కథ రాముడి చుట్టూ తిరిగితే అది రామాయణం… అలా గాకుండా కథను రావణుడి చుట్టూ తిప్పుతూ, తననే బలంగా ఎలివేట్ చేస్తే..? నాయకుడి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోతే..? అది రుద్రంగి సినిమా…! రావణుడు, దుర్యోధనుడు వంటి ప్రతినాయక పాత్రల్ని కూడా నాయక పాత్రలకు దీటుగా చూపించడం పాతదే… ఎన్టీయార్ ఏనాడో చేశాడు ఆ పని… ప్రేక్షకులు ఆమోదించి చప్పట్లు కొట్టారు కూడా… అయితే ఆ పాత్రల చిత్రణలో తమ నెగెటివ్ చర్యలకు, పోకడలకు జస్టిఫికేషన్ ఇచ్చే కొంత ప్రయత్నం ఉంటుంది… అంతేతప్ప వాళ్లనే హీరోలుగా చేయరు…
రుద్రంగి సినిమాలో జగపతిబాబు పాత్ర నిజానికి విలన్… కానీ కథ మొత్తం తనచుట్టే తిరుగుతుంది… విలన్ లక్షణాలే… కానీ దొర లేదా దేశ్‌ముఖ్ పాత్రను పోషించిన సీనియర్ నటుడు జగపతిబాబు విలన్ పాత్ర ముందు హీరో పాత్ర ఆశిష్ గాంధీ తేలిపోయాడు… నాయక పాత్రకు కూడా ఇంకాస్త ఇంపార్టెన్స్ ఇస్తూ, మరో నటుడిని గనుక తీసుకుని ఉంటే సినిమా ఇంకాస్త బాగుండేదేమో…
పాతకాలంలో దొరల అకృత్యాలను, అరాచకాలను సినిమాల్లో చూపడం ఇదేమీ కొత్త కాదు… రాములమ్మ దగ్గర నుంచి చాలా సినిమాల్లో చూపించిందే… ఈ సినిమాలో విశేషం ఏమిటంటే… సినిమా కథ దొర కోణంలోనే సాగుతుంది ప్రధానంగా…! అలాగని ఆ పాత్రకు పాజిటివ్ వైబ్స్ ఏమీ కృతకంగా అద్దబడలేదు… ఇందులో హీరో గానీ, హీరోయిన్ గానీ పెద్ద ఇంప్రెసివ్ కాదు… విలన్, ఇతర పాత్రలే బలంగా ఫోకసయ్యాయి…
Ads
మొన్న ఏదో ఇంటర్వ్యూలో నాకు ఈ సినిమాలో థర్డ్ ఇన్నింగ్స్ స్టార్టవుతుందని అన్నాడు జగపతిబాబు… అర్థం లేని వ్యాఖ్య… తను హీరోగా కాలం చాలించి, ఏనాడో నాన్-హీరో పాత్రలకు షిఫ్టయ్యాడు… వాటిల్లో ఇదీ ఒక పాత్ర… కాకపోతే రొటీన్ విలనీ పాత్రలు, కేరక్టర్ పాత్రలు గాకుండా… సినిమా మొత్తాన్ని తనే మోసే హీరోయిక్ విలన్ పాత్ర… తను గొప్ప నటుడేమీ కాదు… కానీ ఈ దొర పాత్రకు బాగా సూటయ్యాడు… న్యాయం చేయడానికి బాగా శ్రమించాడు…
ఈ సినిమాలో చెప్పుకునేది మరొకటుంది… మమతా మోహన్‌దాస్… మనందరికీ తెలిసిన నటే… ఆమధ్య పలు అనారోగ్య దశలు అనుభవించి, మళ్లీ సక్సెస్ ఫుల్ గా తెర మీదకు వచ్చింది… ఓ బలమైన, వైవిధ్యమైన పాత్ర లభించింది… సద్వినియోగం చేసుకుంది… దొర మరో భార్య పాత్రలో విమలారామన్, దొర మనసుపడ్డ యువతి పాత్రలో గానవి తదితరులు పర్లేదు… కథ ఎలా ఉన్నా దాన్ని ప్రజెంట్ చేసిన తీరు కూడా పర్లేదు… పాటలు, బీజీఎం వోకే… ఎమ్మెల్యే, గాయకుడు, తెలంగాణ సాంస్కతిక సారథి రసమయి బాలకిషన్ ఈ సినిమాకు నిర్మాత…
పర్లేదు, ఏదో పిచ్చి సినిమాను తీసి జనం మీద రుద్దకుండా… ఓ భిన్నమైన కథను మంచి నిర్మాణ విలువలతో జనంలోకి వదిలాడు… అయితే ఇంకాస్త ఫాస్ట్‌నెస్ ఉంటే బాగుండేది… ప్రజెంట్ ట్రెండ్ తెలంగాణ ఆట, పాట, కథ, భాష, కల్చర్, నేపథ్యం… పైగా ఇది తెలంగాణ పీరియాడికల్ మూవీ… జగపతిబాబు గురించి కాకపోయినా మమతా మోహన్‌దాస్ నటన, ఆ పాత్ర చిత్రణలో వైవిధ్యం గురించైనా ఓసారి చూడొచ్చు…
Share this Article