నాకు తెలిసిన ఒకామెకు ఏడు నెలలకే ప్రసవమైంది… ఆడపిల్ల పుట్టింది… అప్పట్లో వెంటిలేటర్లు, ఇంక్యుబేటర్లు ఏమీ లేవు… సహజప్రసవం… ఆ ఆడపిల్ల ఆరోగ్యంగా, చక్కగా పెరిగి త్వరలో అమ్మమ్మ కూడా కాబోతోంది… అంటే, 7 నెలలకే కడుపులో బిడ్డ ఈలోకంలోకి కేర్‌మని అడుగుపెట్టడానికి తగినంత ఎదుగుదలతో ఉంటుందన్నమాట… ఇక వార్తలోకి వెళ్దాం…
మొన్న, నిన్న సుప్రీంకోర్టులో వాదనలు… చాలా ఆసక్తికరం… ఒకావిడ తన 26 వారాల గర్భాన్ని తీసేయించుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతి అడుగుతోంది… డాక్టర్లేమో చేయడం లేదు… నేనున్న స్థితిలో మరో సంతానాన్ని పోషించలేను అనేది ఆమె చెబుతున్న కారణం… తన పేదరికం గురించి ఆమెకు ముందు తెలియదా..? కడుపులో పిండం 26 నెలలు పెరిగాక హఠాత్తుగా సోయి కలిగిందా..? ఆ సంతానాన్ని పోషించలేదట కానీ సుప్రీంకోర్టులో ఫైట్ చేసేంత ఆర్థిక స్థోమత ఎలా వచ్చింది..? సరే, ఈ సందేహాలు పక్కన పెడితే…
ఇద్దరు సుప్రీం లేడీ జడ్జిలు వేర్వేరు అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు… 1) తను సంతానాన్ని కనాలో వద్దో నిర్ణయించుకునే హక్కు ఆ మహిళదే… 2) 26 వారాల బిడ్డ ఊపిరి ఎలా ఆపేయమనాలి..? రెండూ ఇంట్రస్టింగే… (నిజానికి ఇప్పుడా పిండం వయస్సు 27 వారాలు దాటి ఉంటుంది… అంటే దాదాపు ఏడు నెలలు…) వాళ్లు ఎటూ తేల్చలేక చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి ఫార్వర్డ్ చేశారు… ఈ వయసులో అబార్షన్‌ను కేంద్రం వ్యతిరేకిస్తోంది… ఎయిమ్స్ నుంచీ రిపోర్టు తెప్పించి, కోర్టుకు సబ్మిట్ చేసింది… నిన్న సీజే ఆధ్వర్యంలోని బెంచ్ విచారించింది… విచారణ వాయిదా పడింది గానీ సీజే ఓ కామెంట్ చేశాడు…
‘మహిళ తరఫున ఓ న్యాయవాది ఉన్నాడు… కేంద్రం తరఫున ప్రభుత్వ న్యాయవాది ఉన్నాడు… (అడిషనల్ సొలిసిటర్ జనరల్)… పుట్టబోయే బిడ్డ తరఫున ఎవరున్నారు..? మహిళ స్వేచ్ఛకూ స్వయంప్రతిపత్తికీ, పుట్టబోయే బిడ్డ హక్కులకూ నడుమ బ్యాలెన్స్ అవసరం లేదా..?’ ఇలా వ్యాఖ్యలు చేశాడు… నిజమే కానీ… ఇక్కడ కొన్ని సందేహాలు… ఇదే కేసు సందర్భంగా సుప్రీం ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది…
Ads
తన సంతానాన్ని ఉంచుకోవాలో, తెంచుకోవాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఏ వయసు పిండం వరకూ ఉంటుంది..? అసలు కడుపులో పిండం కదా, ఇంకా ఈ భూమిపైకి రానేలేదు, తనకూ హక్కులు వర్తిస్తాయా..? సరే, బతికే హక్కు ఉందనే అనుకుందాం, కానీ ఏ వయసు పిండానికి ఆ హక్కులు వస్తాయి..? ప్రాతిపదికలు ఏమిటి..? తను బిడ్డను కనాలో వద్దో నిర్ణయించుకునే అవకాశం మహిళకు ఏ వయసు పిండం వరకు మాత్రమే ఉండాలి..?
ఇక్కడ మరో ధర్మ సందేహం… పిండంగా రూపుదిద్దుకున్నదీ అంటే ఓ జీవం పుట్టింది అన్నమాట… పూర్ణ ఎదుగుదల కోసం తల్లి కడుపులో 9 నెలలు ఉంటుంది… అంటే పిండస్థ దశలోనే హక్కులు వచ్చేసినట్టు పరిగణించాలా..? కాళ్లూ చేతులు, మెదడు, తల, రూపం, అవయవాలు ఏర్పడ్డాక ఊపిరి తీయడం హత్య అవుతుందా..? (అత్యాచార బాధితులు, ఇతర అనారోగ్య బాధితుల కేసులు వేరు…) మరి ఏ వయస్సు వరకు అబార్షన్ అనుమతినీయం..? జీవాన్ని చంపేయడం హత్య అయితే అసలు అబార్షనే తప్పు కావాలి కదా..? (నిజానికి ఈ వయస్సు గర్భాన్ని తీసివేసే ప్రక్రియ తల్లికీ ప్రమాదమే…)
ఈ వయస్సులో బిడ్డను బయటికి తీస్తే బతికే చాన్స్ ఉంటుంది అని ఎయిమ్స్ చెబుతోంది… అభిమన్యుడు కడుపులో ఉండగానే పద్మవ్యూహం నేర్చుకున్నాడని భారతం చెబుతోంది… ప్రస్తుతం చాలామంది తల్లులు తమ కడుపులో పిల్లలకు ప్రత్యేక గురువుల ద్వారా శిక్షణలూ ఇప్పిస్తున్నారు… (రెండేళ్ల వయస్సు నుంచే ప్లేస్కూళ్లు, చదువులు స్టార్ట్… కాదు, కడుపులో ఉండగానే క్లాసులు స్టార్ట్…) అంటే ఆ దశలో అబార్షన్ అంటే పుట్టబోయే బిడ్డ ‘జీవించే హక్కు’ను మనమే కాలరాయడం అనుకోవాలా..? హత్యగా భావించాలా..? సుప్రీం ఏం చెబుతుందనేది ఇందుకే ఇంట్రస్ట్‌ను క్రియేట్ చేస్తోంది…
Share this Article