సోషల్ మీడియాలో దిక్కుమాలిన బ్యాచ్ ఎప్పుడూ ఒకటి రెడీగా ఉంటుంది… ఎప్పుడు ఏం దొరుకుతుందా..? వివాదం రేపుదామా అని చూస్తూ ఉంటుంది… అఫ్‌కోర్స్, ఏదీ దొరక్కపోతే ఏదైనా క్రియేట్ చేయడానికీ ప్రయత్నిస్తూ ఉంటుంది… రోహిత్ శర్మ మీద వస్తున్న కొన్ని వార్తలు, ఆన్‌లైన్ సంవాదాలు కూడా ఇలాంటివే…
మొన్నటి టీ20 వరల్డ్ కప్ గెలిచాక రోహిత్ ఉద్వేగంతో పిచ్ మీద మట్టిని తిన్నాడు… సరే, దాన్ని కూడా ఓ ఆనంద ప్రకటనగా ఆహ్వానించినవాళ్లు ఉన్నారు… ఇదేమిటోయ్ అని వెక్కిరించినవాళ్లూ ఉన్నారు… క్రికెటర్లను మోడీ కలిసినప్పుడు కూడా ఈ మట్టి ప్రస్తావన వచ్చింది… అది వేరే సంగతి…
రోహిత్ శర్మ మరో పనిచేశాడు… ఒక జాతీయ జెండాను తీసుకొచ్చి పిచ్ మీద పాతే ప్రయత్నం చేశాడు… కానీ జెండా కర్ర పదునుగా లేకపోవడంతో అది నేలలోకి దిగలేదు… ఈలోపు అందరూ వీడియోల్లో, ఫోటోల్లో బంధించారు… కోట్ల మంది ప్రత్యక్షంగా చూశారు… సరిపోయింది…
Ads
ఇప్పుడు వివాదం ఏమిటట అంటే..? ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971 ప్రకారం… ఉద్దేశపూర్వకంగా జాతీయ జెండాను నేలను తాకనివ్వకూడదు అట… ఎవరో నెటిజన్ స్టార్ట్ చేశాడు… రోహిత్ శర్మ చేసింది రూల్ ప్రకారం నేరం అని..! ఇక దానిమీద ఏవేవో అభిప్రాయాలు… ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కదా అని కొందరి హితవచనాలు…
అందరూ మరిచిపోయింది ఏమిటంటే..? ఇక్కడ జాతీయ జెండాను అవమానపరచాలనే ఉద్దేశం లేదు అనేది..! పైగా మన జాతీయ జెండాకు ఖ్యాతిని, గౌరవాన్ని ఆపాదించడం… జై భారత్ అని నినదించడం ఒకరకంగా..! నేలను తాకిందా, తాకలేదా అనేది జస్ట్, టెక్నికల్… గతంలో ఆంక్షలు ఉండేవి గానీ ఇప్పుడు రిపబ్లిక్ డే, పంద్రాగస్టు రోజుల్లోనే గాకుండా ఎప్పుడైనా ఎక్కడైనా జెండాను డిస్‌ప్లే చేయొచ్చు…
ఎటొచ్చీ కావాలని అవమానించేలా ఏ చర్య ఉండకూడదు… ఇక్కడ రోహిత్ శర్మ చర్యలో అదేముంది..? ఇంకా నయం, వెంటనే కేసు పెట్టి జైలులో వేయాలని డిమాండ్ చేయలేదు… ఐనా కొన్నికోట్ల మంది చూశారు రోహిత్ శర్మ ఆనందాన్ని… ఒకరిద్దరు ఇలా రంధ్రాన్వేషణ స్టార్ట్ చేస్తారు, ఒక మొదలవుతుంది… ఏం సోషల్ మీడియారా బాబూ..!!
Share this Article