వేలకువేల కేసులతో ఊరూరా తెలుగుదేశం కేడర్‌ను తొక్కుతూ, ఇదే నాకు మార్క్ రాజకీయం అంటున్న జగన్… అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేనను చూసి వెనుకంజ వేస్తున్నాడా..? షూటింగుల నడుమ ఖాళీ వెతుక్కుని, ఇక్కడే కూర్చుంటా, తాట తీస్తా, తేల్చుకుని వెళ్తా అంటూ ఒక సినిమా నటుడు మాట్లాడుతుంటే, ఆ పార్టీని సరిగ్గా ‘టాకిల్’ చేయలేకపోతున్నాడా..? చివరకు లాఅండ్ఆర్డర్ సమస్యగా మారినా సరే, కదలిక లేదా..? పవన్ కల్యాణ్ మీద చేయిపడితే వెంటనే మోడీకి మస్తు కోపం వచ్చేసి, జగన్ సర్కారును రాత్రికిరాత్రి పీకేస్తాడా..? బెయిల్ రద్దు చేసిపారేసి, మళ్లీ జైలులో వేస్తాడా..? హేమిటో… మన చొప్పదంటు సందేహాలను కాసేపు పక్కన పెడితే… జబర్దస్త్ రోజా వ్యాఖ్యలు, బాధ ఆమె పట్ల సానుభూతినో, జాలినో కలిగించకపోగా ఒకింత విస్మయాన్ని కలిగిస్తోంది…
పార్టీవాదులను ఉద్దేశించి ఆమె మాట్లాడినట్టుగా ఓ ఆడియో మీడియాను ఆకర్షిస్తోంది… అయితే వర్తమాన ప్రపంచంలో ఏది ఫేకో, ఏది రియలో తెలియదు కాబట్టి, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదు… ఒకవేళ ఆమె నిజంగానే ఏమైనా చెప్పాలనుకుంటే మీడియాను పిలిచి చెప్పొచ్చు… నిజంగానే ఆమె అంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటోంది కాబట్టి… నిజానికి ఇప్పుడు కొత్తేమీ కాదు కాబట్టి… ఇప్పుడు ఇంకాస్త ముదిరాయి కాబట్టి… ‘‘ఇలాంటివారు పార్టీలో ఉంటే నేను రాజకీయాలు చేయడం కష్టం’’ అంటోందట ఆమె… పార్టీ హైకమాండ్ అభిప్రాయం కూడా అదేనని ఆమె గుర్తించలేకపోతోంది…
ఆమె ఎమ్మెల్యే, ఆమెకు మంత్రిగా కూడా చాన్స్ ఇచ్చాడు జగన్… అయినంతమాత్రాన ఆమె ప్రతి మాటకూ విలువనిస్తాడనీ, ఆమె మీద ఏకపక్షంగా అమితమైన అభిమానాన్ని కనబరుస్తాడనీ అనుకుంటే అది పెద్ద భ్రమ… ఆమె వ్యతిరేక వర్గమని తెలిసీ చక్రపాణిరెడ్డిని శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా చేశాడుగా… అంటే ఏమిటర్థం..? రోజాకు నీ స్థానం నువ్వు తెలుసుకుని జాగ్రత్తగా మసులుకో అని జగన్ స్వయంగానే చెప్పినట్టు… ఇంకెవరికో ఈడిగె కార్పొరేషన్ ఛైర్మన్ ఇచ్చాడు… వందల కార్పొరేషన్లలో ఆ కార్పొరేషన్‌కు పెద్ద ప్రాధాన్యం లేకపోవచ్చుగాక, కానీ తన వ్యతిరే కవర్గానికి హైకమాండే పాలుపోస్తోందనీ రోజా గుర్తించలేకపోతోందా..?
Ads
పెద్దిరెడ్డి తన వ్యతిరేకవర్గాన్ని ప్రోత్సహిస్తున్నాడనేది ఆమె బయటికి చెప్పే మాట కావచ్చుగాక… ఎస్, జగన్ దగ్గర ఆయన మాటే చెల్లుబాట… ఆయన, ఆయన కొడుకు మిథున్‌రెడ్డి జగన్ ఆంతరంగిక వర్గం… ఇలాంటి సమయాల్లో నియోజకవర్గంపై కాస్త కాన్సంట్రేట్ చేసుకోవాల్సింది పోయి, వైసీపీ అప్రకటిత అధికార ప్రతినిధిలా ప్రతి అంశంలోనూ వేలుపెట్టి ఏవో విమర్శలు చేస్తుంటుంది… ఆ ఈనాడు, ఈటీవీ, జబర్దస్త్‌తో ఆ సంబంధాలు దేనికి..? ఇంకా ఆ జబర్దస్త్ స్థాయిలోనే ఉండిపోతే ఎలా..? నియోజకవర్గంలో తన బలాన్ని సుస్థిరం చేసుకోవాలంటే జనంలో ఉండాలి…
చివరకు తనకు తెలియకుండా, తనకు చెప్పకుండా ఆర్బీకే, వెల్‌నెస్ సెంటర్‌కు తన వ్యతిరేకవర్గం భూమిపూజ చేస్తున్నారంటే… ఐనాసరే, పార్టీ లైట్ తీసుకున్నదంటే… పార్టీ ఒకరకంగా రోజానే లైట్ తీసుకుంటున్నట్టు లెక్క… ఆమెకు అర్థమవుతోంది… కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు… ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తుంటే, ప్రతిరోజూ ఇబ్బంది పెడుతున్నారు, నన్ను బలహీనపరుస్తున్నారు… పార్టీ పెద్దలు ఆలోచించాలి…’ అంటోందట ఆమె… అంటే జగన్‌కు తెలియకుండా జరుగుతున్నాయా ఆ నియోజకవర్గంలో ఆమె వ్యతిరేకవర్గం యాక్టివిటీస్..? ‘నేను రాజకీయాలు చేయడం కష్టం’ అనేదే ఆమె బాధ అయితే… ‘అది నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకోవాలమ్మా’ అన్నట్టుగా పొగపెడుతున్నట్టు కనిపించడం లేదా..?!
Share this Article