Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

RRRR… మూడార్లు కాదు… తెలుగుదేశంలో బాబు వెనుక నాలుగార్లు…

May 29, 2022 by M S R

మొన్న రాజమౌళి తీసిన సినిమా పేరు ఆర్ఆర్ఆర్… దానికి టెక్నికల్‌గా పూర్తి పేరు రౌద్రం, రణం, రుధిరం… నిజానికి రాజమౌళి, రాంచరణ్, రామారావు జూనియర్… ట్రిపుల్ఆర్ అది… ప్రస్తుతం తెలుగుదేశంలో ఆర్ఆర్ఆర్ఆర్, అంటే మూడార్లు కాదు, నాలుగార్లు… ఇంగ్లిషులో క్రాడ్రుపుల్ ఆర్ శకం… ఒకటి ఈనాడు రామోజీ, రెండు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మూడు టీవీ5 రాజగోపాలనాయుడు, నాలుగు పార్టీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ…

గతంలో టీవీ9 రవిప్రకాష్ పేరు ఉండేది… అది ఇప్పుడు కనిపించడం లేదు… జగన్ అప్పుడప్పుడూ అంటుంటాడు కదా… పోరాడాల్సింది చంద్రబాబుతో కాదు, ఈ మారీచ మీడియాతో అని..! ఆ మూడు మీడియా సంస్థలు ప్లస్ సోషల్ మీడియా చూసుకునే రాబిన్ శర్మ… ఇంకా రెండుమూడు ఆర్లు ఉండవచ్చుగాక, కానీ అవి తెరపై కనిపించవు…

మొన్నమొన్నటిదాకా రామోజీ క్యాంప్ వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని పాటించింది… అక్కడ మోడీ, ఇక్కడ జగన్, కేసీయార్‌ల జోలికి పోలేదు… ఇప్పుడు మళ్లీ ఈనాడు జగన్ వెంటపడుతోంది… ఒకప్పుడు ఎన్టీయార్‌ను వికృత కార్టూన్లతో చీల్చిచెండాడిన రామోజీ నిన్న ఆహా రామారావు, ఓహో రామారావు అంటూ ఓ లేఖ విడుదల చేశాడు… సో, రియల్ రామోజీ ఆన్ ఫైర్ అగెయిన్…

(ఇప్పుడు అందరూ యుగపురుషుడు, శకపురుషుడు, కలియుగదైవం అని ఆకాశమెత్తు అతిశయ విశేషణాలతో కీర్తిస్తున్నారు గానీ… ఫాఫం, ఆత్మక్షోభతో అల్లాడుతూ, అదే వేదనతో మరణించిన ఆయనకు అంతిమరోజుల్లో నాలుగు సాంత్వన పలుకులు కూడా కరువయ్యాయి… ఆ పరిస్థితిని మాత్రం ఒక్కరూ గుర్తుచేసుకోలేదు… ఒక్క వాక్యమూ కనిపించలేదు…

కలియుగంబున నిక నుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి…

…. అని మహాకవి శ్రీనాథుడు చివరిరోజుల్లో గడ్డుకాలాన్ని అనుభవించి వెళ్లిపోయినట్టుగానే… అదే శ్రీనాథుడి పాత్రను అనితరసాధ్యంగా పోషించిన ఎన్టీయార్ కూడా ఆత్మవేదనతోనే జీవితాన్ని చాలించాడు…)

రాధాకృష్ణలో దాపరికం ఏమీ లేదు… ఆయన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకన్నా పెద్ద అభిమాని… జగన్‌తో నేరుగానే ఢీకొడుతున్నాడు… ఏం చేస్తావో చేసుకోపో అని బహిరంగంగానే జగన్‌కు సవాళ్లు విసురుతున్నాడు… టీవీ5 రాజగోపాలనాయుడు ప్రధానంగా డప్పు కళాకారుడు… టీడీపీ వ్యూహాల్లో వేళ్లు, కాళ్లు పెట్టేరకం కాదు… రాబిన్ శర్మది తెరవెనుక పని…

నిజానికి చంద్రబాబు రాజకీయాల్లో అతి పెద్ద ముదురు… తనకు వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రణాళికలు ఎవరూ చెప్పాల్సిన పనిలేదు… టీడీపీని హైజాక్ చేసి, ఓనర్‌షిప్ సంపాదించి, ఇన్నాళ్లు దాన్ని కాపాడటమే ఓ పెద్ద సక్సెస్… బయటపడడు… ఎవరు చెప్పినా వింటున్నట్టు నటిస్తాడు… ఈ ఫోర్ ఆర్స్ విషయంలోనూ అంతే… కానీ ఈ నాలుగు మొహాలను టీడీపీ క్యాంపు ఎలా చూస్తుందనేది పక్కనపెడితే జగన్ క్యాంపు మాత్రం భూతాలుగా చూస్తోంది…

అందుకే మరి రాధాకృష్ణ బహిరంగంగానే చంద్రబాబు ఎలా మారాలో, ఏం చేయాలో, ఏ పద్ధతిలో పార్టీ నడపాలో, ఏ ఈక్వేషన్లు పాటించాలో ఓ ఫార్ములాను తాజా వ్యాసంలో పొందుపరిచాడు… (గతం నుంచీ తను సలహాలు, సూచనలు ఇస్తూనే ఉంటాడు… చంద్రబాబు తన పద్ధతిలో తను వెళ్తూనే ఉంటాడు… నిజానికి నాయకుడు అలాగే ఉండాలి…) ఏవేవో సలహాలు రాసేసిన రాధాకృష్ణ చివరలో… ఇవన్నీ చంద్రబాబు పాటిస్తేనే తెలుగుదేశానికి గొప్ప పునాది పడుతుందన్నాడు… నలభై ఏళ్ల వయస్సున్న పార్టీకి ఇప్పుడు గొప్ప పునాది పడటం ఏమిటో తనకే తెలియాలి… పైగా ఆ పునాది 30, 40 ఏళ్లకు అక్కరకొచ్చేలా ఉండాలట…

  • చంద్రబాబు మొహమాటం వీడాలి, అనర్హులను దూరం పెట్టాలి అంటున్నాడు…. కానీ ఇది సరైన సలహా కాదు, చంద్రబాబులో అలాంటి మొహమాటాలేమీ ఉండవు… వాడుకుని, అవసరం తీరాక జస్ట్, అలా తీసిపడేస్తాడనేది జనానికి కూడా తెలుసు… ఇప్పుడు తనపై మొహమాటస్థుడు అనే ముద్ర అవసరం లేదు…
  • 60 శాతం వరకూ కొత్త మొహాలకు టికెట్లు ఇవ్వాలట… ఇదీ కరెక్టు కాదు, ఇప్పుడు అన్నిరకాలుగా రాటుదేలిన నాయకుల్నే చంద్రబాబు నమ్ముకోవాలి… లేకపోతే జగన్ క్యాంపును ఎదుర్కోవడం కష్టం…
  • ఎన్టీయార్ పార్టీ పెట్టినప్పుడు 90 శాతం కొత్తవాళ్లకు టికెట్లు ఇచ్చాడు….. ఇది రాజకీయ అపరిపక్వ వ్యాఖ్య… అప్పట్లో అది కొత్త పార్టీ… మరి కొత్తవాళ్లు గాకుండా ఇంకెవరు ఉంటారు..? ఆ 90 శాతాన్ని ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకుంటే ఎలా..?

 

  • లోకేష్‌కు జనామోదం కావాలి… అనువైన సమయం చూసుకుని పాదయాత్ర చేపట్టాలి…….. మంచి సూచనే… ఆల్‌రెడీ ఆ ప్లాన్ నడుస్తోంది… కానీ పాదయాత్రలు మాత్రమే ప్రజల్లో యాక్సెప్టెన్సీని తీసుకురావు… లీడర్‌షిప్ క్వాలిటీస్ చూస్తారు ప్రజలు…
  • టీడీపీ క్యాంపులో కోటరీ నడుస్తోంది, జనంలో ఉండే నాయకుల్ని గౌరవించడం లేదు, కార్పొరేట్ కంపెనీ కాదు ఇది, రాజకీయ పార్టీగా నడపండి…… సరైన సూచనే… కానీ కోటరీ వ్యవస్థకు ఏ పార్టీ అతీతం కాదు… జగన్ క్యాంపు కూడా అంతే కదా…
  • వాస్తవానికి తెలుగుదేశం మళ్లీ పుంజుకోవాలంటే చంద్రబాబో, లోకేషో చేసేది ఏమీ ఉండదు పెద్దగా… ఈ నాలుగు కేరక్టర్లు చేయగలిగింది కూడా ఏమీ ఉండదు… ఆ పని కూడా జగనే చేసిపెడతాడు..!! (అర్థమైనవాళ్లకు అర్థమైనంత…)

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం… లోకేష్ కూడా అదే బ్లడ్డు, అదే బ్రీడు కదా… ఆ గూటి పక్షికి ఆ కూతలే కదా..?!
  • నువ్వు చాలా దిల్‌దార్… గ్రేటే కానీ, మరి తెలంగాణ నీటిప్రయోజనాల మాటేంటి..?
  • ఝలక్కులు కావు… ఇదుగో మజ్లిస్ జిల్లాల్లో పోటీకి తొలిదఫాలో గుర్తించిన సీట్లు…
  • ఆధునిక సినిమా ద్వేషి రంగనాయకమ్మకూ నచ్చిన శంకరాభరణం..!
  • ‘‘ఆర్టిస్టులను గౌరవిద్దాం సరే… ప్రజల మనోభావాలను వాళ్లూ గౌరవించాలి కదా…’’
  • సహస్ర శిరచ్ఛేద ‘అహిలావతి’ కథ… రాక్షసరాజును పెళ్లాడిన ప్రజ్ఞా యోధ…
  • స్టెప్ మోషన్‌లో… ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ ‘కవర్’ చేయాల్సి వచ్చింది…
  • అది ఖచ్చితంగా గూఢచర్య పరికరమే… అన్ని దేశాలపైనా చైనా నిఘా కన్ను…
  • ముంబైలో వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
  • సుప్రీం చెప్పినా కదలని కేసీయార్ సర్కారు…! తొండి ఆట- మొండిచేయి…!!

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions