.
Murali Buddha …. ఓ గ్రూపులో కనిపిస్తే పవర్ స్టార్ కు బాగా సరిపోతుందేమో అనిపించింది …… “కావమ్మ మొగుడు.. అంటే కామోసు అనుకున్నాను....
_ (భలే సరదాగా ఉంటుంది… చదవండి)_
=================
దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగానీ ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్నా తనదైన హాస్యం జత చేసేవారు… ఒకసారి మండలిలో అప్పటి CM NTR గురించి మాట్లాడుతూ… మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది అన్నారు. ఎన్‌టిఆర్ స్పందిస్తూ నాకు కథలంటే చాలా ఇష్టం చెప్పండి అన్నారు. రోశయ్య చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదీ…
Ads
ఒక ఊళ్ళో వైశ్య దంపతులు తమ కూతురుకు 8 ఏళ్ళు రాగానే వివాహం చేసారు. తరువాత అల్లుడు వచ్చి మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళటానికి 2- 3 ఏళ్ళు పడుతుంది, నేను దేశాటన చేసి వ్యాపారంలో డబ్బు, అనుభవం సంపాదించుకొని వస్తానన్నాడు.
అత్తామామలు సంతోషంగా సరేనన్నారు. రెండేళ్ళు నాలుగేళ్ళయినా అల్లుడు రాలేదు. అత్తామామలు ఆందోళన చెందారు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం అమ్మలక్కలు మంచినీళ్ళ కోసం బావి దగ్గరకెళ్ళారు. అక్కడ ఒక యువకుడు కాషాయ బట్టలు కట్టుకొని కనిపించాడు. అతనిని చూసి ఒక స్త్రీ కావమ్మ మొగుడులా ఉన్నాడంటే మిగిలిన వారు కూడా అవునని, వెంటనే కావమ్మ తల్లిదండ్రులకు కబురు పంపించారు…
వారు పరుగున వచ్చి, ఇంటికి తీసుకెళ్ళారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి విందు భోజనం పెట్టి అమ్మాయితో శోభనం జరిపించారు. నెలరోజులు గడిచిన తరువాత అసలు భర్త వచ్చాడు. జరిగింది విని, కంగుతిని ఎందుకు ఇలా చేశారని నిలదీశాడు.
అత్తగారు వెళ్ళి ఆ దొంగవాడిని అదే మాట అడిగింది. అందుకు అతడు కావమ్మ మొగుడంటే కామోసు అనుకున్నాను. కాదంటే నా కాషాయ బట్టలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అన్నాడు..,
రోశయ్య చెప్పిన కథ విని ఎన్‌టిఆర్ తో సహా సభ్యులందరూ నవ్వారు… తరువాత ఎన్‌టిఆర్ తేరుకుని నాకూ కావమ్మ మొగుడికీ సంబంధం ఏమిటి అనడిగారు…
మీరు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు. సినిమాల్లో డబ్బు, కీర్తి ఆర్జించారు… 60 ఏళ్ళు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. నటనలో ఉన్న అనుభవం పరిపాలనలో లేనందున అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నెగిటివ్ గ్రోత్ రికార్డు అయ్యింది. ధరలు పెరుగుతున్నాయి.
విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితం ప్రజలపై పడటానికి సంవత్సరం పడుతుంది. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు– నాకేం తెలుసు మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి మళ్ళీ సినిమాల్లోకి పోతానంటారు… అని ముక్తాయించారు రోశయ్య…
ఎవరినైనా బోల్తా కొట్టించగల నేర్పరితనం రోశయ్యకు ఉంది… పి.వి. నరసింహారావు, రోశయ్య నంద్యాలలో ఒక సభలో ప్రసంగించారు. సభానంతరం తిరిగి వెళ్ళుతున్నప్పుడు నరసింహారావు… ఏమయ్యా రోశయ్య! జనం నీప్రసంగం కి చప్పట్లు, ఈలలు వేస్తూ విన్నారు. కానీ నేను ప్రసంగిస్తుంటే స్తబ్ధుగా ఉండిపోయారు. ఏమిటి కారణం అనడిగాడు…
దీనికి రోశయ్య బదులిస్తూ… అయ్యా, మీ ప్రసంగం ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట కచేరీలా ఉంటుంది. మరి నా ప్రసంగం ఎల్‌ఆర్ ఈశ్వరి పాటలాగా ఉంటుంది అని చెప్పి పీవీని నవ్వించారు… అది ఆయన విలక్షణ వ్యక్తిత్వం… _ (ఇది సేకరణే : -- వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు)
Share this Article