.
Pardha Saradhi Potluri
….. నేపాల్ లో రాజకీయ, ఆర్ధిక సంక్షోభం!
మోడస్ ఆపరేండి చూస్తే డీప్ స్టేట్ వైపు వేళ్ళు చూపిస్తున్నాయి!
కాదు! ఇది భారత్ కి చెందిన RAW ఆపరేషన్ అని కూడా అంటున్నారు! నిజా నిజాలు ఏమిటో చూద్దాం!
సూత్రధారి : బాలేంద్ర షా! నేపాల్ రాజధాని ఖాట్మండుకి ఏ రాజకీయ పార్టీకి చెందని స్వతంత్ర అభ్యర్థిగా మేయర్ పదవి కోసం పోటీలో నిలిచి గెలిచి ఖాట్మండుకి మేయర్ అయ్యాడు!
బాలేంద్ర షా 35 ఏళ్ళ యువకుడు!
ఖాట్మండు మేయర్ అయిన బాలేంద్ర షా ఇచ్చిన పిలుపు మేరకు నేపాల్ యువకులు వేల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం సృష్టించారు!
Ads
- నేపాల్ పోలీస్, సైన్యాన్ని కూడా లెక్కచేయకుండా పార్లమెంట్ భవనానికి, ప్రధాన మంత్రి ఇంటికి ఇలా అధికార, ప్రతిపక్ష రాజకీయ నేతల ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళ ఇళ్లలో ఉన్న ఖరీదైన వస్తువులని దోచుకొని చివరికి నిప్పు పెట్టారు.
నేపాల్ యువకులు అధికార కమ్యూనిస్ట్ పార్టీ నే కాదు, ప్రతిపక్షం అయిన నేపాల్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన కూడా దాడులు చేశారు. అంచేత జరిగిన దాడిని ఏదో ఒక పార్టీ కి వ్యతిరేకంగా జరిగినట్లుగా చూడకూడదు.
మొత్తంగా రాజకీయ వ్యవస్థ మీదనే దాడి జరిగింది.
కారణం ఏమిటీ?
అవినీతి!
ప్రజల సొమ్ముని దోచుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న రాజకీయ నాయకులు, వాళ్ళ పిల్లలు ఇలా మొత్తం కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు అనే భావన నేపాల్ యువకులలో చాలా కాలం నుండి పాతుకుని పోయి ఉంది!
తేడా ఎక్కడ వచ్చింది?
సోషల్ మీడియా! Yes. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, టిక్ టాక్ ఇలా అన్ని ప్లాట్ ఫామ్స్ లలో రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు వీడియో, ఫోటోలు షేర్ చేస్తూ చూసారా నా కొత్త ఇంపోర్టెడ్ కారు ధర 50 లక్షలు, కొత్త సోఫా సెట్ ఇటలీ నుండి తెప్పించాం ధర 20 లక్షలు అంటూ యువకులని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతూ రావడమే ఆశాంతికి మూలకారణం!
నేపాల్ రాజకీయ పార్టీ నేతల కూతుర్లు అల్లుళ్ళు, కొడుకులు కోడళ్ళు, మనవళ్లు మనవరాళ్లు విదేశాలలో విందులు, వినోదాలతో కాలక్షేపం చేస్తున్న వీడియో లు, ఫోటోలు గత కొంత కాలంగా సోషల్ మీడియాలలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
ఒక పక్క తమకి ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు రాజకీయ అవినీతితో వాళ్ళ పిల్లలు రాజ భోగాలు అనుభవిస్తున్నారు అనే భావన క్రమంగా పెరుగుతూ వచ్చింది!
“Nepo Kids ” Corrupted Politicians పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ వస్తున్న నేపథ్యంలో 13- 23 మధ్య వయసు ఉన్న యువకులు ఆవేశంతో రోడ్ల మీదకి రావడం జరిగింది.
పిడుగుకి తద్దినానికి ఒకే మంత్రం ఉండదన్నట్లుగా ప్రధాని KP శర్మ ఓలి సోషల్ మీడియా మీద నిషేధం విధించాడు, ఎందుకంటే సమాచార మార్పిడి వల్లనే ఆశాంతికి మూల కారణం అని భావించి!
- నిషేధం విధించడంలో కూడా పక్షపాతం చూపించాడు. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్, యూ ట్యూబ్, X ల మీద నిషేధం విధించి చైనా టిక్ టాక్ ని వదిలేసాడు!
దాంతో యువకులలో అసహనం పెరిగి అది చివరికి హింసకి దారి తీసింది!
టార్గెట్ ఎవరు?
వారూ వీరూ అనే భేదం లేకుండా అన్ని రాజకీయ పక్షాల నాయకులు, వాళ్లకి వంత పాడుతున్న మీడియా హౌస్ లు యువకుల టార్గెట్ లోకి రావడమే కాదు మీడియా సంస్థల మీద కూడా దాడి చేసి తగులపెట్టారు.
ప్రధాని kp శర్మ ఓలి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించాక కూడా యువకులు శాంతించలేదు సరికదా ఏకంగా ప్రధాని నివాసం మీద దాడి చేసి నిప్పు పెట్టారు!
సైన్యం శాంతిభద్రతలని తమ చేతుల్లోకి తీసుకున్నా కూడా హింస ఆగలేదు!
నేపాల్ సుప్రీమ్ కోర్టుని కూడా వదల్లేదు యువకులు!
జెన్ జీ ఆందోళన ( Gen Z)!
ఏమిటీ ఈ జెన్ జీ పద ప్రయోగం?
మనం జెడ్ అని అంటాం కానీ పాశ్చాత్య దేశాలలో Z ని జీ అని పిలుస్తారు.
ఈ జెనరేషన్ Z వెనుక ఉన్న కధేంటి?
ఒక్కో తరం ( జెనరేషన్) కి ఒక్కో పేరుపెట్టి పిలవడం అనేది కెనడాకి చెందిన రచయిత డగ్లస్ కూప్ లాండ్ ( Douglas Coupland ) తన పుస్తకం “ Generation X : Tales for an accelerated culture ” పుస్తకంలో ఆయా కాలాల్లో పుట్టిన వాళ్లకి జెనరేషన్ X లాంటి అక్షరాలని తగిలించి వాడడంతో మొదలయ్యింది కాబట్టి ఈ ఒరవడికి ఆద్యుడిగా చెప్తారు.
అఫ్కోర్స్! డగ్లస్ కూప్ లాండ్ రాసిన పుస్తకం Generation X: Tales for an Accelerated Culture అనే పుస్తకం అన్ని దేశాల వాళ్ళు చదవతగ్గదే ఎందుకంటే ఫలానా సంవత్సరంలో పుట్టిన వాళ్ళ కాలంలో అప్పటి సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర,టెక్నాలజీ, కుటుంబ వ్యవస్థ లాంటి అంశాలని వివరంగా చెప్తాడు డగ్లస్…
కానీ ప్రధానంగా కెనడియన్, అమెరికన్ సంస్కృతి, టెక్నాలజీలని ఆధారంగా చేసుకొని రాసాడు కానీ అదే కాలంలో మన దేశంలోని టెక్నాలజీ, సంస్కృతి, ఆర్ధిక స్థితిగతులని బేరీజు వేసుకుంటే మనకి కూడా కనెక్ట్ అవుతుంది. ఆయా జెనరేషన్లకి చెందిన వారి IQ ఎలా ఉండేదో కూడా తెలుస్తుంది. మన పైన తరాలవారి కృషి వల్లనే కదా ఇప్పటి టెక్నాలజీని మనం అనుభవిస్తున్నాం!
- మొబైల్ కాదు కదా కనీసం ఇంట్లో రేడియో లేని తరం నుండి కొత్త ఆవిష్కరణలు జరిగాయి.
1946-1964 ల మధ్య పుట్టినవారిని బేబీ బూమర్స్ ( Baby Boomers) గా వ్యవహరించాడు డగ్లస్. రెండవ ప్రపంచ యుద్ధం (1945) ముగిసాక పుట్టిన వాళ్ళకి అక్కలు, అన్నలు, తమ్ముళ్లు, చెల్లెళ్ళు ఎక్కువమంది ఉండేవారు కనుక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేదో వివరిస్తాడు. జీవితం చాలా నింపాదిగా ఉండేది అప్పట్లో. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అన్ని దేశాలలో జాననాల రేట్ ఎక్కువగా ఉండేది ఇది మన దేశానికి కూడ వర్తిస్తుంది.
1.1950-64 – జనేరేషన్ బేబీ బూమర్స్
2.1965-79 – జనరేషన్ X
3.1980-94 – జెనరేషన్ మిల్లీనియల్స్
4.1995-2009 – జెనరేషన్ Z ( ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది)
5.2010-24 – జెనరేషన్ ఆల్ఫా
6.2025….జెనరేషన్ బేటా
************************
(మిగతా తరువాయి కథనంలో....)
Share this Article