పెద్ద ప్రశ్న..! జవాబు తెలియని ప్రశ్న..! ఒక ప్రఖ్యాత గాయకుడు సంపాదించిన ఆస్తులకు తన కొడుకు వారసుడు అవుతాడేమో చట్టల ప్రకారం, ఆనవాయితీగా వస్తున్న పద్ధతి ప్రకారం..! కానీ మరణించాక తన గొంతుపై వారసత్వం, హక్కులు ఎవరివి..?
ఇదెందుకు మళ్లీ తెర మీదకు వచ్చిందీ అంటే..? బాలు గొంతును ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో కీడా కోలా సినిమా కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్, సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌కు బాలు కొడుకు చరణ్ నోటీసులు ఇచ్చాడు, భారీ పరిహారం, క్షమాపణ, రాయల్టీ అడిగాడు… ఈ కథ అందరికీ తెలిసిందే…
నిజానికి ఈ నోటీసులే పెద్ద అబ్సర్డ్… మరణించిన ఆ మహాగాయకుడి గొంతు, ఆ పాటలు ప్రజానీకానివి… ఏళ్ల తరబడీ ఆ పాటలు విని, అభిమానించిన శ్రోతలవి… అది జాతీయ సంపద… దాని మీద బాలు కొడుక్కి రైట్స్ ఏముంటాయి..? కోర్టుకు వెళ్లినా తను గెలిచేవాడా..? వోకే, తండ్రి గొంతును ఎవరైనా భ్రష్టుపట్టిస్తారు అనుకుంటే కొడుకుగా దాన్ని అడ్డుకోవాల్సిందే, కరెక్ట్… కానీ క్షమాపణ చెప్పాక ఇక రాయల్టీ దేనికి..? రాయల్టీ చెల్లిస్తే ఆ దందాలో తనూ భాగస్వామి అవుతాడు కదా, మరిక క్షమాపణ దేనికి..? రాయల్టీ చెల్లించడానికి అంగీకరించాక, దాన్ని చరణ్ యాక్సెప్ట్ చేశాక ఇక భారీ పరిహారం దేనికి..? ఇక అందులో అనైతికత ఏముంది.,?
Ads
నిజంగానే కోర్టు దివంగతుల గొంతుల వారసత్వంపై ఏమంటుందో చూసే అవకాశం ఉంటే బాగుండేది… అలాగే ఎన్టీయార్ బొమ్మను ఎఐ సాయంతో ఏదైనా సినిమాలో అలాగే వాడుకుంటే దానిపై రైట్స్ ఎవరికి ఉంటాయి..? అసలు రైట్స్ ఉంటాయా..? బాలకృష్ణకా, మొత్తం కుటుంబసభ్యులకా..? లక్ష్మిపార్వతికా..? తెలుగు జాతికా..? ఎవరివి రైట్స్..? అసలు దివంగతుల బొమ్మల్ని, గొంతుల్ని మళ్లీ కృత్రిమంగా వాడుకోవడం నైతికమేనా..?
తాజాగా తరుణ్ భాస్కర్ తులసివనం అనే వెబ్ సీరిస్ ట్రెయిలర్ లాంచ్ సమయంలో ఓ క్లారిటీ ఇచ్చాడు… “మాకు ఎస్పీ చరణ్ సార్‌కు మధ్య కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ సమస్య వచ్చింది… అది మా సైడ్ నుంచి, ఎస్పీ చరణ్ సార్ సైడ్ నుంచి కూడా… ఎవరైనా సరే ఏదైనా సమ్‌థింగ్, ఎగ్జైటింగ్ కొత్తగా చేయాలని అనుకుంటారు… అలాగే మన సినీ లెజండరీలను గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది… అంతకు మించి ఏం లేదు… ఎవరినీ అవమానించాలన్న ఉద్దేశం మాకు లేదు…
ఏదో ఒకటి కొత్తగా చేయాలనే ప్రయత్నం, అంతే… మనమందరం ప్రయోగాలు చేయాల్సిందే… ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది… ఏ సమస్య లేదు” అని చెప్పుకొచ్చారు… సరే, వివాదం సద్దుమణిగింది… కానీ ఒక జాతీయ సంపదగా పరిగణించి, దాన్ని ఏ పొల్యూషన్ బారిన పడకుండా కాపాడుకోవాల్సి ఉంది కదా… మరి చరణ్‌కు తరుణ్ భాస్కర్ ఎంత సొమ్ము ముట్టజెప్పాడు..? రాయల్టీ ఇస్తానన్నాడా..? ఎలా క్లియర్ అయిపోయింది..? ఇన్నేళ్లూ బాలును నెత్తిన పెట్టుకున్న మన జనానికి తెలియాల్సిన అవసరం లేదా..? ఇది తరుణ్ భాస్కర్, చరణ్ నడుమ సమస్యా..? లేక సినిమా సంగీత శ్రోతల ఇష్యూయా..?
ఏమాటకామాట… చరణ్ అదృష్టవంతుడు… పాడటంలో వారసత్వం రాలేదు గానీ, బాలు సంపాదించిన బోలెడు ఆస్తుల మీద వచ్చింది… ఇప్పుడు ఆయన మరణించాక కూడా ఆ గొంతు సంపాదించి పెడుతూనే ఉంది…! అప్పట్లో ఇళయరాజా, బాలు నడుమ ఓ వివాదం రేగింది కదా… పాటల్ని లైవ్ కాన్సర్టుల్లో పాడినా, ఏరకంగా వాడుకున్నా రాయల్టీలు ఇవ్వాలని… అందులో గాయకులకూ రాయల్టీ ఉంది… సో, ఆ డబ్బులూ చరణ్‌కే దక్కుతున్నాయా..? బాలు వారసత్వంగా వదిలివెళ్లిన పాడుతా తీయగా, స్వరాభిషేకం కూడా చరణ్‌కు దక్కాయి… చరణ్, యువార్ సో లక్కీ..!!
Share this Article