ఆమె రాణి… రాజస్థాన్ అంటే తన రాణిస్థాన్ అనే భావిస్తుంది… మోడీ, నడ్డా, షా… ఎవరైనా సరే, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల్లో వేలుపెట్టడానికి వీల్లేదు… ఆమె ఓ శివగామి… రాష్ట్ర పార్టీలో తను చెప్పిందే శాసనం అయి తీరాలంటుంది… రాజవంశం నుంచి వచ్చింది కదా, 68 ఏళ్ల వయస్సొచ్చినా… కాలం ఎంత మారిపోతున్నా ఆమెలోని రాచరికపు పోకడలు మాత్రం సేమ్… ఎల్కేఅద్వానీ వర్గం కాబట్టి మోడీ, అమిత్ షా ఆమెను పట్టించుకోవడం లేదు, పక్కకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమెకు ఎప్పట్నుంచో సందేహం… అందుకే వాళ్లంటే పడదు… మొన్నటి 2018 ఎన్నికల్లో ఆమెను ఎలాగోలా భరించారు… తీరా ఏమైంది..? పార్టీ ఓడిపోయి చతికిలపడింది… అప్పట్నుంచి పూర్తిగా కత్తెర స్టార్టయింది… చివరకు ఇప్పుడు పరిస్థితి ఏమిటయ్యా అంటే… రెండుసార్లు ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధర రాజె ఫోటో లేకుండానే పార్టీ పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలుస్తున్నయ్… అదేమిటీ… మరీ ఇంతగా ఆమెను పులుసులో ఈగలా తీసిపారేస్తున్నారేం అనడిగారు అనుకొండి… పార్టీ నేతలు ఏమంటున్నారో తెలుసా..?
‘‘ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు నడ్డా, అసెంబ్లీలో పార్టీ లీడర్ గులాబ్ చంద్ కటారియా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సతీష్ పూనియా… వీళ్లే పోస్టర్లలో ఉంటారు… అది పార్టీ ప్రొటోకాల్… ఆమెకు నచ్చలేదు అంటే, ఎవరేం చేస్తారు..?’’…. నిజానికి ఆమె చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు… రాష్ట్ర పార్టీ నేతలకూ ఆమె వర్గానికీ నడుమ చీలిక, దూరం రోజురోజుకూ పెరిగిపోతోంది… వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనంలోకి వెళ్లాలని ఆశపడుతూనే, అందరినీ ఎందుకు దూరం చేసుకుంటుందో ఎవరికీ అర్థం కాదు… కరోనా కాలం కదా, బోలెడు వర్చువల్ మీటింగ్స్ పెడుతున్నది పార్టీ, కానీ ఆమె వాటికి హాజరు కావడం లేదు… తన సొంత ప్రోగ్రామ్స్ చేసుకుంటోంది… తనది వేరే పార్టీ అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం… జూన్ 9న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ క్యాంపెయిన్ నడిపింది పార్టీ… ఆమె ఒక్క చిన్న ట్వీట్ కూడా పెట్టలేదు… జనవరిలో ఆమె మద్దతుదారులు ఏకంగా వసుంధర రాజె సమర్థన్ మంచ్ అని వేరే సంస్థను స్టార్ట్ చేశారు… ఒకవైపు రాష్ట్ర బీజేపీ కరోనా బాధితులకు సాయం చేయడానికి సేవాహీ సంఘటన్ అనే ప్రోగ్రాం నిర్వహిస్తుంటే ఈమె సొంత ప్రోగ్రామ్స్ నిర్వహించింది…
Ads
పార్టీ కార్యక్రమాలకు రావడం లేదు సరికదా, ఆమె సపరేట్గా జిల్లాల్లోని తన విధేయులతో విడిగా వర్చువల్ మీటింగులు పెట్టేస్తోంది… పార్టీ చేసే కరోనా సహాయ ప్రోగ్రాములను వదిలేసి ఆమె వసుంధర జనరసోయి పేరిట పేద బాధితులకు ఆహారం పంపిణీ చేపట్టింది… ఆ జనరసోయి పోస్టుర్ల మీద, బ్యానర్ల మీద ఆమె బొమ్మ తప్ప మరే ఇతర పార్టీ లీడర్ ఫోటో ఉండదు… మోడీ, అమిత్ షా, నడ్డాలతో సహా…! ఆమెకు పూర్తిగా కత్తెర పెట్టేసి, సచిన్ పైలట్‌ను లాగేసి పార్టీని బాగా ప్రక్షాళన చేయాలని బీజేపీ హైకమాండ్ అనుకున్నా అది సక్సెస్ కాలేదు… ఒక దశలో, గత మార్చిలో తన బర్త్ డే సందర్భంగా ఓ యాత్ర ప్రారంభించాలని భావించింది… హైకమాండ్ కరాఖండీగా వద్దని చెప్పింది… ఏమిటీ, మీ రాణి గారు వేరే రూట్లో వెళ్తున్నారు అనడిగితే, ఆమె మద్దతుదారులు చెప్పే సమాధానం ఏమిటంటే..? ‘‘ఈ రాష్ట్రంలో మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగేది మా రాణిగారే, ప్రస్తుత రాష్ట్ర నాయకుల్లో కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పుకునే రేంజ్ నేత ఒక్కడైనా ఉన్నాడా..? ఆమె స్థాయి వేరు..’’ ఇప్పట్లో ఈ వర్గవిభేదాలు పూడవు, మోడీషా మరింతగా అంటకత్తెర్లు వేయడం ఖాయం… ఆమెలోని రాణి అహం మరింత తిరగబడటమూ ఖాయం… మొత్తానికి సీఎం అశోక్ గెహ్లాట్ హేపీ… డబుల్ హేపీ…!!
Share this Article