Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టైముకు ఏమున్నా లేకున్నా యింత తొక్కో కారమో ఏస్కొని బుక్కెడన్నం తింటే సాలు

April 12, 2023 by M S R

Vijayakumar Koduri……….    బియ్యం బస్తాలు ……… ఇస్త్రీ షాపు దగ్గర ఐరన్ చేసిన డ్రెస్సులు తీసుకోవడానికి నిలబడ్డాను – షాపు ఓనరు, అతని మిత్రుడు మాట్లాడుకుంటున్నారు. ‘ఈసారి బియ్యం బస్తాల కోసం అడిగితే కింటాలు నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నరే! కరోన తర్వాత అడ్డగోలు రేట్లు చెప్తున్నరు’ ఓనరు తన మిత్రునితో అన్నాడు

‘ఔ – బియ్యం బాగ పిరమైనయ్యే! పోయిన వారమే నేను తీసుకున్న. నలబయి ఆరొందలు పడింది. వాళ్ళను అడిగి జెప్త తియ్’ మిత్రుడు భరోసా ఇచ్చాడు. ‘సాలుకు సరిపోను యింట్ల యిన్ని గింజలుంటే కొంచెం నిమ్మళమన్న! టైముకు ఏమున్నా లేకున్నా యింత తొక్కో కారమో ఏస్కొని బుక్కెడు అన్నం దింటె సాలు’ ఒక వైపు ఇస్త్రీ చేస్తూ ఆ షాపు ఓనర్ తన మిత్రునితో అన్నాడు.

‘కడుపు నిండుగ సల్లటి మాట జెప్పినవ్ పో!’ నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. వరంగల్ రైల్వే గేట్ అవతల వుండే ఒక చిన్న సైజు స్లమ్ ఏరియాలో గూనపెంకుల ఇంట్లో కిరాయికి వుండేవాళ్ళం. అగ్గిపెట్టెల వంటి మూడు గదులు- వెనుక వైపు వంటగది, బజారు వైపు గది, నడుమ కొంచెం పెద్ద గది. నాన్న, అమ్మ, తాతయ్య, నాయనమ్మ, బాబాయ్, నేను, నలుగురు చెల్లెల్లు – అందరం ఆ మూడు గదులలో!

Ads

నా పదో తరగతి పూర్తయే వరకు వున్న ఆ ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు. ఆ చిన్నప్పటి రోజులలో, అన్ని కాలాలలోకి నాకు ఇష్టమైన కాలం – ఎండాకాలం! సెలవులు వొస్తే ఆట పాటలతో గడపొచ్చని కాదు – రాత్రుళ్ళు ఇంట్లో ఇరుకిరుగ్గా పడుకోనవసరం లేకుండా, ఇంటి వెనుక నేల మీద చాపలు పరుచుకుని, నులక మంచాలు వేసుకుని హాయిగా పడుకోవొచ్చు, చుట్టుపక్కల ఇళ్ల పిల్లలతో పడుకుని ముచ్చట్లు చెప్పుకోవొచ్చు అని.

చలికాలం కొద్దిగా నయం – వానాకాలం మాత్రం ఎప్పుడూ పీడకల ! వర్షాకాలం ఇక రాబోతుంది అన్న టైములో అన్ని ఇళ్ల లోని పిల్లలం ఇళ్ల పైకప్పులు ఎక్కేవాళ్ళం – ఆడుకోవడానికి కాదు- వర్షం వస్తే ఇల్లు కురవకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా కప్పు మీది గూన పెంకులు సర్దడానికి! ఎంత ‘సదిరినా’, కాస్త గట్టి వాన పడితే ఇక ఆ రాత్రికి జాగారమే!

ఒక్కోసారి ఇంట్లో వున్న గిన్నెలూ, చెంబులూ సరిపోయేవి కావు, కప్పు నుండి కారే వాన నీటి ధారలను కవర్ చేయడానికి! అటువంటి ఇంట్లో, అటువంటి రోజులలో మా నాన్న, తన స్నేహితులు కొందరితో కూడి బియ్యం బస్తాలు బేరం చేసి, సంవత్సరానికి సరిపడా ఇంటికి తెచ్చేవాడు. అవి ఇంటికి తెచ్చిన రోజున, ఎంత చాకచక్యంగా బేరం చేసి మంచి ధరకు (అంటే, అగ్గువకు) ఆ బియ్యం తెచ్చిందీ మా అమ్మకు గొప్ప సంతోషంతో చెప్పేవాడు.

మా నాన్న టీచర్. విలువలతో ఉద్యోగం చేసిన ఉపాధ్యాయుడు. నేను గమనించిన సంగతి ఏమిటంటే, ఈ బియ్యం కొనడం వంటి పనులు, అప్పటి టీచర్లు ఒక బృందంగా ఏర్పడి, ఉద్యమంలా చేసేవాళ్ళు. మా వాడ దాటి ముందుకు వెళితే ఖిల్లా వరంగల్. అక్కడ చక్రపాణి గారని మా నాన్న టీచర్ మిత్రుడు ఉండేవాడు. ఆ రోజులలో చక్రపాణి గారు ఉపాధ్యాయ సంఘం లీడర్ కూడా! ఇటువంటి పనులకు ఆయనే నాయకత్వం వహించి, ఓ ఇరవై ముప్పై మంది టీచర్లకు ఏడాదికి సరిపడా బియ్యం బస్తాలు బేరం చేసి పెట్టేవాడు.

బియ్యమనే కాదు – దసరా వచ్చిందంటే, ఆ పండుగ రోజు కోసం, ఖిల్లా వరంగల్ లో ఒక నాలుగైదు మేక పోతుల్ని కట్ చేయించి పెడితే, ముందే డబ్బులు ఇచ్చిన మా నాన్న లాంటి వాళ్ళు దసరా రోజు పొద్దున్నే వెళ్లి ఇచ్చిన డబ్బులకు సరిపోయే ‘పోగు’ (share) తెచ్చుకోవాలి- అదంతా వేరే కత!

ఇక ‘ఒకేసారి బియ్యం బస్తాలు తేవడం’ మీద మా అమ్మకు ఇబ్బందులు వున్నా ఏమీ చెప్పలేని నిస్సహాయత. కొన్ని రోజుల తరువాత పురుగులు పడతాయి. ఇంట్లో బండలు కడగాలంటే ఇబ్బంది. అన్నింటికీ మించి, అసలే ఇరుగ్గా వుండే బజారు వైపు గదిని పావు వంతు ఆ బస్తాలు ఆక్రమించేవి. ‘యిట్ల బస్తాలన్ని ఒక్కసారి తేవొద్దని నాన్నకు చెప్పమ్మా!’ అని నస పెట్టేవాడిని.

‘ఒకరు చెప్తె వింటడా మీ నాన్న?’ అని మా అమ్మ నన్నే కోప్పడేది. నా బాధ నాది! బియ్యం బస్తాలు పెట్టే ఆ బజారు గదే నేను చదువుకోవడానికి కూర్చునే గది. రాత్రి పూట, తాతయ్య, బాబాయ్, నేను కలిసి పడుకునే గది. అందుకే, ఆ ఇంట్లో ఉన్నంత కాలం, గదిలో దీపం కింద చదువుకోవడంకన్నా, వీధి దీపాల వెలుగులో గది బయట చదువుకోవడం హాయిగా ఉండేది. అందుకే, వర్షం పడిన రాత్రి నాకు ఒక పీడకలలా వుండేది.

వర్షం పడినపుడంతా మా అమ్మా నాన్న నాయనమ్మ ముందుగా బియ్యం బస్తాలను చెక్ చేసుకుని, వాటి దగ్గర పై కప్పు నుండి నీళ్లు కారడం లేదని నిర్ధారణ అయితే పెద్ద గండం గట్టెక్కినట్టు ఒకర్నొకరు చూసుకునేవారు – వంట గదిలో, మధ్య గదిలో గిన్నెలలో, చెంబులలో కారే వాన నీటి శబ్దాలు చిరాకు పెట్టిస్తున్నా సరే!

ఇల్లు మారినా, ఇట్లా సంవత్సరానికి సరిపడా బియ్యం బస్తాలు కొనిపెట్టే అలవాటుని చాలాకాలం మా నాన్న వొదిలిపెట్టలేదు. నేను ఉద్యోగంలో చేరిన చాలా కాలానికి కొంచెం గట్టిగా వారిస్తే తప్ప ఆ అలవాటుకి పాక్షికంగానైనా స్వస్తి చెప్పలేదు. సంపాదించడం మొదలుపెట్టి, ఇంటి బాధ్యతలు పూర్తిగా తీసుకున్నాక గానీ, ‘సంవత్సరానికి సరిపడా బియ్యం బస్తాలు తెచ్చి పెట్టడం’ అన్న పనిని మా నాన్న ఎందుకు అంత సీరియస్ గా తీసుకునే వాడో నాకు అర్థం కాలేదు.

పిల్లలు, ముసలివాళ్ళు కలిపి ఇంట్లో దాదాపు పది మంది జనాభా, ఆ ఇరుకిరుకు ఇంటికే నిత్యం వొచ్చిపోయే బంధువులు – వీళ్ళందరికీ పంచ భక్ష్య పరమాన్నాలు పెట్టకపోయినా, ఆ ఇస్త్రీ షాపు ఓనరు అన్నట్టు – ‘టైముకు ఏమున్న లేకున్న యింత తొక్కో కారమో ఏస్కొని బుక్కెడు అన్నం దింటె సాలు’ అని మా నాన్న కూడా అనుకునేవాడేమో! ‘అబ్బ ! చిన్నప్పటి రోజులు గోల్డెన్ డేస్ కదా! ఆ రోజులు మళ్ళీ వొస్తే ఎంత బాగుంటుందో కదా!’ అని ఎవరైనా అంటే, ‘నిజమే కానీ, అన్నీ అంతా కాదు – కండిషన్స్ అప్లై’ అని బిగ్గరగా చెప్పాలనిపిస్తుంది!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!
  • అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions