.
Mohan Goteti …. ఊర్మిళ ఇంటర్వ్యూ చెడగొట్టిన వర్మ!
మొదట్లో అసలు రాంగోపాల్ వర్మకి, తెలుగు సినిమా జర్నలిస్టులకి మధ్య సంబంధాలు లేవు.
తెలుగు జర్నలిస్టులతో ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు..
ఎక్కడైనా షూటింగుల్లో పలకరించినా ఏదో పొడిపొడిగా రెండు ముక్కలు మాట్లాడేవారు., అంతే!
ఆయనని ఇంటర్వ్యూ చేద్దామని చాలామందిమి ప్రయత్నించినప్పటికీ వర్కౌట్ కాలేదు.
సినిమా జర్నలిస్టుల మీద, తెలుగు సినిమా పత్రికలపైనా ఆయనకేవో అభిప్రాయాలు ఉండేవి..
దాంతో మాతో దూరం పాటించారు.
ఆయనలా ఉండడంతో.. మేం కూడా ఆయన మీద జోకులు వేసుకునే వాళ్లం.
మనోడు బాగా పోజు కొడుతున్నాడని అనుకునే వాళ్లం!
నో డౌట్.. వర్మ గొప్ప టెక్నీషియన్..
‘శివ’ సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా మేకింగ్ స్టయిల్ ని మార్చి పారేశాడు.
పాత మూస పద్ధతికి పాతరేశాడు..
కొత్తరకం సినిమాను ఆవిష్కరించాడు..
దాసరి నారాయణరావు గారి తర్వాత మళ్లీ డైరెక్టర్ అన్న పోస్టుకి ఓ గౌరవాన్ని, విలువను తెచ్చాడు.
ఎటొచ్చీ పబ్లిసిటీ కోరుకునేవాడు కాదు..
Ads
సినిమా.. సినిమా.. సినిమా.. అదే లోకం ఆయనకు!
దాంతో గర్విష్టి అనే బ్రాండ్ పడిపోయింది ఆయనకు..
ఇక ఆయనను తొలిసారిగా ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు ‘అనగనగా ఒక రోజు’ సినిమా షూటింగ్ సమయంలో కలిగింది.
వర్మ పీఆర్వో, మా మిత్రుడు అయిన గిరిధర్ మన గురించి ఏం బిల్డప్ ఇచ్చాడో తెలియదు గానీ, ఓ రోజు వర్మ ఇంటర్వ్యూకి పిలిచారు.
అప్పట్లో ఆయన పంజాగుట్ట ప్రాంతంలో వుండేవారు.
ఇంటర్వ్యూకంటే ముందు వరల్డ్ సినిమా నుంచి.. అటు కామన్ వెల్త్ కంట్రీస్ గురించీ, థర్డ్ వరల్డ్ కంట్రీస్ వరకు.. చాలా విషయాలు మాట్లాడుకున్నాం.
ఆ తర్వాత పెద్ద ఇంటర్వ్యూ..
అది మర్నాడు ‘ఈనాడు’ సినిమా పేజీలో పబ్లిష్ అవగానే సెన్సేషన్ అయింది.
ఆయనతో లాంగ్ కన్వర్జేషన్ అయ్యాక నాకు అర్థమైంది ఏమిటంటే.. ‘ఆయన ఇతరుల గురించి అస్సలు పట్టించుకోడు.. తన గురించి ఎవరైనా పట్టించుకున్నా కూడా ఈయన పట్టించుకోడు’ అని!
వర్మ మహా మేధావి!
ఏ విషయం గురించైనా సరే తెలుగులోనూ, ఇంగ్లిష్ లోనూ అనర్గళంగా మాట్లాడతాడు.
అతని పాయింట్ మనకు నచ్చకపోవచ్చు ..
మనం అవునన్నది అతను కాదనచ్చు..
అసలు మనం అవునంటే తను కాదంటాడు.. మనం కాదంటే తను అవునంటాడు.
మనతో ఆయన ఏకీభవించే అంశాలు చాలా రేర్ అనే చెప్పచ్చు!
- అంతెందుకు.. ఓసారి ఐశ్వర్య రాయ్ అందం గురించి నేను ప్రస్తావిస్తే, ఆమెది అస్సలు అందమే కాదు అన్నారాయన.
ఇంకేం చెబుతాం ఆయనకి?
ఇంకెలా ఒప్పిస్తాం ఆయనని?
పైగా తన అభిప్రాయాన్ని నదురూబెదురూ లేకుండా.. నిర్మొహమాటంగా.. చాలా స్ట్రాంగ్ గా వాదిస్తూ ఎనలైజ్ చేస్తారాయన.
అయితే ఒకటి.. మనం ఆయన అభిప్రాయంతో ఏకీభవించనప్పటికీ, ఆయన చెప్పే లాజిక్ మాత్రం కన్విన్సింగ్ గా వుంటుంది!
తొలిసారి ఇంటర్వ్యూ అయ్యాక ఆయనతో పరిచయం బాగా పెరిగింది..
ఆయన షూటింగులు వున్నప్పుడు వెళ్లడం.. ఇంటర్వ్యూలు చేయడం మామూలైంది.
తన మనసుకు నచ్చితే ఎవరితోనైనా సరే వర్మ చాలా ఫ్రీగా మాట్లాడతారు.
నిర్మాతనైనా.. ఆఫీసు బాయ్ నైనా ఒకేలా ట్రీట్ చేస్తారు..
ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్నది అస్సలు తెలియదు ఆయనకి.
ఒకసారి బంజారాహిల్స్ రోడ్లపై ‘దౌడ్’ హిందీ సినిమా షూటింగ్ చేస్తున్నారాయన.
సంజయ్ దత్, ఊర్మిళ మటోండ్కర్ లపై సీన్స్ తీస్తున్నారు..
వెళ్లి విష్ చేశాను.. “కాసేపు ఆగండి, మాట్లాడుకుందాం” అన్నారు.
షాట్ గ్యాప్ లో ఊర్మిళని ఇంటర్వ్యూ అడిగాను.
“రేపు కాస్త ఫ్రీగా వుంటాను.. రండి.. మాట్లాడుకుందాం” అని చెప్పింది.
ఈలోగా ఆ షూటింగుకి బ్రేక్ చెప్పారు వర్మ.
“ఇక్కడెందుకు.. మా ఆఫీసుకు వచ్చేయండి.. అక్కడ మాట్లాడుకుందాం” అన్నారు.
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వెనుక వీధిలో ఆయన ఆఫీసు వుండేది.
వెళ్లాక ఇద్దరం కలిసి ఆయన రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నాం.
ఈలోగా డోర్ తీసుకుని సంజయ్ దత్ వచ్చాడు మా రూంలోకి.
ఆయనని చూడగానే ఇతర దర్శకులు ఎవరైనా అయితే ఏం చేస్తారో తెలుసా?
అగ్గగ్గలాడిపోతూ .. లేచి నిల్చుని.. ‘రండి రండి’ అని ఆహ్వానించి.. మనల్ని కాసేపు బయట వెయిట్ చేయమంటారు..
తనూ అలాగే అంటే, ఆయన వర్మ ఎందుకు అవుతారు?
“సంజయ్.. నేనిక్కడ మాట్లాడుతున్నాను.. కాసేపు బయట వెయిట్ చెయ్” అన్నారు వర్మ.
అతను అర్థం చేసుకున్నాడు.. చాలా క్యాజువల్ గా “సారీ.. ఓకే సార్” అంటూ బయటికి వెళ్లిపోయాడు.
కాసేపటికి డోర్ తీసుకుని రివ్వుమంటూ వచ్చింది ముద్దుగుమ్మ ఊర్మిళ..
వర్మ నోటి నుంచి సేమ్ డైలాగ్..
ఆమె మొహం చిన్నది చేసుకుని.. రుసరుసలాడుతున్నట్టు.. వెళ్లిపోయింది..
మరో పది నిమిషాలు పోయాక వర్మకు బై చెప్పి, నేను బయటకు వచ్చాను.
సంజయ్ దత్ అలాగే కుర్చీలో కూర్చుని వున్నాడు.
ఊర్మిళ కూడా అక్కడే వుంది..
ఆమె ముఖంలో చిటపటలు కనిపిస్తున్నాయి..
నాకేసి చూసి ముఖం తిప్పేసుకుంది..
నేను బయటకు వచ్చేయబోతూ.. మళ్లీ రెండడుగులు వెనక్కి వేసి.. “రేపు ఇంటర్వ్యూ ఎన్ని గంటలకు పెట్టుకుందాం?” అనడిగాను.
“సారీ.. రేపు నేను వుండడం లేదు..” అనేసి వర్మ రూంలోకి వెళ్లిపోయింది.
అదేమిటి?
ఇందాకనే కదా.. రేపు ఇంటర్వ్యూ పెట్టుకుందాం అంది.. ఇంతలోనే మాట మార్చేసింది ఏమిటి?
అన్నది ఆలోచిస్తే.. దీనికి కారకుడు వర్మేనని నాకు అర్థమైంది.
లోపల రూమ్ లో నేనున్నప్పుడు తను వస్తే.. బయట వెయిట్ చేయమని నా ముందే వర్మ చెప్పడంతో.. పాపం తను హర్ట్ అయిందనిపించింది!
అందుకే, వర్మ మీద కోపం అలా నా మీద చూపించిందన్న మాట!
మర్నాడు ఈ విషయాన్ని మిత్రుడు చక్రీ (జేడీ చక్రవర్తి)కి చెబితే .. “అయ్యో..” అంటూ తెగ నవ్వాడు.
ఇక్కడ వర్మ గారు నాకు వాళ్ల ముందు అంత గౌరవం ఇచ్చారని నేను ఆనందించాలా?
లేక, ఊర్మిళ ఇస్తానన్న ఇంటర్వ్యూ చెడగొట్టారని బాధపడాలా?
-మోహన్ గోటేటి
#RamGopalVarma
#Sanjaydath
#oormila
#doudmovie
Share this Article