కోలకత్తా టూ లడాఖ్… ఓ రిక్షాపుల్లర్ ఆసక్తికర ప్రయాణం!
లడాఖ్ బైక్ ట్రిప్స్ కామన్. చాలా మంది సైకిళ్లపైనా ఆ సాహసోపేతమైన పర్యటనకు వెళ్తూ లైఫ్ జర్నీని ఆస్వాదిస్తుంటారు. అయితే, ఇప్పుడవి ఖర్జుంగ్ లా రోడ్డులో సర్వసాధారణమైపోయిన పర్యటనలు. కానీ, ఓ రిక్షాపుల్లర్ తన రిక్షాలో పర్యటించడం విశేషం. దాన్ని డాక్యుమెంటరీగా తెరకెక్కించడం.. ఆ తర్వాత Ladakh Chale Rickshawala అనే ఆ డాక్యుమెంటరీ 65వ జాతీయ చలనచిత్ర అవార్డును సాధించడం ఇంకో విశేషం.
సత్యేన్ దాస్ కథకు జాతీయ అవార్డ్!
దక్షిణ కోల్ కత్తా నక్తాలాకు చెందిన సత్యేన్ దాస్ స్థానికంగా ఓ రిక్షా నడిపి బతికే కార్మికుడు. ఓసారి పూరీ జగన్నాథుణ్ని దర్శించుకోవాలన్న సంకల్పం కల్గింది సత్యేన్ దాస్ కి. కానీ, రైల్లో వెళ్దామంటే డబ్బుల్లేవు. దాంతో స్థానికంగా నల్గురిని గమ్యాలకు చేర్చే తన రిక్షానే.. పూరీ ప్రయాణానికీ వాహనం చేసుకున్నాడు. ఆ తర్వాత పలుచోట్లకు అడ్వెంచరస్ గా ప్రయాణాలు చేయడం సత్యేన్ దాస్ కి అలవాటుగా మారిపోయింది.
Ads
అందులో చెప్పుకోదగ్గ జర్నీ లడాఖ్. ఓ సందర్భంలో నక్తాలాకు చెందిన టీవీ ప్రొడ్యూసర్ ఇంద్రాణి చక్రవర్తిని తన రిక్షాలో తీసుకెళ్తున్న సమయంలో.. ఆమెతో మాటలు కలిశాయి. దాంతో తానెన్నో సుదూర ప్రయాణాలు చేసినట్టు ఇంద్రాణికి చెప్పుకొచ్చాడు సత్యేన్. అంతేకాదు, తాను వెళ్లినప్పటి కొన్ని ఓల్డ్ ఫోటోలు చూపించడంతో పాటు.. తన నెక్స్ట్ ట్రిప్ లడాఖ్ కు వెళ్లాలని ఉన్నట్టు చెప్పాడు సత్యేన్ దాస్. ఆ సత్యేన్ స్టోరీకి ఎందుకో ఇంద్రాణీ కనెక్టయ్యారు. అయితే, తాను అంతదూరం అతనితో ప్రయాణం చేయలేదు. కానీ, సత్యేన్ లడాఖ్ రిక్షా జర్నీ మాత్రం డాక్యుమెంటరీగా మల్చాలనుకున్నారు.
అందుకోసం సత్యేన్ కే ఓ హ్యాండీక్యామ్ వీడియో కెమెరా కొనిచ్చారు. దానిపై అతడికి ఎలా షూట్ చేయాలో నేర్పించారు. చివరగా తాను లడాఖ్ కు చేరే సమయానికి తన బృందంతో కలిసి తామూ అక్కడికి చేరుకోవాలనే ఒక ప్లాన్ రచించారు.
అలా 2014లో సత్యేన్ దాస్ కోల్ కత్తా టూ లడాఖ్ ప్రయాణం ప్రారంభమైంది. 68 రోజులపాటు.. 3 వేల కిలోమీటర్లు.. జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, శ్రీనగర్ మీదుగా సాగింది. అయితే, మార్గమధ్యంలో బనారస్ వద్ద సత్యేన్ హ్యాండీక్యామ్ పని చేయలేదు. దాంతో ఇంద్రాణి తన అసిస్టెంట్స్ ను పంపి ఆ కెమెరా రిపేర్ చేయించి సత్యేన్ చేతుల్లో పెట్టడంతో.. తన ప్రయాణాన్ని తానే హ్యాండీక్యామ్ తో షూట్ చేసుకుంటూ.. అక్కడెవరైనా కనబడితే వారితో షూట్ చేయిస్తూ మొత్తంగా ఒక పూర్తి స్థాయి 65 రోజుల వీడియో రికార్డ్ తయారుచేశాడు సత్యేన్.
సత్యేన్ లడాఖ్ రిక్షా ప్రయాణాన్ని డాక్యుమెంటరీ చేసే క్రమంలో ఇంద్రాణి అతడికి కావల్సిన రూట్ మ్యాప్స్, బట్టలు, ఎక్కడాగితే అక్కడ భోజనానికి కావల్సిన అన్ని ఏర్పాట్లూ చేశారు. అలా మొత్తానికి ప్రసిద్ధిగాంచిన ఎత్తైన ఖర్దూంగ్ లా పాస్ కు 2014, ఆగస్ట్ 17న చేరుకున్నాడు సత్యేన్.
రిక్షాపుల్లర్ గా సత్యేన్ తన జర్నీలో ఎదుర్కొన్న సమస్యలెన్నో!
సత్యేన్ కు కావల్సిన మౌలిక సదుపాయాలు ఇంద్రాణీ సమకూర్చినప్పటికీ.. సత్యేన్ ఎన్నో సవాళ్లనెదుర్కోవాల్సి వచ్చింది. తన ప్రయాణంలో భోజనం సమయానికి దొరక్కపోవడం.. సముద్రమట్టానికి 11 వేల 500 ఎత్తుల అడుగులో ఉన్న లేహ్ ప్రాంతంలో ఆక్సిజన్ కొరత.. అధ్వాన్నమైన రోడ్లు వంటివి సత్యేన్ ను ఇబ్బంది పెట్టాయి. ఇన్స్టంట్ న్యూడుల్స్, ఆలు ఛోకా బాట్ వంటివే ఆయన ఆహారమయ్యాయి. 11 వేల 500 ఎత్తులో జోజి లా పాస్ వద్ద.. శ్రీనగర్ నుంచి లేహ్ మార్గం తన రిక్షా జర్నీలో అత్యంత ఇబ్బందికరంగా మారిందంటాడు సత్యేన్. 8 కిలోమీటర్ల ప్రయాణంలో తన సామాన్లతో పాటు.. ఆ కొండమార్గంలో గుంతలు పడ్డ రోడ్లపై రిక్షాతో ప్రయాణించడం ఓ అడ్వెంచరస్ గా తల్చుకుంటాడు సత్యేన్.
సవాళ్లకు పరాకాష్ఠలా ఖర్దుంగ్ లా పాస్ జర్నీ!
11 వేల 500 అడుగుల ఎత్తులో ఉండే జోజిలా పాస్ చేరికే కష్టమంటే.. అక్కడ్నుంచి, ప్రపంచంలోనే ఎత్తైన ఖర్దుంగ్ లా పాస్ కు చేరాలంటే అది 17 వేల 500 అడుగుల ఎత్తులో ఉంటుంది. బైక్స్ పై వెళ్లే సాహసయాత్రీకులు కూడా ఒకింత కష్టపడితేనేగానీ ఆ హైట్స్ కి చేరలేరు. అలాంటి చోట రిక్షా దిగి.. తన బరువులను ఓవైపు మోసుకుంటూనే… ఆక్సిజన్ సరిగా అందని ఆ గుట్టలపై సత్యేన్ తన రిక్షాను లాక్కుంటూ వెళ్లిన ఆ సన్నివేశాలన్నీ సాహసోపేతమైనవే. వీటన్నింటినీ మించి అక్కడి మంచుకొండల్లో ఓ చిరుత సత్యేన్ కంటపడింది. కానీ, దాని దృష్టి సత్యేన్ పై పడకపోవడంతో తాను బతికి బట్టకట్టానంటాడు సత్యేన్.
సత్యేన్ లడాఖ్ జర్నీపైన ఆయన భార్య మున్నీ మాత్రం కోపంగా ఉండేది. తన బిడ్డ ప్రియాంకతో కంప్లైంట్ తండ్రి వ్యవహారంపై కంప్లైంట్ చేస్తుండేది. మనల్ని ఇలా వదిలేసి తన దారిన తాను చెట్లు, గుట్టలంటూ తిరగడమేంటన్నది ఆమె కోపానికి కారణం. సత్యేన్ దాస్ తన కలల ప్రపంచంలో తిరుగుతుండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేసేది.
అలా తన భార్య తనపై పెంచుకున్న కోపాలు, తన జర్నీలో తను పడ్డ కష్టాలతో పాటు… ఎన్నో తీపి జ్ఞాపకాలు కూడా ఉన్నాయంటారు సత్యేన్. మార్గమధ్యంలో లడాఖ్ ప్రయాణంలో కలిసిన సైక్లిస్టులతో ఏర్పడిన పరిచయాల వంటివి తనకు స్ఫూర్తిగా నిల్చేవంటారు.
ఆ స్వీట్ అండ్ హాట్ మెమరీస్ ను గుదిగుచ్చినదే Ladakh Chale Rickshawala డాక్యుమెంటరీ. అందుకే ఈ డాక్యుమెంటరీ 65వ జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ది బెస్ట్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ అడ్వెంచర్ ఫిల్మ్ కోటాలో అవార్డ్ అందుకుంది.
అయితే, 2014లో లడాఖ్ జర్నీ చేసిన సత్యేన్ దాస్ మళ్లీ 2017లోనూ ఇదే రూట్ లో తన రిక్షా ప్రయాణాన్ని పెట్టుకున్నాడు. ఈసారి గ్లోబల్ వార్మింగ్ పై సందేశాన్నిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దారి పొడవునా మార్గమధ్యంలో 5 వేల ఖర్జూరా మొక్కలను నాటుతూ.. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు, చెట్ల అవసరమెంతో చెబుతూ తన జర్నీని ఓ మెస్సేజ్ ఓరియెంటెడ్ గా మార్చాడు.
అంతేకాదు, తాను నడుపుతున్న సైకిల్ రిక్షా కూడా ఎకో ఫ్రెండ్లీ అనే నినాదాన్ని జనంలోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడిందంటాడతను. మొత్తంగా తన జర్నీలో పడ్డ కష్టాలు, సవాళ్లను మించి.. ఆ పచ్చని ప్రకృతి అందాల నడుమ అవన్నీ మటుమాయమయ్యాయంటాడు సత్యేన్. తన ప్రయాణం తన జీవితంలో ఓ ల్యాండ్ మార్క్ గా నిల్చిపోయిందని.. ఇలాంటి అవకాశం ఎందరికి వస్తుందని ప్రశ్నిస్తాడతను…. రమణ కొంటికర్ల
Share this Article