రోబో శంకర్ అనే ఓ కమెడియన్ ఉన్నాడు తమిళ సినిమా ఇండస్ట్రీలో… పార్టనర్ అనే సినిమాలో యాక్ట్ చేశాడు… నిర్మాతలు చెన్నైలో రీసెంటుగా ఓ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు… సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన ఆది, హన్సిక కూడా ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు… బాగా తాగి వచ్చాడేమో శంకర్… తనను ఏవో నాలుగు ముక్కలు మాట్లాడాలని నిర్వాహకులు కోరితే, వేదిక మీద హన్సిక మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేశాడు… తాగి ఫంక్షన్లకు వెళ్లడం, ఆడవాళ్లను కనీసం మనుషుల్లా కూడా పరిగణించకుండా వ్యాఖ్యలు చేయడం తమిళ ఇండస్ట్రీలో కూడా అలవాటే అన్నమాట…
రఫ్‌గా తెలుగులో చెప్పాలంటే… ‘‘ఉత్త మైనపు బొమ్మ, మైదాపిండి ముద్ద… ఈ సినిమా షూటింగులో తనతో ఓ సీన్ చేయాల్సి ఉంటే తాకడానికి కూడా అనుమతించలేదు,.. హీరో అయితేనే అలా ఫ్రీగా నటించడానికి వోకే చెబుతుందట, దాదాపు ఆమె కాళ్ల మీద పడినంత పనిచేసి బతిమిలాడినా వినలేదు… ప్చ్, హీరోలకున్న విలువ మాకెందుకు ఉంటుంది..?’’ అంటూ హన్సికను టార్గెట్ చేసి, ఏదేదో వాగాడు… అచ్చం కురుసభలాగే ఒక్కడూ తనను వారించలేదు… హన్సిక మొహం మాడిపోయింది…
కానీ ఇదంతా చూస్తున్న వికర్ణుడు వంటి ఓ జర్నలిస్టు, పేరు ఒట్రాన్ దొరై మాత్రం సీరియస్‌గా రియాక్టయ్యాడు… తను ‘హీరోయిన్ పుట్టుమచ్చలన్నీ చూశావా’ అంటూ తామే వెకిలిప్రశ్నలు సంధించే తెలుగు సినిమా జర్నలిస్టు కాదు కదా… ‘అసలు శంకర్ వంటి కేరక్టర్లను వేదిక మీదకు ఎందుకు ఎక్కనిస్తారు..?’ అంటూ నిర్వాహకులను అక్కడికక్కడే నిలదీశాడు… ఓ మహిళను సభావేదికపై కించపరుస్తుంటే, అమర్యాదను చూపిస్తుంటే ఎవరూ ఎందుకు మాట్లాడరు అని కడిగేశాడు…
Ads
అప్పుడు తెలివి తెచ్చుకున్న నిర్వాహకుల్లో ఒకాయన రోబో శంకర్ ఏదో సరదాగా ఏదో చెప్పబోయాడే గానీ ఎవరినీ కించపరచడం తన ఉద్దేశం కాదు అని సమర్థిస్తూనే… ఐనా ఎవరైనా బాధపడి ఉంటే మేం క్షమాపణలు చెబుతున్నాం అన్నాడు… కర్ర విరగకూడదు, పాము చావకూడదు… ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి అనడం ఏమిటి తలతిక్క రాజకీయ నాయకుల్లాగా… ఇలాంటివి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసే సింగర్ చిన్మయి వెంటనే అందుకుంది…
నిజానికి సదరు జర్నలిస్టుకు అవార్డు ఇవ్వాలి… ధైర్యంగా నిలదీశాడు అని ఓ ట్వీట్ కొట్టింది… రోబో శంకర్ మాటల్ని, జర్నలిస్టు ప్రశ్నల్ని వీడియోగా జతచేసింది… మామూలుగా ఇలాంటి వార్తలు రాయడం సినిమా జర్నలిస్టులకు ఇష్టముండదు… తమను టార్గెట్ చేసి, అవాయిడ్ చేస్తారని, రావల్సిన ‘కవర్లు’ రాకుండా పోతాయని భయమేమో… ఎంతసేపూ భజనలు తప్ప ఇంకేమీ రాయకుండా జాగ్రత్తపడుతుంటారు… చిన్మయి ట్వీట్ తరువాత కొన్ని ఫెమినిస్టిక్ సైట్లు శంకర్ తీరును ఎండగట్టడంతో ఇక మిగతావాళ్లకూ రాయకతప్పలేదు…
ఈ వార్త చదువుతుంటే అప్పట్లో యాంకర్ సుమ మీద వేదిక మీదే కమెడియన్ ఆలీ (ఇప్పుడు రాజకీయ నాయకుడు ) ఏదో పిచ్చి వ్యాఖ్య చేసిన తీరు గుర్తొచ్చింది… ఆమె వెనక్కి తీసుకెళ్లి ఆలీకి ఓ బలమైన ఝలక్ ఇచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి… సుమకు తెలుగు ఇండస్ట్రీ మీద ఆ పట్టు, సినిమా పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆలీని హెచ్చరించి నోరు మూయించింది… ఫాఫం హన్సిక… అవేమీ లేవు కదా, మౌనంగా ఉండిపోయింది…!! హీరోయిన్లకే ఈ సిట్యుయేషన్ ఉంటే ఇక కేరక్టర్ ఆర్టిస్టులు, డాన్సర్లు, ఎక్సట్రా ఆర్టిస్టుల పరిస్థితేమిటి..?!
Share this Article