రాధేశ్యామ్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో పెట్టేశారుగా… ఆ కథలో ప్రధానమైన చర్చ డెస్టినీ… అంటే, విధిరాత… దాన్నెవడూ తప్పించలేడు అనే జనాభిప్రాయానికి భిన్నంగా… మనిషి బతుకు చేతుల్లో కాదు, చేతల్లో ఉంటుందనే విషయం చెప్పడానికి దర్శకుడు విఫలప్రయత్నం చేశాడు… శుద్ధ తప్పు… చేతల్లో ఏముంది..? చేతుల్లోనే ఉంది… అందుకే సినిమా మునిగిపోయింది… ఆ సినిమాలో టైటానిక్‌లాగే…
జ్యోతిష్యం 99 శాతం సైన్స్ కావచ్చుగాక, కానీ ఆ ఒక్క శాతం విధిరాత నుంచి తప్పించుకుంటారు, వాళ్లే చరిత్ర సృష్టిస్తారు అంటూ ఓ శుష్క, మిథ్యావాదాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించి, చివరకు తను ఏం చెబుతున్నాడో తనకే అర్థం గాక, తను అంతులేని ఓ గందరగోళపు సునామీలో కొట్టుకుపోయాడు, ప్రేక్షకుడిని కూడా ఆ ఉప్పునీటి ఉప్పెనలో ముంచేశాడు…
ఎస్… చేతులు కాలాక దర్శకుడికి అర్థమై ఉంటుంది… డెస్టినీ ఈజ్ డెస్టినీ అని… లేకపోతే ఒక్కసారి పోల్చిచూడండి… అనేకానేక అసహజమైన, తర్కరాహిత్యపు సీన్లను ఒక్కచోట కుట్టేయబడి, అసాధారణ హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ ఆర్ఆర్ఆర్ వందల కోట్లను దండుకుంటోంది… పలు సీన్లలో లాజిక్కు లేదు, మన్నూమశానం ఏమీలేదు… ఐనా బంపర్ హిట్…
హీరోయిన్ లేనట్టే లెక్క… కామెడీ లేదు… బలమైన కథ లేదు… అదరగొట్టే సంగీతం లేదు… అయితేనేం… దున్నేస్తోంది… బట్… అంతే ఖర్చు… రాధేశ్యామ్ మాత్రం బొక్కబోర్లా పడింది… దేశంలో ఇప్పటివరకూ ఇంత డిజాస్టర్ మరొకటి లేదనే పేరు సంపాదించుకుంది… ఇందులోనూ ఓ పాన్ ఇండియా హీరో ఉన్నాడు, పాపులర్ హీరోయిన్ ఉంది… హిందీ మార్కెట్ కోసం అందులో ఆలియా ఉంటే ఇందులో భాగ్యశ్రీ ఉంది… పెద్ద బ్యానర్లు, వరల్డ్ మార్కెట్… కానీ ఫలితాలు వేర్వేరు… సో, డైరెక్టర్ రాధాకృష్ణా… భవిష్యత్తు మన చేతల్లో కాదు, చేతిగీతల్లోనే ఉంది… రాయబడిన రాతల్లోనే ఉంది…
Ads
నిజంగా ఒక బాహుబలి, ఒక సాహో… పాన్ ఇండియా హీరో స్టేటస్… చేతిలో వందల కోట్ల కొత్త భారీ ప్రాజెక్టులు… కానీ ఈ సినిమా ఎందుకు అంగీకరించాడు ప్రభాస్..? ఏ మూల్యానికి..? తన స్టార్‌డంకు పూర్తి కంట్రాస్టు సినిమా కథకు ఎందుకు తలూపాడు… ఆకాశం నుంచి ఓ సాధారణ కథానాయకుడి పాత్రకు దిగిరావాలనుకున్నాడా..? ఆ వైవిధ్యంలో ప్రేక్షకుడు కొత్తదనాన్ని ఫీలవుతాడని భావించాడా..? మూర్ఖత్వమా..? ప్రయోగమా..? వ్యవహారజ్ఞానం లేకపోవడమా..? సాహసమా..?
కానీ ఒక్కటి నిజం… రాంచరణ్, జూనియర్ రాజమౌళి వేసిన ఓ కమర్షియల్ బాటలో సాఫీగా వెళ్లిపోయారు… వాళ్ల ఇమేజీ, వాళ్ల స్టార్‌డంకు మరింత హైప్… రిస్క్ లేదు… కానీ ప్రభాస్ చేసింది రిస్కీ టాస్క్… రొటీన్ ఇండియన్ ఫార్ములా సినిమాలో ఉన్నట్టుగా మితిమీరిన అసహజమైన హీరోయిజం స్టంట్లు లేవు… ఐటమ్ సాంగుల్లేవు… వెకిలి, వెగటు డైలాగుల్లేవు… తుపాకులు, బుల్లెట్లు, డిష్యూం డిష్యూంలు లేవు… ఎక్కడా భూతద్దం పెట్టి వెతికినా అశ్లీలం జాడ కనిపించదు… వర్తమాన, వ్యవహారిక వ్యాపార కోణంలో ప్రభాస్ చాలా రిస్కీ ప్రాజెక్ట్ ఇది…
రాధేశ్యామ్ ఫెయిల్యూర్… ఓ దుష్ఫలితాన్ని మోసుకొచ్చింది… ఇప్పటికీ సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్‌లను మించి సుప్రీమ్ హీరోయిజంలో బతుకుతున్న మన హీరోలు ఇక సాధారణ పాత్రల్ని, భిన్న కథల్ని అంగీకరించరు… సాహసం చేయరు… చేతులు కాలిన ప్రభాస్ పరిస్థితి చూశాక ఇక ప్రయోగాలు, సాహసాలు ఎవరు చేస్తారు..? అలాగని ఈ సినిమా బాగుందని చెప్పడం లేదు…
కృష్ణంరాజు పాత్ర ఓ పెద్ద తప్పు… పూజా హెగ్డే రాంగ్ చాయిస్… సినిమా ఫెయిల్యూర్‌లో 50 శాతం కారణం ఆమెకు ఇచ్చిన వాయిస్ ఓవర్… పరమ కృతకంగా ఉంది… ఏదో హిందీ సినిమాకు తెలుగు డబ్బింగ్ వెర్షన్ అన్నట్టుగా ఉంది… క్లైమాక్స్‌లో గ్రాఫిక్స్ నాసిరకం… అంత ఖర్చు పెట్టీ ఆ ఔట్‌పుట్ ఏమిటో వాళ్లకే తెలియాలి… పాటలు మరీ భావకవిత్వంలా, మార్మికగీతంలా ఎవరికీ అర్థం గాకుండా ఉన్నాయి… మెలొడియస్ ట్యూన్లు ఉన్నంతమాత్రాన సరిపోదు కదా… కథలో లాజిక్‌రాహిత్యం సరేసరి… మురళీశర్మకు స్కోప్ లేదు… ఎయిర్‌టెల్ పిల్ల శశా చెత్రిని తీసుకున్నారు గానీ, ఓ సైడ్ కేరక్టర్‌కన్నా తక్కువ… భాగ్యశ్రీ అంతే… ప్రభాస్, పూజ కెమిస్ట్రీ కూడా పండలేదు…
కానీ ఏమాటకామాట… కొన్ని చోట్ల మాత్రం గ్రాండియర్… సినిమాటోగ్రఫీ, లొకేషన్లు, సెట్లు కళ్లప్పగించి చూసేలా ఉన్నయ్… సో, రెండూ భారీ, అత్యంత భారీ సినిమాలే… రెండు కథలూ తర్కరహితాలే… రెండింట్లోనూ పాపులర్ స్టార్లే… రెండూ పాన్ ఇండియా స్టేటసే… కానీ రిజల్ట్..? ఒకటి బాటమ్… ఒకటి స్కై… దాన్నే డెస్టినీ అంటారేమో దర్శక మహాశయా..! జ్యోతిష్యం వంటి సబ్జెక్టులోకి, ఫిలసాఫికల్ చర్చలోకి కథను తీసుకెళ్లాలీ అనుకుంటే… అది ఇలా మాత్రం కాదేమో…!! అబ్బే, జస్ట్ దాన్ని ఓ నేపథ్యంగా వాడుకున్నాం, కానీ మా ప్రధాన కథ ఓ లవ్ స్టోరీ మాత్రమే అంటారా..? ఏమో, అదీ కన్విన్సింగుగా లేదు…
సినిమా తీసేటప్పుడు తామేం తీస్తున్నామో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి… రైలు, జ్యోతిష్యం, యాక్సిడెంట్ గతంలో కొన్ని సినిమాల్లో ఉన్న సీనే… ఇక్కడ ప్రభాస్ ఓ అమ్మాయి చేయి చూస్తాడు… ఆర్చరీ వద్దు, ఎడ్యుకేషన్ వైపు బెటర్ అంటాడు… ఆమె చేతి గీతల్లో మరణమేమీ చూడడు… కానీ రైళ్లో ప్యాసింజర్లు ఒక్కసారిగా చేతులు చాపి, మా జాతకం చెప్పండి అంటారు… నా స్టేషన్ వచ్చిందంటూ ప్రభాస్ తప్పించుకుని దిగిపోతాడు… కానీ వెంటనే వాళ్ల చేతుల్లో రేఖలన్నీ ఒకే టైమ్‌లో మరణాన్ని సూచిస్తున్నాయి అంటాడు… ఎలా..? తను అసలు వాళ్ల చేతుల్ని చూడనే చూడడు కదా… ఇలాంటి సీన్లు చాలా ఉన్నయ్…
ఏమాటకామాట… నేను శాస్త్రం చెబితే శాసనమే అని ఫీలయ్యే హీరో… వంద శాతం ప్రిడిక్షన్ సక్సెస్ రేటు ఉన్న హీరో… తన విశ్వాసాన్ని బద్దలు కొడుతూ… ఆ రైలు ప్రమాదంలో బతికి, చేయి పోగొట్టుకున్న అమ్మాయి హీరోకు కొన్ని ప్రశ్నలు వేస్తుంది… ఆ సీన్ చిత్రీకరణ, ఆ ప్రశ్నలు, ఆ సీన్ బాగా వచ్చింది… ఆ అమ్మాయి అదే ఆర్చరీలో సాధన చేసి, పారా ఒలింపిక్స్‌లో విజేతగా నిలుస్తుంది… దర్శకుడు జస్ట్, ఎండ్ టైటిల్స్ సమయంలో ఒక్క ఫోటోలో ఆ విషయాన్ని చెప్పాడు… నిజానికి అవే ప్రేక్షకుడికి బాగా కనెక్టయ్యేవి… అవే ఈ దర్శకుడు నిర్లక్ష్యంగా వదిలేసినవి…!!
హస్తసాముద్రికానికి జ్యోతిష్యంలో అంత పెద్ద ప్రాముఖ్యత ఉందా..? ఇది ఓ చిక్కు ప్రశ్నే… పైగా చేతిరేఖలు రేఖామాత్రంగా జాతకాన్ని చెబుతాయేమో గానీ, మరీ వృత్తి, పుట్టిన సంవత్సరం వంటి వివరాలు చెబుతాయా..? ఏ రోగంతో మరణించాడో కూడా చెబుతాయా..? హేమిటో మరీ ఈ సినిమా… హీరో ప్రిడిక్షన్స్ అబద్ధం అని నిరూపించడానికి హీరోయిన్ ఆత్మహత్యకు ప్రయత్నించడం ఏమిటో… విధిరాతను పట్టుకోలేకపోవడం జ్యోతిష్య వైఫల్యం అవుతుంది, అంతేతప్ప విధిరాతను తప్పించుకున్నట్టు కాదు… ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు కథకుడా..?!
ఎంచక్కా ఏ పుష్ప వంటి సినిమాయో తీసుకోక నీకెందుకు ఈ ప్రయోగాలు ప్రభాస్..? ప్రేక్షకులకూ అవే కావాలి… అదే డబ్బులు కురిపిస్తయ్, అవే స్టార్‌డం పదిలంగా కాపాడుతయ్… లేదంటే ఓ సాదాసీదా డిష్యూం డిష్యూం సినిమా తీసి వదిలేస్తే పోలా..?! మరీ ఇటలీ దాకా ఇంత ఖర్చుతో తీసుకుపోయి, మరీ ఆ పూజా హెగ్డేకు మమ్మల్ని బలిపెడతావా..? ఆయ్ఁ ….
Share this Article