కొందరు అంతే… ఏదైనా అనుకుంటే ఇక రాజీపడేది ఉండదు… ఎన్ని వివాదాలైనా చుట్టుముట్టనీ… నష్టాలు తీసుకురానీ… పట్టినపట్టు విడిచిపెట్టారు… ఓసోస్, మహా అయితే ఈ అధికార వ్యవస్థ మమ్మల్ని ఏం చేయగలదు, బదిలీ చేయగలదు అంతే కదా అనుకునే కొందరు సివిల్ సర్వీస్ అధికారులకయితే ఈ ఫీల్ మరీ ఎక్కువ… బదిలీలకు సిద్దపడి, ఎప్పుడూ చెప్పుల్లో కాళ్లు పెట్టుకుని కూర్చునేవాళ్ల గురించి ఇంకేం చెప్పేది..? కర్నాటక ఐపీఎస్ అధికారిని రూప కూడా అంతే… కెరీర్లో ఏడాదికి ఓ బదిలీ… సో, వాట్..? నేనిలాగే ఉంటాను అంటోంది…
అప్పట్లో శశికళకు జైలులో రాచసౌకర్యాలను బయటపెట్టిన అధికారిణి తెలుసు కదా… కాస్త మొండిఘటమే… తను నమ్మితే చాలు, ఇక ఎవరేం చెప్పినా వినదు… సూటిగానే పోతుంది… తలకు బొప్పి కట్టినా సరే… హోం శాఖ ముఖ్యకార్యదర్శి అంటే రాష్ట్ర స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారికి మంచి పోస్టు… అక్కడికి నుంచి ఆమెను నేరుగా చేతివృత్తుల కార్పొరేషన్‌కు కొట్టింది ఇటీవల యడ్యూరప్ప ప్రభుత్వం… ఎందుకు..? అదీ ఇంట్రస్టింగు…
Ads
బీజేపీ పాలిత రాష్ట్రాల పాలన వ్యవహారాల్లో అవినీతి అక్రమాలు ఉండవు, అందరూ శుద్ధపూసలు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ల అమాయకత్వం… విషయం ఏమిటంటే..? కర్నాటకలో దాదాపు 4500 కోట్ల ఐఎంఏ స్కామ్ ఒకటి చోటుచేసుకుంది… అందులో బెంగుళూరు సేఫ్ సిటీ ప్రాజెక్టు విలువ 620 కోట్లు… ఆ టెండర్లలో బాగోతాలు చోటుచేసుకున్నాయనేది రూప ఆరోపణ… దానికి బాధ్యుడు మరో ఐపీఎస్ అధికారి హేమంత్ నింబాల్కర్… రూప, నింబాల్కర్ ఇద్దరూ ఐజీ ర్యాంకు అధికారులే…
ఈ నింబాల్కర్ ప్లస్ అజయ్ హిలోరి అనే మరో డీఐజీ ర్యాంకు ఐపీఎస్ అధికారి కలిసి అక్రమాలకు పాల్పడ్డారనేది ఆరోపణ… సీబీఐ కేసు కూడా పెట్టింది… ఈ కేసులో ఉన్న నాన్-ఐపీఎస్ అధికారులను అక్టోబరులోనే సస్పెండ్ చేశారు… మరి ఈ ఐపీఎస్ అధికారులను ఎందుకు వదిలేయాలీ అంటుంది రూప… ఆమె హోం శాఖ ముఖ్యకార్యదర్శి హోదాలో చీఫ్ సెక్రెటరీకి లేఖ కూడా రాసింది… వీళ్ల పంచాయితీ తల్నొప్పిగా మారుతోందని గమనించిన యడ్యూరప్ప ప్రభుత్వం మొన్నటి డిసెంబరు 31న ఈమెను శిక్షగా చేతివృత్తుల కార్పొరేషన్‌కు బదిలీ చేసింది… సదరు నింబాల్కర్‌ను కూడా ఇంటర్నల్ సెక్యూరిటీకి బదిలీ చేసింది… చీఫ్ సెక్రెటరీ కూడా రిటైర్ అయిపోయాడు…
ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కదా అని తోటి ఐపీఎస్ అధికారులు వాదిస్తారు… నో నో, డీపీఏఆర్ (సర్వీసెస్) హోం శాఖను శాఖాపరమైన చర్యలను సిఫారసు చేయాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వమే స్పందించలేదు… సీబీఐ కూడా అదే సూచిస్తోంది… ఆ సిఫారసు వెళ్తే కేంద్ర హోం శాఖ కచ్చితంగా చర్య తీసుకుంటుంది… నాన్-ఐపీఎస్‌లకు ఒక వైఖరి, ఐపీఎస్‌లు అయితే మరో వైఖరా..? అనేది రూప ప్రశ్న… నిజానికి సదరు నింబాల్కర్ సీబీఐ కేసు మీద హైకోర్టును ఆశ్రయించాడు… కోర్టు స్టే ఇవ్వలేదు గానీ మరీ సంబంధిత అధికారులపై కఠినచర్యలు వద్దని సూచించింది… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? వాళ్లిద్దరినీ నాన్-ఫోకల్ పాయింట్లకు బదిలీ చేసేసి, ఇక ఆ భారీ స్కాం వివాదానికి తెరవేయాలనేదేనా కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశం… అన్యాయం కాదా..?!
Share this Article