Gurram Seetaramulu…. స్పష్టమైన బ్రాహ్మణ, బనియా, బద్రలోక్ వ్యతిరేక నినాదంతో మొదలైంది బహుజన సమాజ్ పార్టీ. ఎన్నికలకు ముందు ఏ పార్టీతో అవగాహన లేకుండా అధికారం చేజిక్కించుకోవాల్సి వస్తే, కలిసి వచ్చే ఎటువంటి శక్తిని (దళిత వ్యతిరేక) అయినా కలుపుకోవడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడం కాన్షీరాం ఆలోచన. ఆ పార్టీ ప్రధాన వ్యతిరేక శక్తి కాంగ్రెస్. ఇది నలభై ఐదేళ్ళ కింద కాన్షీరాం అవగాహన… ఆనాడు bjp ఒక మైనర్ పాయ… అదొక వానపాము… కాంగ్రెస్ అనకొండ…
ఒక పంజాబీ సిక్కు చమార్ దిగువ మధ్యతరగతి ఉద్యోగి… కేవలం చిన్నా చితకా కొలువు చేసుకునే బడుగుజీవులనే నమ్ముకుని . కారంచేడు నెత్తుటి మడుగులో తడిసిన కాలంలోనే (మూడు నెలల ముందు) బహుజన సమాజ్ పార్టీ తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. మొదటిసారి అన్ని స్థానాలలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు.
కానీ పదేళ్ళలోనే అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఒక చమార్ నాయకుడు. అనకొండలాంటి కాంగ్రెస్ ను దేశ రాజకీయాలను శాసించి దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ఒక దళిత ఆడబిడ్డకు నాలుగు సార్లు అధికారాన్ని అప్పజెప్పాడు. మహార్ కుల కేంద్రీకృత ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, రిపబ్లికన్ పార్ట్, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఇవేవీ కనీసం అంబేద్కర్ ని కూడా గెలిపించలేక పోయాయి. కానీ కాన్షీరాం దాన్ని అధిగమించాడు .
Ads
తారకం, శివసాగర్, కొల్లూరి చిరంజీవి, నల్లా సూర్యప్రకాష్, ఆరెస్ ప్రవీణ్ కుమార్ ఇంకా ఇంకా ఇంకా ఎంతో మంది దళిత బహుజన మేధావులు, కవులు, రచయితలు ఫాస్ట్ ట్రాక్ లాగా పార్టీలో చేరడం అధికారం దక్కకుంటే తప్పుకోవడం ఒక తమాషా అయ్యింది. ఒక పార్టీని లేదా భావజాలాన్ని నిర్మించాలి అంటే మనకు స్పష్టమైన వర్గ/కుల శతృవు ఉండాలి. కాన్షీరాంకు తన శతృవు ఎవరో స్పష్టంగా తెలుసు. అందుకే దక్షిణాసియాలోనే ఒక బలమైన రాజకీయ శక్తిని ఆయన నిర్మించగలిగాడు. ఆయన ఆయుధం తనకు వారసులు లేరు.
పెళ్లి పెటాకులు లేవు. అన్నిటికన్నా దేన్నయినా ఎదిరించే బలం యుక్తి కమిట్మెంట్ ఆయనకు ఉంది. ఈ నలభై ఏళ్ళలో BSP భావజాలాన్ని నమ్ముకుని ఉన్నవాళ్ళు అరుదు. చేరిన ఆరు నెలలలోనే అధికారం రావాలి, రాష్ట్రాన్ని శాసించాలి అనుకుంటే వాళ్ళు ప్రవీణ్ కుమార్ IPS లాగా మిగిలి, బూర్జువా పార్టీ కాపలాదారుడిగా మిగిలిపోతాడు తప్ప కాన్షీరాం ఎప్పటికీ కాలేడు. మాయావతిలాగా అధికారాన్ని పొందలేడు.
ఒకనాటి చిన్న BJP ఇప్పుడు ఫాసిస్ట్ శక్తిగా అవతరించింది. మానవాళికి ప్రమాదకరంగా మారింది. దశాబ్దాలు దేశాన్ని శాసించిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అయ్యింది. కాన్షీరాం కాలం నాటి BJP కాంగ్రెస్ రూపంలో సారంలో ఇప్పుడు ఒకేలా లేవు. డా.ఆర్ యెస్ ప్రవీణ్ కుమార్ కనీసం యేడాది కూడా పార్టీలో నిలదొక్కుకోక పోవడానికి ప్రధాన కారణం ఆయనకు అధికార దాహం అయినా ఉండాలి లేదా తాను నమ్మిన పార్టీ తనను నమ్మక పోవడం అయినా జరిగి ఉండాలి.
తన వృత్తిలో ముప్పై ఏళ్ళు ఉండగలిగిన మనిషి రాజకీయాలలో ముప్పై నెలలు ఎందుకు ఉండలేక పోయాడు అనేది మిలియన్ వోట్ల మిస్టరీ. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేరు ఒక నీతిని నిర్మించలేరు అన్న అంబేద్కర్ స్థాపించిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తనను కూడా గెలిపించలేదు… కానీ ఈ దేశంలో కులం పునాదిగా, కులం భావజాలంగా పెట్టుబడి పెట్టి అధికారాన్ని పాదాక్రాంతం చేసుకున్న వాడు ఒక్కడే ఒకరు కాన్షీరాం.
కాన్షీరాంని BSPని రెండింటినీ చంపింది మాయావతి. రెస్ట్ ఈజ్ హిస్టరీ. రెండు రోజుల్లో BJP బి టీం అయిన కల్వకుంట్ల కుటుంబంలో తన బలాన్ని యుక్తినీ బహుజనుల ఆశలనూ కెసిఆర్ యజ్ఞంలో దర్బల్లాగా మసి చేయబోతున్నాడు అనేది నిజం . (ఈ కథనంలోని అంశాలు పూర్తిగా రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు…)
Share this Article