.
దేశంలో బిచ్చగాళ్లకు కొదువ లేదు కదా… మొత్తం ఈ ముష్టి టర్నోవర్ ఎంత ఉండొచ్చు బహుశా…
అక్షరాలా ఒకటిన్నర లక్షల కోట్లు అని ఓ అంచనా… అవును, ఈ బిక్షగాళ్లలో సంపన్నులూ ఉన్నారు… కొన్నిచోట్ల ఇదొక దందా… నిజమే, సంపన్న భిక్షగాళ్ల కథలు అప్పుడప్పుడూ వింటుంటాం కదా…
Ads
దేశంలో అత్యంత సంపన్నుడైన మరో భిక్షగాడి కథ ఇప్పుడు వైరల్ అవుతోంది… తన పేరు భరత్ జైన్… తన ఆస్తి విలువ 7.5 కోట్లు… నిజానికి ప్రపంచంలోనే అత్యంత సంపన్న యాచకుడు అట ఇప్పుడు తను…
బిచ్చమెత్తడాన్ని కూడా ఓ ఆర్థిక విజయంగా మార్చింది తనొక్కడే కాదు… సంభాజీ కాలే 1.5 కోట్లు, లక్ష్మీ దాస్ కోటి రూపాయల ఆస్తులు కూడా సక్సెస్ స్టోరీలే… ఎహె, బిచ్చమెత్తడం సక్సెస్ స్టోరీ ఏమిటీ అంటారా..?
భరత్ జైన్ అలాగే అనుకుంటున్నాడు… అన్ని ప్రొఫెషన్లలాగే ఇదీ నా ప్రొఫెషన్… సిగ్గుపడేది ఏముంది…? నాకు నా వృత్తి మీద గౌరవం ఉంది, ఇది నా కుటుంబాన్ని పోషించడమే కాదు, మంచి ఆస్తిని కూడా సంపాదించి ఇచ్చింది… సో, నేనెందుకు వదులుకోవాలి దీన్ని అని ప్రశ్నిస్తున్నాడు ఈ ముంబై బెగ్గర్…
ఎకనామిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… ‘నేను నా యాచక వృత్తిని ఎంజాయ్ చేస్తున్నాను, ఇదీ ఓ కళే… తరచూ గుళ్లకు వెళ్లి నేనే విరాళాలు కూడా ఇస్తుంటాను, అదీ నాకు నా వృత్తి నుంచే వచ్చిన డబ్బు…’ అంటున్నాడు తను…
రోజూ 2 వేల నుంచి 2500 వరకూ వస్తుంది తనకు… 12 గంటల వరకూ అడుక్కుంటాడు… నెలకు 60 నుంచి 70 వేలు… భార్య, ఇద్దరు కొడుకులు… కోటిన్నర విలువ చేసే రెండు ఫ్లాట్లు.. తండ్రి, తన సోదరుడు కూడా తనతోనే ఉంటారు… థానేలో రెండు షట్టర్లున్నాయి… నెలకు 30 వేల అద్దె వస్తుంది…
మంచి కాన్వెంటులో చదివించాడు పిల్లల్ని… వాళ్లు తమ సొంత స్టేషనరీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు… బాగానే ఉన్నాం కదా, ఇంకా అడుక్కోవడం దేనికి అంటారు పిల్లలు… కానీ ఈయన నిరాకరిస్తాడు… ఆ బిచ్చమేరా మిమ్మల్ని చదివించింది, ఈ ఆర్థిక స్థితి ఆ వృత్తి పుణ్యమే అంటాడు…
నేనేమీ చదువుకోలేదు… కడుపు నింపుకోవడానికి కూడా బోలెడు కష్టాలు పడ్డాను… ఇప్పుడు ఓ సగటు ఉద్యోగికన్నా మంచిగా సంపాదిస్తున్నాను, బతుకుతున్నాను… నేనెందుకు కించపడాలి..? ఇదేమీ దొంగతనం కాదుగా సిగ్గుపడటానికి అంటాడు తను…
యాచకుడిని సమాజం నీచంగా చూస్తుంది… అడుక్కుతినే బతుకు అని ఈసడించుకుంటుంది… ఎస్, నేను అడుక్కునే తింటున్నాను… అదే నాకు ఇష్టం అంటాడు భరత్ జైన్…! ఏదైనా పనిచేసుకుని బతకొచ్చు కదా అంటుంటారు, ఏం, ఇది పని కాదా…? ఓసారి అడుక్కుని చూడండి, అదెంత కష్టమైన పనో మీకే అర్థమవుతుంది అంటాడు నవ్వుతూ..!!
Share this Article