కాషాయం క్యాంపులో చాలామందికి తెలుసు… ఆర్ఎస్ఎస్‌కు బీజేపీకి పడటం లేదని… దూరం బాగా పెరిగిపోయిందని… మొన్నటి ఎన్నికల్లో అనేకచోట్ల ఆర్ఎస్ఎస్ బీజేపీ కోసం వర్క్ చేయకుండా తటస్థంగా ఉండిపోయిందని… ఆ కారణం చేతే మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల బీజేపీకి నెెగెటివ్ ఫలితాలు వచ్చాయని… మోడీ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు తన స్థాయికి తగినట్టు లేక, తనలోని ఫ్రస్ట్రేషన్ లెవల్స్‌ను బయటపెట్టాయని…
ఆర్ఎస్ఎస్ చీఫ్ కొంతకాలంగా మర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు… బీజేపీ వెళ్తున్న పంథా, ప్రత్యేకించి మోడీ ప్రభుత్వం వెళ్తున్న మార్గం మీద తన అసంతృప్తిని వ్యక్తీకరిస్తూనే ఉన్నాడు… అది బీజేపీ- ఆర్ఎస్ఎస్‌కు నడుమ పెరిగిన దూరాన్ని బహిర్గతం చేస్తూనే ఉంది… ఇప్పుడు సంఘ్ పత్రిక ఆర్గనైజర్ నేరుగా బీజేపీ ధోరణిని విమర్శిస్తూ ఓ వ్యాసమే వెలువరించింది… అంటే ఓరకంగా ఆర్ఎస్ఎస్- బీజేపీ దూరాన్ని అంగీకరించినట్టయింది…
సంఘ్‌తో విభేదాల కారణంగానే మోడీ కూడా కొన్నాళ్లుగా ఆర్ఎస్ఎస్ పెద్దలకు దూరంగానే ఉంటున్నాడు… ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ సహకరించడం లేదని మోడీకి సంపూర్ణంగా తెలుసు… సంఘ్ జీవిత కాల కార్యకర్త రతన్ శారద ఏం రాశాడంటే..? ‘‘అతి విశ్వాసమే బీజేపీ కొంప ముంచింది… నేతలు ఫీల్డ్‌కు వెళ్లకుండా సోషల్ మీడియాకు పరిమితమయ్యారు… మేమే అసలైన నేతలం, ఆర్ఎస్ఎస్ సోదరులకు ఏమీ తెలియదు, పల్లెటూరి బైతులు అనే అహం తలకెక్కింది…
Ads
మహారాష్ట్రలో బీజేపీ కనబరిచింది అనవసర రాజకీయం… షిండే, బీజేపీ కలిస్తే సరిపోయినప్పుడు అజిత్ పవార్‌ను ఎందుకు చీల్చినట్టు..? ఎన్సీపీ దానంతటదే కనుమరుగయ్యేది కదా… ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీకి క్షేత్ర స్థాయి యంత్రాంగం కాదు… అసలు మా సాయం ఎవరూ కోరలేదు కదా… బీజేపీ అభ్యర్థుల్లో 25 శాతం మంది వలసదారులే, వారిని బలవంతంగా రుద్దారు పార్టీ మీద…’’ అని నిర్మొహమాటంగా వాతలు పెడుతూ పోయారు రతన్ శారద…
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ‘‘ఎన్నికలంటే పోటీలు మాత్రమే, యుద్ధం కాదు… ప్రతిపక్షాలు అంటే ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కారు’’ అన్నాడు… ప్రతిపక్షాలపై మోడీ తదితర నేతలు చేసిన విమర్శలకు ఆర్ఎస్ఎస్ అనంగీకారం ఇది… అహం పనికిరాదు, మనల్ని దెబ్బతీస్తుంది అనే వ్యాఖ్య కూడా దాదాపు మోడీని ఉద్దేశించి చేసిందే… నిజమైన సేవకుడికి అహం ఉండదు, ప్రజాజీవితంలో గౌరవ మర్యాదలు పాటిస్తాడు… అనీ చెప్పుకొచ్చాడు ఆయన…
నిజానికి ఆర్ఎస్ఎస్‌కు బీజేపీ ఓ రాజకీయ విభాగం… అంతే… అదే మాతృసంస్థ… మోడీ కూడా హార్డ కోర్ ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్… కానీ ఒకప్పుడు… ఆర్ఎస్ఎస్‌ను మించి వ్యక్తిగా ఎదిగాడు… అది తన తలకెక్కిందనేది ఆర్ఎస్ఎస్ భావన… బీజేపీకే ఆర్ఎస్ఎస్ ఓ అనుబంధ విభాగం అన్నట్టుగా పరిస్థితిని మార్చేశారని సంఘ్ కోపం… ఐతే వాళ్ల విమర్శ మోడీషా బీజేపీ గురించి… ఒరిజినల్ బీజేపీ వ్యక్తులు, నాయకుల గురించి కాదు…
వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ఎజెండాలో కొన్ని క్లిష్టమైనవీ మోడీ నెరవేర్చాడు… ఆర్టికల్ 370, అయోధ్య వంటివి ఇప్పట్లో అయ్యేవని ఎవరూ అనుకోలేదు… ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్, పౌరసత్వ సవరణచట్టం వంటివి కూడా… కామన్ సివిల్ కోడ్ చేసేవాళ్లేమో గానీ ఇప్పుడు సంకీర్ణంలో సాధ్యం కాకపోవచ్చు… సో, ఆర్ఎస్ఎస్ మోడీ పూజ, సంఘ్‌తో సంప్రదింపులు లేని నిర్ణయాల అమలు మీద కోపంగా ఉందా..? లేక సంపూర్ణంగా మోడీ పోకడల మీదే ఆగ్రహంగా ఉందా..? కాలం చెబుతుంది…
మోడీ కూడా సంఘ్ పెద్దలతో మళ్లీ సయోధ్యకు రాక తప్పదు… తన బతుకంతా సంఘ్ ఎజెండాతో పనిచేయడమే… కొంత భిన్నమైన బాటలో నడిచినట్టు అనిపించినా కనిపించినా అది తాత్కాలికమే… సంఘ్ కూడా ఇప్పటికిప్పుడు మోడీషా మార్క్ బీజేపీని ఇంకా దూరం చేసుకుని (ఎవరో ఒకరు సక్సెస్‌ఫుల్‌గా ఎజెండా అమలు చేసేవాడు కావాలి కదా) ఈ దూరాన్ని అగాధంగా మార్చదు… సో, వేచి చూడటమే, చొరవ తీసుకోవాల్సింది మాత్రం మోడీయే..!!
Share this Article