.
బనకచర్ల… మిగతా ఇష్యూల్లాంటిది కాదు… చాలా సంక్లిష్టమైంది… ఇందులో చంద్రబాబు ఆర్థిక వ్యూహాలే కాదు, చాలా పొలిటికల్ ఈక్వేషన్లు కూడా ముసురుకుని ఉన్నాయి… నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకే సమయంలో కేంద్రంతో, ఏపీతో పోరాడే సందర్భం… ఒకే సమయంలో బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, జనసేనలతో పోరాడే సందర్భం…
ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బనకచర్ల ఎలా తెలంగాణకు వ్యతిరేకమో చెబుతున్నారు కదా… సేమ్, తెలంగాణ సమాజానికి కూడా అర్థమయ్యేలా పత్రికల్లో సవివర ప్రకటనలు ఇవ్వడం కూడా అవసరమేనేమో…
Ads
రేవంత్ బహుముఖ పోరాటం గురించి… పొలిటికల్ కోణంలో చెప్పాలంటే… ఓ సమగ్ర బనకచర్ల రాజకీయ చిత్రం ఆవిష్కరించాలంటే ఇలా…
1) కూటమి, అనగా ఏపీలోని బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తే అది తనకు నష్టదాయకం… సో, బనకచర్ల ఎంచక్కా కలిసొచ్చింది ఆ పార్టీకి… తద్వారా తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తూ… పొలిటికల్ ఫాయిదా కోసం ఆరాటం… పనిలోపనిగా రేవంత్ రెడ్డీ, చంద్రబాబు ఒకటేనని ముద్ర వేసే ప్రయత్నం… సో, రేవంత్ ఈ ఇష్యూలో బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ సాధించకుండా పోరాడాల్సిందే…
2) ఎన్ని అడ్డంకులున్నా… కేంద్రంలో మోడీ ప్రభుత్వం తన మీద ఆధారపడి ఉంది కాబట్టి… ఎలాగోలా, అవసరమైతే మోడీ తల వంచి మరీ అనుమతులు సాధిస్తాననే ధీమా చంద్రబాబుది… సో, రేవంత్ రెడ్డి ఒకేసమయంలో అటు కేంద్రంతోనూ, ఇటు ఏపీతోనూ ఏకకాలంలో పోరాడకతప్పని పరిస్థితి…
3) తెలంగాణ బీజేపీది పచ్చి వెలక్కాయ గొంతులో ఇరుక్కున్నట్టు సిట్యుయేషన్… ఖండించలేదు, వ్యతిరేకించలేదు… ఇరు రాష్ట్రాలకూ సమన్యాయం అని ఏవో నాలుగు పడికట్టు పదాలు వాడుతోంది… సో, ఈ సిట్యుయేషన్‌ను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుని ఏకకాలంలో అటు టీడీపీకి, ఇటు బీజేపీకి చెక్ పెట్టే పోరాటాలు తప్పవు… జనసేన పెద్ద నిర్ణయాత్మకం కాదు తెలంగాణలో…
4) బీజేపీ ప్రభుత్వాలే ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రల నుంచి తెలంగాణకు అవసరమైన సపోర్టు వస్తుందో రాదో… కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్న కర్నాటక నుంచి సహకారం తీసుకోవాలి… ఎందుకంటే, గోదావరి అంతర్రాష్ట్ర నది, ఏ నిర్ణయమైనా అన్ని రాష్ట్రాలనూ ప్రభావితం చేస్తుంది కాబట్టి… కొంతమేరకు మధ్యప్రదేశ్ కూడా…
5) కర్నాటకలో గోదావరి ప్రవాహం, దాని ఉపనది మంజీరా బేస్డ్… పైగా నదీజలాల బేసిన్లు మారినప్పుడు ఎగువ రాష్ట్రాలు కృష్ణాలో వాటాను కోరతాయి… ఇదుగో ఇన్ని లెక్కలు… ఐనా సరే…
నిన్న శ్రీశైలం గేట్లు ఓపెన్ చేస్తూ, జలహారతి సమర్పిస్తూ చంద్రబాబునాయుడు మళ్లీ చెప్పాడు… బనకచర్ల ప్రాజెక్టు సాధిస్తామని…! వృథాజలాలు, మిగులుజలాలు, వరదజలాలు అంటూ ఏవో పేరు చెబుతాడు…
సాక్షాత్తూ సీడబ్ల్యూసీ, కేంద్ర పర్యావరణ అనుమతుల సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసినా… ఏపీ ప్రతిపాదనల్ని వాపస్ పంపించినా… అసలు పోలవరం వద్ద మిగులు లేదా వరదజలాల లెక్క ఎవరు తేల్చారని ప్రశ్నించినా… చంద్రబాబు తన బనకచర్ల పాట మాత్రం ఆపడం లేదు…
కేంద్రమే ఒకవైపు నదుల అనుసంధానం పేరిట ఇచ్చంపల్లి టు కావేరి ఆలోచిస్తోంది… ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టుకు ఏ మార్పులు చేసినా సరే అది పార్లమెంటు ఇచ్చిన ఆమోదానికి వ్యతిరేకం అవుతుంది… ఆల్రెడీ పోలవరం ముంపు మీద చత్తీస్‌గఢ్, ఒడిశా అభ్యంతరాలు కోర్టులో ఉన్నాయి, సో కొత్తగా ఏం చేసినా సబ్ జుడీస్ అవుతుంది…
చత్తీస్‌గఢ్ రెండు కొత్త ప్రాజెక్టులు కడతానంటోంది, మోడీ కూడా సై అన్నాడు, అవే నిర్మిస్తే పోలవరం పాయింటుకు గోదావరి జలాల లభ్యత చాలా పడిపోతుంది… ఐనా సరే, చేసేస్తా అంటున్నాడు చంద్రబాబు… రేవంత్ రెడ్డి ప్రభుత్వం బనకచర్ల కుట్రను అడ్డుకోవడానికి ఇదుగో ఇన్ని కోణాల్లో పోరాటం చేయాల్సి వస్తోంది… చేయాలి కూడా…
నిజానికి ఈ గోదావరి జలాల్ని లెక్క లేకుండా వాడేసుకునే ప్రతిపాదన అచ్చంగా జగన్- కేసీయార్‌లదే… 2019లో కావచ్చు… ఇద్దరూ సమావేశమై కలిసి ఓ భారీ ప్రాజెక్టు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు… ఎందుకో వర్కవుట్ కాలేదు, దాన్ని ఇప్పుడు చంద్రబాబు నెత్తికెత్తుకుంటున్నాడు…
2014లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు ఇదే గోదావరి టు పెన్నా టు చెన్నై పేరిట వైకుంఠాపురం ప్రాజెక్టు తలపెట్టాడు… బొల్లాపల్లి మీదుగా సోమశిల… ఓ రిజర్వాయర్‌కు శంకుస్థాపన కూడా చేశాడు… దానికి పాతరేసి ఇప్పుడు బనకచర్ల పాట ఎత్తుకున్నాడు… నిజానికి ఏపీ మేధావులే దీన్ని వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా… ఇది ఏపీని మరింత దివాలా తీయిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది…
మరొకటి… కర్నాటకలో షెరావత్ ప్రాజెక్టు పేరిట సేమ్ ఇలాంటిదే… అడవుల మీద కాలువలు, సొరంగాలు… యాన్యుటీ పద్ధతి… వయబులిటీ గ్యాప్ ఫండ్ కూడా ప్రస్తావన ఉందట… సేమ్, అదే పద్ధతిలో బనకచర్ల అని ఏపీలో పత్రికలు రాసుకొస్తున్నాయి…
బనకచర్ల నిర్మించాలంటే నల్లమల అడవుల్లో 18 కిలోమీటర్ల సొరంగం తవ్వాలి… దీనికి అనుమతులు అంత ఈజీ కాదు… పులుల సంతానోత్పత్తి సీజన్ వస్తే, మొత్తం రాకపోకలే బంద్ చేస్తారు, నిశ్శబ్దం కోసం… దారిలో ఓ గుడికీ వెళ్లనివ్వరు, మరి ప్రాజెక్టు సొరంగం పనులు సాధ్యమేనా..?
అంతేకాదు, రాజ్యాంగ రక్షణ కలిగిన చెంచుల ఏజెన్సీ ఉంది అదే దారిలో… వారి సహజ జీవనానికి ప్రతిబంధకంగా మారే ఏ అంశాన్నీ సుప్రీంకోర్టు వదిలిపెట్టదు… ఇదుగో ఇన్ని అడ్డంకులు… ఇక చూడాలి, చంద్రబాబు ఎలా సాధిస్తాడో..!! రేవంత్ రెడ్డి ఏమేరకు ఫైట్ చేస్తాడో..!!
Share this Article