పూరీ జగన్నాథ్… తనకు ప్రేక్షకులంటే మహా అలుసు… లాజిక్కుల్లేవు, మ్యాజికుల్లేవు… ఓ అల్లరి చిల్లర ఆవారా హీరో… వాడికో ప్రేమకథ… డిష్యూం డిష్యూం ఫైట్లు, మోతాదు మించిన రొమాన్స్… పిచ్చి పాటలు, తిక్క గెంతులు… సగటు తెలుగు హీరోకు ఉండే సూపర్ హీరో లక్షణాలన్నీ సరేసరి… నాలుగు పదునైన డైలాగులు, అక్కడక్కడా చిన్న మెరుపులు… అంతే కథ చుట్టేస్తాడు… చూసేవాడి ఖర్మ ఇక..! తన హీరో పాత్రలన్నీ ఉత్త ఇడియాటిక్ కేరక్టరైజేషనే… అవును, ఇడియట్ అంటే గుర్తొచ్చింది… తన కొడుకు ఆకాశ్‌కు ఓ హిట్ అందించాలనీ, ఇండస్ట్రీలో నిలబెట్టాలనీ అప్పటి ఇడియట్ తరహా కథే రాసుకున్నాడు… దర్శకత్వ బాధ్యతల్ని శిష్యుడు పాదూరి అనిల్‌కు అప్పగించాడు… నిజానికి ఆ శిష్యుడు కూడా గురువు గీసిన గీత దాటకుండా అచ్చం జగన్నాథుడిలాగే తీశాడు సినిమాను… ఎంతసేపూ ఆకాశ్‌ను హీరోగా చూపించాలనేదే తాపత్రయం… తన కోసమే ఈ కథ… తన కోసమే ఈ సినిమా… అప్పట్లో ఆంధ్రాపోరి, మెహబూబా అట్టర్ ఫ్లాపులు కదా… ఈసారైనా ఓ ఖతర్నాక్ హీరోగా చూపించాలని ఆశపడ్డాడు పూరి…
నాకు రొమాంటిక్ సీన్లలో నటించడమంటే కాస్త ఇబ్బంది, అందుకే తగ్గించమని అడిగాను నాన్నను… సినిమా పేరే రొమాంటిక్, ఆ సీన్లు లేకపోతే అన్నాడు నాన్న నవ్వుతూ…. అని సినిమా ప్రమోషన్ ప్రెస్‌మీట్లలో చెప్పాడు ఆకాశ్… అసలు సినిమాలో బోలెడు సీన్లలో రొమాన్స్ మోతాదు మితిమీరిపోయింది… ఇక తగ్గించిందేముంది..? కొత్త హీరోయిన్ కేతికశర్మ ఫాఫం, ఒళ్లు దాచుకోకుండా కష్టపడింది… పూరి టేస్టుకు తగినట్టుగా ప్రయాసపడింది… అసలు హీరో హీరోయిన్ల నడుమ ప్రేమ ఏమిటో, మోహం ఏమిటో, నిర్వచనం ఏమిటో, బాష్యం ఏమిటో చెప్పడానికి పూరి నానా కష్టాలూ పడ్డాడు… చివరకు ఓ క్లాసిక్ సినిమా రేంజులో ఓ ట్రాజెడీ ఎండింగ్… ఇంతకీ పూరి ఏం చెప్పాలనుకున్నాడో ఎవరికీ ఓపట్టాన ఎక్కదు… అనాథగా మారిన హీరో డబ్బు కోసం అడ్డమైన వేషాలన్నీ వేస్తుంటాడు… అలాంటివాడికి హఠాత్తుగా అనాథపిల్లల కోసం ఇళ్లు కట్టించాలనేంత ఉదాత్తత ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు… పూరి హీరో కదా, అలాగే ఉంటారు…
Ads
చూస్తేనేమో ఇంటర్ చదువుతున్న పోరడిలాగా ఉంటాడు… అకస్మాత్తుగా గోవాలో ఓ గ్యాంగుకు లీడర్ అయిపోతాడు… హేమిటో ఈ తమషా… తెలుగు సినిమా అంటేనే గ్యాంగ్‌స్టర్లు, మాఫియాలు, పోరాటాలు, సూపర్ హీరోయిజాలు, హౌలా విలన్లు… అరె, ఏంట్రా ఇది..?! కాస్త సినిమాను బతికించింది రమ్యకృష్ణ… విలన్లను, రౌడీలను ఫటాఫట్ పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసే పోలీసాఫీసర్… కానీ అంతటి ఆఫీసర్ సైతం ఈ హీరోను బాబ్బాబు, ఆగరా అని దేబిరిస్తుంది, అదేమిటో… ఆమె రోల్ అయినా కనీసం సరిగ్గా ఉంటే బాగుండేది… హీరో పేరు వాస్కోడిగామానో, కొలంబసో ఏదో ఉంది… హీరోకు దోస్త్‌గా నటించిన దేవియాని శర్మ కూడా కాస్త బెటర్… హీరోయిన్ అందాల్ని ఆరేసుకోవడం, పారేసుకోవడమే కాదు, కాస్త నటనలో బేసిక్స్ నేర్చుకోవాలి… పూరి జగన్నాథ్ కూడా తన కొడుకు వాయిస్ టోన్, డైలాగ్ డెలివరీని ఓసారి సీరియస్‌గా పరిశీలిస్తే, ఏమైనా మార్పులు సాధన చేయిస్తే బెటరేమో… నటన అంటే మెల్లిగా నేర్చుకోవచ్చు… తెలుగు హీరో కాబట్టి చల్తా…! మరీ టీన్స్‌లోనే గ్యాంగ్‌స్టర్‌ను చేసి, చంపేబదులు… ఏదైనా కొత్త కథ రాసుకోవచ్చు కదా పూరీ…!!
Share this Article