యేవారు, ఏ రసాస్వాదన లేకనే జీవించి గతించిపోయేవారిని చూసి జాలి పడేవారు కొందరు ఉంటారు… ఆ కొందరు తన వారిని తన ఊరిని చూసుకుంటే వారి కంట పడేవి ఏవి? వారు పంచుకునేవి ఏవి? వారు పొంగిపోయే పక్షి ఈక కంటే అల్పమైన సంగతి ఏమిటి? వారు శ్లాఘించే అతి ఘనమైన ఘటన కంటే ఘనమైనది ఏది? ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది.

రుచి అనేది ఒకటి ఉంటుంది. ఈ పుస్తకంలో అటువంటి రుచి కలిగిన మనుషుల జీవితాలను ఇప్పటికిప్పుడు పొందలేకపోవచ్చు. కనీసం ఆ రుచిని చూసి అప్పుడప్పుడు ఇమిటేట్‌ చేస్తున్నట్టుగా అభినయించడానికైనా చదవాలి.

tadi prakash

ప్రకాష్‌ గారు చాలా గొప్ప జర్నలిస్టుల కంటే గొప్ప జర్నలిస్టు. భారతదేశంలో వర్గ రాజకీయాలు ఉండవని సామాజిక వర్గ రాజకీయాలు ఉంటాయని ఏ న్యూస్‌ పేపర్‌ పట్టుకుని అయినా దానిలోని ఏ వార్తతోనైనా ఆయన నిరూపిస్తారు. నేటి రాజకీయ నాయకుల చిన్న కదలిక ఎప్పుడో ఆరు నెలల తర్వాత ప్రజలకు పగలనున్న మూతిపళ్లకు సమానం అని ఊరికే సిగరెట్‌ వెలిగించినంత చిటంలో చెప్తారు. ఆయన చాలా తేలిగ్గా కనిపించే సీరియస్‌మేన్‌. సీరియస్‌గా కనిపించే విదూషక మిత్రుడు. ఆయన రాసేది విదూషక వచనం. డోలో వేసుకుని పడుకుని ఉన్నట్టుగా వచనం రాసే వారందరూ ప్రకాష్‌ ‘ఏలూరు రోడ్‌ ఆత్మగీతాన్ని’ ఐదు రోజులు రెండు పూటలా వాడితే నయం అవుతారు. గొల్లుమనిపించే ఆయన ‘పదభంగాలు’ ఆయన నోటే విన్నా సరే.

మోహన్‌ అనే ఆకర్షణలో నేను ఎప్పుడూ ప్రకాష్‌ గారికి స్టూల్‌ వేసి కూచోబెట్టాను. ‘అంకుల్‌.. బాల్‌’ అంటే నవ్వుకుంటూ అందించే పెద్దమనిషిలా ప్రకాష్‌ గారు నన్ను క్షమించారు. కాని మోహన్‌ని ఒక్కణ్ణే చూడటం నాకు బోర్‌. మోహన్‌తో పాటు ప్రకాష్‌ ఉంటేనే ఆ రాత్రి అక్కడ బస. అందరూ అదే కోరేవారు. ఎవరూ ఆ మాట చెప్పేవారు కాదు. ప్రకాష్‌ గారి వెక్కిరింత అడుగున గొగ్గిరి రాతి శిలను పెకలిస్తే జల ఉంటుంది. ఆ జల తెలిసినవారికే ఆయన తెలుస్తాడు. మొన్న నన్ను కలిసిన ప్రకాష్‌ గారు పుస్తకం అందిస్తూ ‘జాణకథ హీరో ఖదీర్‌’కి అని రాశారు. ఆయన తన ‘ఏలూర్‌ రోడ్‌ ఆత్మగీతం’లో చాలామంది గురించి రాశారు. నేనిక్కడ ఆయన గురించి రాసి మొగలాయిని అయ్యాను. ఈ ‘చూద్దారి అంటే చూద్దారి’ అనుకునే మనోహర వేళలతోనే మా జీవితాలు నిండుగాక. కంగ్రాట్యులేషన్స్‌ సర్‌. థ్యాంక్యూ ‘ఆన్వీక్షికి’ ఫర్‌ పబ్లిషింగ్‌ దిస్‌ బుక్‌.

పి.ఎస్‌: మోహన్‌ గారూ.. మీ తమ్ముడి పుస్తక ఆవిష్కరణ సభకు నేనే అధ్యక్షుణ్ణి. మీరు కనపడి మీసం చివరను సవరించుకుంటూ ‘ఏంటబ్బా.. నీ ఓవరాక్షన్‌’ అనడం భలే సంబరం. ఇది ఎంతో కద్దు.   (ఈ బుక్ అమెజాన్‌లో కూడా దొరుకుతుంది… లింక్ ఇదీ… Eluru Road Atmageetam https://www.amazon.in/dp/B09PZ6Z8HC/ref=cm_sw_r_wa_api_glt_i_XFPV0PG8YYCFMXNTJMTN...)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions