Bharadwaja Rangavajhala….. ఎవిఎమ్ వారు ఎన్టీఆర్ ను రావణుడుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ తీసిన భూకైలాస్ చిత్రంలో మున్నీట పవళించు నాగశయనా అంటూ ఓ నర్తన గీతం ఉంటుంది. దాన్ని షణ్ముఖ ప్రియలో స్వరపరచారు సంగీత దర్శకులు ఆర్ సుదర్శనం గోవర్ధనంలు. ఆ పాటకు నర్తించిన నర్తన తార పేరు కమలా లక్ష్మణ్.
ఆ లక్ష్మణ్ ఎవరో కాదు… కామన్ మ్యాన్ కార్టూనుతో ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఆర్కే లక్ష్మణే. కమల లక్ష్మణ్ పెళ్లైతే చేసుకున్నారు గానీ ఎక్కువ రోజులు కలిసి లేరు. పెళ్లయ్యాక డాన్సు చేయరాదనడంతో విడాకులు తీసుకున్నారు ఆవిడ . మొగుడూ మొగుడూ నాకు నీకంటే డాన్సే ముఖ్యం అని క్లారిఫై చేశారన్నమాట …
అలాగే పెళ్ళాం విషయంలో జస్ట్ కామన్ మ్యాన్ గానే ప్రూవ్ చేసుకున్నాను అని ఆయన కూడా అనుకునే ఉంటారు అని నా అనుమానం…
రచయిత ఆర్కే నారాయణన్, కార్టూనిస్టు లక్ష్మణ్ లాంటి కళాకారులు ఉన్న ఆ కుటుంబం తన నృత్యాన్ని గౌరవిస్తుందని తాననుకున్నానని కమల ఆ రోజుల్లో మీడియా ఇంటర్యూల్లో చెప్పేవారు.
తదనంతరం ఆవిడ మరో వివాహము చేసుకుని జీవితాన్ని ముందుకు నడిపించారు. ఆయన పేరు టి.వి.లక్ష్మీనారాయణ. అలా ఆవిడ కమలా నారాయణగా కూడా కొందరికి తెల్సు. ఈ కమలానారాయణ అనే పేరు వల్ల కొందరు ఆవిడ వివాహమాడినది ఆర్కే నారాయణణ్నేమో అనుకుని పొరపడేవారు. కొన్ని బ్లాగుల్లో సైతం అదే వ్రాసినారు. అదీ సంగతి …
అయితే ఇంకో విచిత్రం ఆ మధ్య డాక్టర్ రొంపిచర్ల భార్గవి గారు కలిగించిన జ్ఞానం : ఆర్కే లక్ష్మణ్ రెండో భార్య పేరు కూడా కమలేనట. ఇక మున్నీట పవళించు నాగశయనా … పాట షణ్ముఖప్రియలోనే ఎందుకు ట్యూనారంటే … రిథమ్ ప్రధానంగా సాగే ఈ రాగం డాన్సులకు భలే ఉంటుందనే… ఈ శివుడికి సంబంధించిన స్త్రోత్రాలూ గట్రా అన్నీ కూడా అందులోనే ఉంటాయని చెప్తూంటారు కదా…
ఈ మున్నీట పవళించు నాగశయనా పాట ఎమ్మెల్ వసంతకుమారిగారు చాలా గొప్పగా పాడారు. భూకైలాస్ చిత్రానికి కె.ఎన్. దండాయుధ పాణి పిళ్లై నృత్యదర్శకత్వం వహించారు. మన సాగరసంగమంలో కమల్ హసన్ నూతి డాన్సు గీతం ఉంటుంది కదా … తకిత తథిమి తందాన అంటూ …
అది కూడా షణ్ముఖప్రియలోనే ట్యూనినట్టు సమాచారం. ఇవన్నీ కాదుగానీయండీ … ఈవిడ లైఫు సినిమా తీయొచ్చు కదా … ఎవురేనా? బయోపిక్కు లెక్కన… https://www.youtube.com/watch?v=aoPVLmiQVpw
Share this Article
Ads