అది 2014 జూలై 31. మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి… గంటకు 130 మైళ్ల వేగంతో సాగిన 65 మైళ్ల దూరపు మూడు పోలీస్ బృందాల ఛేజింగది. కట్ చేస్తే.. యూఎస్ లోని అన్ని టీవి ఛానల్స్ లో ఒకటే బ్రేకింగ్. అమెరికా పోలీస్, ఎఫ్బీఐని సైతం ముప్పుతిప్పలు పెట్టి… ఆమె ఆచూకీ కోసం ప్రజలనూ నిఘా శాఖలు అర్థించేలా చేసి… వారితో బాంబ్ షెల్ బ్యాండిట్ గా పిలిపించుకున్న ఓ ఇండియన్ లేడీ కథ ఇది. ఓ హాలీవుడ్ సినిమాను తలదన్నేలా సాగిన ఓ వన్నెలాడి కథనమిది. ఏకంగా హిందీలో కంగనారనౌత్ నటించిన సిమ్రన్ సినిమా కథకు మూలమిది.
పేరు సందీప్ కౌర్. పంజాబ్ ఛండీగడ్ ఆమె స్వస్థలం. ఏడేళ్ల వయస్సులో తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాలో తన తండ్రి జతీందర్ వద్ద అడుగుపెట్టింది సందీప్ కౌర్. అయితే ఆమె తల్లిదండ్రులిద్దరూ వేర్వేరు వ్యాపారాల్లో మునిగితేలడం… సోదరుడితో పాటు ఆమె కూడా కాస్తా తల్లిదండ్రుల లాలనకు గురైన చేదు అనుభవాలతో విసిగిపోయింది. పైగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 2001, 9/11 ఉగ్రదాడులనంతరం జాతుల మధ్య ఉద్రిక్తతలూ పెరిగిపోయిన సమయమది. స్కూల్ లో తోటి పిల్లలు తన తండ్రిని ఉగ్రవాదా అని అడగటం వంటివి కూడా సందీప్ కౌర్ పైన కొంత ప్రభావం చూపాయి. దాంతో తన కుటుంబం పైన సందీప్ కౌర్ కు ఏదో తెలియని వెలితి… ఒక రకమైన దూరమైన సంబంధంగా తయారైపోయింది. అదిగో ఆ సమయంలోనే సందీప్ కౌర్ కు బాగా దగ్గరైంది సమీప బంధువు, స్నేహితురాలైన అమున్ దీప్ కౌర్. అమున్ దీప్ కౌర్.. సందీప్ కౌర్ ను సినిమాలు, షికార్లకు తిప్పుతూ బయట ప్రపంచానికి అలవాటు చేసింది.
Ads
తన తల్లి ఆరోగ్యం బాగా లేని సమయంలో.. ఓ నర్స్ ద్వారా స్ఫూర్తి పొందిన సందీప్ కౌర్ 19 ఏళ్లకే ఆతర్వాత నర్సింగ్ కోర్సును పూర్తి చేసింది. పంజరంలోని రామచిలుక ఎప్పుడెప్పుడు బయటపడుతా అన్నట్టుగా సందీప్ తన కుటుంబంలో ఉన్నప్పుడు భావించేదట. అదే సమయంలో నెలకు 6వేల డాలర్లు సంపాదించే ఉద్యోగంతో పాటు… డబ్బు సంపాదించాలన్న తపనతో పగలూ, రాత్రి కష్టపడి ఆతర్వాత మూడు ఉద్యోగాలు చేసింది కౌర్. ఆ సమయంలో డబ్బుపై మరింత ఆశ పెరగడం.. అమెరికన్ వాణిజ్యరంగంలో వస్తున్న మార్పులతో షేర్ మార్కెట్ లో డబ్బులను పెట్టుబడి పెట్టడం మొదలెట్టింది కౌర్.
అలా 2 మిలియన్ డాలర్స్ డబ్బును షేర్ మార్కెట్ లో సంపాదించుకోగల్గింది. సరిగ్గా అది 20 ఏళ్ల వయస్సు. అసలే అమెరికా పబ్బులు, క్లబ్బులు, క్యాసినోలు… ఇక ఆ కల్చర్ చెప్పతరమా…? సరిగ్గా ఆ వయస్సులో మందు పుచ్చుకోవడానికీ లీగల్ గా అమెరికా చట్టాల ప్రకారం ఇక లైసెన్సూ వచ్చేసినట్టే. అందుకు కావల్సిన డబ్బూ ఉంది… అవన్నీ చవిచూడాలన్న ఆశా ఉంది. అదిగో అలాంటి సమయంలోనే 20 నుంచి 21 ఏళ్ల వయస్సులో అడుగుపెట్టే పుట్టినరోజు వేళ 2010 నవంబర్ 21నాడు కౌర్ జీవితం ఊహించని మలుపు తిరిగింది.
ఇంట్లో ఏదో అబద్ధం చెప్పి బయటపడ్డ కౌర్… రెక్కలొచ్చిన గువ్వలా క్యాసినోలకు పేరొందిన లాస్ వేగాస్ లో వాలిపోయింది. ఇంకేం చేతులో బోలెడంత డబ్బు… షాపింగ్… అసలే ఫ్యాషన్స్ కు పుట్టినిల్లులా కనిపించే హొయలతో కనిపించే అమెరికాలో పొట్టి దుస్తుల్లో అలా స్నేహితులతో కలిసి మొట్టమొదటిసారి క్యాసినోలోకి ఎంట్రీ ఇచ్చింది సందీప్ కౌర్. అలా ఆ క్యాసినోల్లో బ్లాక్ జాక్ జూదానికి అలవాటు పడింది. అలా ప్రతీ నెలా ల్యాస్ వేగాస్ కు వెళ్లడం… జేమ్స్ బాండ్ సినిమాల్లో తరహాలో జూదమాడటం సందీప్ కౌర్ ప్రవృత్తిగా మారిపోయింది. అయితే ఆ జూదమాటలో కౌర్ కు హ్యాండ్ కలిసివచ్చింది. ఆ విషయం తన తల్లికి తెలియడంతో… డబ్బుపైనున్న మమకారం, ఓ మంచి భవంతి కొనాలన్న అత్యాశతో ఏకంగా తల్లే కౌర్ ను మరింత ప్రోత్సహించింది.
అలా ఆమె క్యాసినోల్లో జూదమాట ఇంతింతై అన్నట్టుగా పెరిగింది. చివరకు కొన్నిసార్లు ఆమె చెక్స్ బౌన్సైనా… ఆమెకు క్యాసినోలు మాత్రం అడ్డుచెప్పలేదు. కానీ విధి ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు కదా..? అదృష్టం జీవితమంతా మన వెంటే రాదు కదా..? అదిగో అలా డబ్బు పోగోట్టుకోవడం ప్రారంభమైంది. ఏకంగా 60 వేల డాలర్లను పోగొట్టుకుంది. కానీ తన ఫ్రెండ్ అమున్ దీప్ కు మాత్రం ఆ డబ్బు షేర్ మార్కెట్ లో పోయినట్టు అబద్ధమాడింది. కానీ తన సోదరుడు ఆ విషయాన్ని అమున్ దీప్ కు తెలియజేశాక అప్పుడుగానీ తానేవిధంగా డబ్బు పోగొట్టుకుంది… జాదామాటకు బానిసై ఎలా తన చదువులను వదిలేసిందో సందీప్ కౌర్ చెప్పుకొచ్చింది. తాను బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బు కూడా అయిపోయి.. క్యాసినోలకే ఆమె అప్పు కట్టాల్సిన పరిస్థితిలోకి దిగజారిపోయింది.
సాధారణంగా జూదరులందరూ ఆలోచించే తీరులోనే మళ్లీ పోగొట్టుకున్న చోటే డబ్బు సంపాదించాలన్న కౌర్ కు మరికొందరు పరిచయమయ్యారు. మీ ఆట చూశాం మీకు అప్పిస్తామన్నారు. అలా మళ్లీ అప్పులు చేసింది. అది ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆ అప్పు పేరుకుపోయిందేగానీ… ఈసారి క్యాసినోల్లో జూదమాట మాత్రం కౌర్ కు కలిసిరాలేదు. దాంతో అప్పులోళ్ల బాధలు పెరిగిపోయాయి. వాటికి వడ్డీలు, చక్రవడ్డీలు కలిసి బారెడయ్యాయి. ఇక చేసేది లేక.. తల్లిని తీసుకుని తన టికాణా మార్చేసింది. అయినా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చిన అప్పులోళ్లు… కుటుంబాన్నే లేకుండా చేస్తామని బెదిరించారు. ఎలాగైనా అప్పు తీర్చాలన్నారు.
ఆ క్రమంలో బ్యాంకులను కొల్లగొట్టడమొక్కటే మా అప్పులు తీర్చేందుకు నీకు మార్గమని సూచించారు. అలా ఓ నర్స్ గా పనిచేసిన ఓ ఇండియన్ లేడీ… అమెరికా పోలీస్ వ్యవస్థనే ముప్పుతిప్పలు పెట్టే ఓ బ్యాంక్ దోపీడిదొంగగా అవతరించింది. అలా పలు బ్యాంకులకు కన్నం వేసి.. తప్పించుకుని తిరిగింది. చాలామంది దొంగలు బ్యాంకు దొంగతనాల్లో పోలీసుల కాల్పుల్లో
మరణించిన సంఘటనలు తన కళ్లముందు కదలాడినా… తానిక బ్యాంక్ దొంగతనాలు చేస్తేనేగానీ… తాను, తన కుటుంబం బతికి బట్టకట్టలేమని భావించింది. ఒక దశలో ఆత్మహత్యే శరణ్యమనుకున్న కౌర్… ఆ తర్వాత ఏకంగా అమెరికా పోలీస్ వ్యవస్థలోనే అత్యధిక బ్యాంక్ రాబరీలకు పాల్పడ్డ ఓ ఆడదొంగగా షేక్ చేసింది.
అప్పటికే ఆరురోజుల్లో రెండు బ్యాంకుల్లో దోపిడీ చేసిన కౌర్ వద్ద 8 వేల డాలర్లు మాత్రమే ఉండగా అది అప్పులోళ్లకిచ్చేందుకు సరిపోకపోవడంతో… మూడో బ్యాంక్ రాబరీకి ప్లాన్ చేసింది. ఉటాలోని సెయింట్ జార్జ్ బ్యాంకులో రాబరీకి సరిగ్గా 2014, జూలై 31, సోమవారం రోజు పక్కా ప్రణాళికను రచించింది. కానీ అమెరికా ఎఫ్బీఐ లెక్కల ప్రకారం సోమవారాలు అక్కడ అంతకుముందు కూడా పలు బ్యాంకు దోపిడీలు జరిగిన సంఘటనలుండటంతో… అప్పటికే కౌర్ గురించి వెతుకుతున్న పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అనుకున్నట్టే కౌర్ వచ్చింది.
కానీ మారువేషంలో… కళ్లకు గాగుల్స్ తో పాటు… విగ్ ధరించిన ఆమె రూపం పోల్చుకోలేకుండా ఉన్నప్పటికీ… ఆమె కదలికలు బ్యాంకులో అనుమానాస్పదంగా కనిపించాయి. పైగా క్యాషియర్ ను డబ్బు ఇవ్వమని బెదిరించి గుంజుకెళ్లుతుండగా… తన క్యాబిన్ లోంచి చూసిన మేనేజర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. దాంతో… కౌర్ సుదీర్ఘ ఛేజింగ్ అనంతరం పోలీసులకు చిక్కింది. ఆ సమయంలో అక్కడున్న తీవ్ర తుఫాన్ పరిస్థితులు కూడా కౌర్ ను పోలీసులకు పట్టించాయి. చివరాఖరకు అమెరికా పోలీసులకు చేతికి చిక్కి… 66 నెలల జైలు శిక్షగా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును తన జీవితానికో ఉపశమనంగా భావించి ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తోంది సందీప్ కౌర్.
చూశారా… భారత్ లో పుట్టి… ఎప్పుడో ఏడేళ్ల వయస్సులో అమెరికాకేగి.. అక్కడ ఓ నర్స్ గా కూడా ఎందరికో సేవచేసి… ఆ తర్వాత తాను సంపాదించిన డబ్బును షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ మెంట్లతో మరింత సంపాదించి… క్యాసినోల్లో రాయల్ కల్చర్ కు అలవాటై… అక్కడా తిరుగులేదనిపించుకుని.. చివరకు పేరాశతో సంపాదించిందంతా పోగొట్టుకుని… అప్పులు చేసి.. వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో… బ్యాంకు దొంగతనాలకు శ్రీకారం చుట్టి… అమెరికా పోలీస్ వ్యవస్థనే ఓ కుదుపు కుదిపిన సంచలనమైన సందీప్ కౌర్ స్టోరీ ఓ ప్రతీ మలుపులో ఓ సంచలనమే మరి!
- రమణ కొంటికర్ల
Share this Article