.
న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలపై పేరొందిన మీడియా గానీ, న్యాయనిపుణులు గానీ, కీలక స్థానాల్లో ఉన్న నాయకులు గానీ విశ్లేషించడానికి, ప్రశ్నించడానికి గానీ ముందుకు రారు… నిజమే, చాన్నాళ్లుగా కోర్టుల ప్రొయాక్టివ్ ధోరణులపై అక్కడక్కడా విమర్శలు వస్తున్నాయి…
అంతిమంగా తీర్పులో ఏమున్నా, విచారణల సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు పలుసార్లు వార్తల్లోకి వస్తున్నాయే తప్ప, వాటిపై ప్రసిద్ధ పాత్రికేయులు విశ్లేషణలకు దిగే సాహసం చేయడం లేదు… కోర్టుల నిర్ణయాలపై కూడా… కోర్టులకు దురుద్దేశాలు ఆపాదిస్తే కోర్టు ధిక్కారం అవుతుందే తప్ప తీర్పులపై, వ్యాఖ్యలపై సమీక్ష తప్పేముంది..?
Ads
మొన్నటికి మొన్న ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో కట్టలుకట్టలుగా కరెన్సీ దొరికిన కేసులో… సుప్రీం వ్యవహార శైలిపైనా విమర్శలు వచ్చాయి… కానీ కపిల్ సిబల్, ఓ కేంద్ర మంత్రి మినహా పెద్దగా ఎవరూ స్పందించి తప్పొప్పుల ప్రస్తావనకు దిగలేదు… న్యాయ వ్యవస్థ అన్ని సమీక్షలకూ అతీతమా..? మణిపూర్ పర్యటన కూడా అంతే… తనే ఫీల్డులోకి దిగడం ఏమిటనే ప్రశ్నే రాలేదు…
తెలుగులో ప్రసిద్ధ పాత్రికేయులు బోలెడు మంది… న్యాయనిపుణులూ బోలెడు మంది… ఎప్పుడూ ఏ అంశంపైనైనా అభిప్రాయాలు వెల్లడించడానికి సంకోచం… జంబో మంగారి రాజేందర్ వంటి ఒకరిద్దరు తప్ప…! కానీ మనం ఏకీభవించినా లేకపోయినా సరే, తన రాజకీయ పోకడలను వ్యతిరేకించినా సరే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇలాంటి సందర్భాల్లో ధైర్యంగా స్పందిస్తున్నాడు…
నిందలు కాదు, తన అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నాడు… తను సంపాదకుడు కాదు, తను మీడియా సంస్థ ఓనర్… ఆ హోదాలో న్యాయవ్యవస్థల వ్యవహార ధోరణులపై స్పందించేవారిని ఒక్కరిని చూపించండి… ఈ కోణంలో మాత్రం రాధాకృష్ణది దమ్మున్న కలమే…
కంచ గచ్చిబౌలి (హెచ్‌సీయూ) భూములపై సుప్రీం వ్యాఖ్యల్ని ఈరోజు తన కొత్త పలుకులో ప్రస్తావించాడు… ఇలా…
**కంచ గచ్చిబౌలి భూముల వివాదాన్ని సుమోటోగా విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే అక్కడ చెరువు వద్ద నిర్మించే జైలులో ఉండాల్సి వస్తుందని హెచ్చరించడం కూడా జరిగింది.
నిబంధనలు, చట్టాల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ మౌనంగా ఉండకూడదు. అలా అని వివాదం పూర్వాపరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? లేదా? అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. కంచ గచ్చిబౌలి వద్ద ఉన్న చెరువు సమీపంలో నిర్మించే తాత్కాలిక జైలుకు వెళతారు అని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హెచ్చరించింది.
అంటే రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదేశాలను పాటించని పక్షంలో అక్కడ కొత్తగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోసం జైలును నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తున్నదా? అలా ఆదేశించే అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి ఉంటుందా? సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు తుది ఆదేశాలలో లేకపోవడం గమనార్హం.
కేసుల విచారణ సందర్భంగా న్యాయస్థానాలు చేస్తున్న వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తాయా? లేక కీడు చేస్తాయా? అన్న దానిపై న్యాయవాద వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చట్టాలను మాత్రమే సమీక్షించాలా? లేదా వ్యక్తిగత అభిప్రాయాలను కూడా జోడించవచ్చా? అన్న దానిపై కూడా న్యాయ నిపుణులలో కొంత కాలంగా చర్చ జరుగుతోంది.
కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు తుది తీర్పు లేదా ఆదేశాలలో భాగం కావడం లేదు. అయినప్పటికీ, మీడియాలో వాటికి విశేష ప్రచారం లభిస్తుండటంతో సామాన్య ప్రజానీకం ప్రభావితం అవుతున్నారు. సదరు వ్యాఖ్యలను తీర్పులలో భాగంగానే చూస్తున్నారు. ఈ పరిణామం న్యాయ వ్యవస్థ విశిష్టతకు నష్టం చేస్తుందన్న అభిప్రాయం బలంగా ఉంది…**
సరే, రాధాకృష్ణ ఏం రాసినా జగన్‌ను లాగుతాడు కదా… ఇక్కడా అంతే… ‘‘విశాఖపట్నంలో రుషికొండను నిబంధనలు పాటించకుండా ముఖ్యమంత్రి నివాసం కోసం బోడిగుండుగా మారుస్తున్నారని, సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అప్పుడు సుప్రీంకోర్టు ఇంత వేగంగా స్పందించలేదు. ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు…’’ అంటున్నాడు తను…
సరే, ఓ విషయం… హెచ్‌సీయూ భూములకు సంబంధించి కేటీయార్ పోకడల్ని కూడా విమర్శించాడు సరే… కానీ ఈ మొత్తం వివాదంలో ప్రధాన పాత్ర పోషించింది ఎఐ ఫోటోలు, వీడియోలు… వాటి ప్రభావమే విపరీతం… రాధాకృష్ణ ఆ అంశంలోకే వెళ్లలేదు… ప్రతిపక్ష, ప్రత్యేకించి బీఆర్ఎస్ మీడియా సాగిస్తున్న ప్రచారాల తీరు ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి అర్థమైంది…
అఫ్‌కోర్స్, తను చేయగలిగేదీ ఏమీ లేదు… ఇప్పటిదాకా బీఆర్ఎస్ ప్రముఖుల్ని ఎందులోనూ సరిగ్గా ఫిక్స్ చేసింది లేదు, కఠినంగా వ్యవహరించిందీ లేదు… ఇప్పుడు కోర్టును ఆశ్రయిస్తాడట, ఎఐ ఫేక్ ప్రచారాలపై విచారణకు ఆదేశించాలని..! ఫేక్ ప్రచారాల పని పట్టాలని కోర్టులు చెబితేనే ప్రభుత్వం స్పందిస్తుందా..? ఇదేం తీరు..? రాధాకృష్ణ వ్యాసంలో గనుక ఎఐ ఫేక్ ప్రచారాల ప్రస్తావన కూడా ఉండి ఉంటే తన ఎడిటోరియల్ వ్యాసానికి పరిపూర్ణత వచ్చి ఉండేది..!!
Share this Article