70 ఏళ్ల తరువాత జర్మనీ ఆర్ధిక పరిస్థితి దిగజారడం ఇదే మొదటి సారి ! ఏడ్చే వాళ్ళను నమ్మకు, నవ్వే వాళ్ళని ఆపకు… జర్మనీ దేశంలో 70 ఏళ్ల తరువాత తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితిని ఎదుర్కుంటున్నది. ప్రస్తుతం 7.9 % శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ముందు ముందు ఇంకా పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహుశా రెండో ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ బాగా దెబ్బతిన్న తరువాత పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతున్నట్లుగా భావిస్తున్నారు.
యూరోపులో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశంగా జర్మనీ పేరు గాంచింది ఇప్పటి వరకు… కానీ ఇప్పటి స్థితిని చూస్తుంటే ఎక్కువ కాలం యూరోపులో కెల్లా ధనిక దేశంగా ఉండే అవకాశాలు లేవు. రష్యా నుండి నాచురల్ గాస్ తో పాటు పెట్రోల్, డీజిల్ ని చవుక ధరకి కొనుక్కుంటూ వచ్చిన జర్మనీ యూరోపు దేశాలలో ప్రధమ స్థానంలో ఉంది. ఇప్పుడు రష్యా నుండి గ్యాస్, చమురు సరఫరా ఆగిపోవడం వలన నిత్యావసర వస్తువుల ధరలకి రెక్కలు వచ్చాయి దాంతో ప్రస్తుత పరిస్థితి దాపురించింది.
*****************************
Ads
ప్రపంచ దేశాలు మరీ ముఖ్యంగా 130 కోట్ల జనాభా ఉన్న భారత దేశ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే చవుక ధరలో గ్యాస్, చమురు సరఫరా చేసుకుంటూ బ్రతుకుతున్న యూరోపు దేశాలు ఇప్పుడు చమురు ధరలు పెరగానే ఆందోళన చెందుతున్నారు. అంటే మనం మాత్రం ధరలు తగ్గాలి అనుకుంటున్నాము. మన దేశానికి ఎలాంటి పైప్ లైన్ లేదు గ్యాస్ మరియు చమురుని దిగుమతి చేసుకోవడానికి.
******************************
పెరుగుతున్న ద్రవ్యోల్బణంని అరికట్టేదానికి జర్మన్ ఛాన్సలర్ Olaf Scholz మాత్రం తక్షణం €200bn యూరోలని చమురు, గ్యాస్ సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. గతంలో ఇదే యూరోపు,అమెరికా దేశాలు భారత దేశానికి నీతులు చెప్పాయి : భారత ప్రభుత్వం వ్యవసాయ, చమురు, గ్యాస్ సబ్సిడీలని ఇవ్వడం మానేయాలి. ధరలు పెంచాలి. ఇలా అయితేనే ప్రపంచ బ్యాంక్ నుండి లేదా యూరోపు దేశాల నుండి అప్పు పుడుతుంది లేదంటే లేదు అని…. ఇప్పుడు నొప్పి తెలుస్తున్నది కదా ?
******************************
జర్మనీలో గత ఆగస్ట్ నెలలో నిత్యావసరాల ధరల పెరుగుదల శాతం 8.8% శాతంగా ఉండగా సెప్టెంబర్ నెలకి వచ్చేసరికి 10.9% శాతంగా నమోదు అయినట్లు జర్మన్ ఫెడరల్ స్ట్రాటిస్టీకల్ ఏజెన్సీ [federal statistical agency] పేర్కొంది. అయితే ఇది ఇంకా పెరిగి డబుల్ డిజిట్ కి చేరుకోవచ్చని ఆంచనా వేసింది. 1951 తరువాత ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరగడం ఇదే మొదటిసారి అని కూడా పేర్కొంది సదరు ఏజెన్సీ. అయితే ఈ ధరల పెరుగుదల కేవలం జర్మనీకి పరిమితం అవుతుంది అనుకుంటే పొరపాటే. మొత్తం యూరోపు దేశాలలో ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్ కి చేరుకుంటుంది అని federal statistical agency పేర్కొంది.
*************************
యూరోపియన్ సెంట్రల్ బాంక్ ఇప్పట్లో వడ్డీ రేట్లని పెంచే యోచనలో లేము అని ప్రకటించింది. అదే సమయంలో రుణాల మీద వడ్డీ శాతం మీద పెంపు గురించి ఆలోచిస్తున్నాము, కానీ తప్పదు అని పేర్కొంది. మన దేశంలో కూడా డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ శాతం తగ్గించే అవకాశం ఉంది భవిష్యత్తులో…
***************************
గత ఆరు నెలలుగా నెలకి 2.2% శాతం చొప్పున ధరలు పెరుగుతున్నాయి జర్మనీలో. ప్రజలు ఇంధనం ధరలని తట్టుకోవడానికి అంటూ నెలవారీ ట్రైన్ టికెట్ మీద 8 యూరోలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గత ఆగస్ట్ నెలలో ఇంధనం ధరల పెరుగుదల 36% శాతంగా ఉండగా సెప్టెంబర్ నెలలో అది 48%గా నమోదు అయ్యింది. అదే విధంగా ఆహార ధాన్యాలు వాటి ఉత్పత్తుల ధరల పెరుగుదల ఆగస్ట్ నెల కంటే రెట్టింపు అయ్యాయి.
************************
ఇదంతా పుతిన్ వేసిన చావు దెబ్బ యూరోపు మీద!
మూడు రోజుల క్రితం రష్యా నుండి జర్మనీకి నాచురల్ గ్యాస్ సరఫరా చేసే నొర్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ బాల్టిక్ సముద్రంలో పేలిపోయి గ్యాస్ సముద్ర పైభాగంలోకి చొచ్చుకొని వచ్చింది. అయితే ఈ పని నాటో చేసింది అని పుతిన్ ఆరోపిస్తున్నాడు… అంతకు వారం ముందే అమెరికన్ CIA ఏ క్షణంలో అయినా సముద్రం అడుగున ఉన్న గ్యాస్ పైప్ లైన్ ని రష్యా పేల్చివేస్తుంది అంటూ ముందస్తుగా హెచ్చరించడం అలాగే మూడు రోజుల తరువాత పైప్ లైన్ పేలి పోవడం జరిగింది !
సంక్షోభం ఇంతలా ముదిరిపోవడానికి కారణం ఆగస్ట్ నెలలో యూరోపుకి నాచురల్ గ్యాస్ సరఫరా చేసే పైప్ లైన్ ని పూర్తిగా నిలిపివేసింది రష్యా. మెయింటనెన్స్ చేస్తున్నాము కాబట్టి పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాడు పుతిన్, కానీ దానిని మళ్ళీ పునరుద్ధరించలేదు. మూడు రోజుల క్రితం పైప్ లైన్ ని పేల్చివేశాడు. కాబట్టి మానవతా దృక్పధంతో గ్యాస్ సరఫరా పునరుద్ధరించమని అడిగే అవకాశం లేకుండా చేశాడు పుతిన్. దీనివల్ల జర్మనీలో చలికాలం ఇంటిని వెచ్చగా ఉంచడానికి కావాల్సిన గ్యాస్ మీద రేషన్ విధించింది ప్రభుత్వం. ఇలా చేసినా ఈ చలికాలం మొత్తానికి సరిపడా గ్యాస్ నిల్వలు అయితే లేవు. నిజానికి జర్మనీతో పాటు మరికొన్ని యూరోపు దేశాలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు ముందుగానే చెల్లింపులు చేసి ఒప్పందం కుదుర్చుకున్నాయి రష్యాతో… కానీ తన డాలర్లని ఫ్రీజ్ చేయడంతో అవి పనికిరాకుండా పోయాయి అని పుతిన్ అసలుకే గ్యాస్ సరఫరా ఆపేశాడు…
****************************
మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే యూరోపులో ఆయిల్ రిఫైనరీస్ లేవు, ఉండవు. అవి కాలుష్యాన్ని వెదజల్లతాయి కాబట్టి వాళ్ళు రిఫైనరీస్ ని పెట్టరు. రష్యా నుండి నేరుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ లని దిగుమతి చేసుకుంటూ వచ్చారు చాలా తక్కువ ధరకి. మన విదేశీ మారక ద్రవ్యంలో సింహా భాగం చమురుకే ఖర్చుపెట్టాల్సిన స్థితి. వాళ్ళకి అలాంటి ప్రమాదం ఏమీ లేదు కానీ ఇప్పుడు డాలర్ తో పోలిస్తే యూరో ధర పడిపోవడం, ఇంధనం, ఆహార ధరలు పెరగడంతో గగ్గోలు పెడుతున్నారు. కానీ మన దేశంతో పాటు ఆసియా దేశాలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి అంటూ ఉపన్యాసాలు చెప్తారు. జర్మనీ కార్లని ఉత్పత్తి చేసి అన్ని దేశాలకి ఎగుమతి చేస్తుంది కానీ ఆ కార్లు మనం కొని కాలుష్యాన్ని వెదజల్లవచ్చు అన్నమాట !
చెడపకురా చెడేవు ! డిసెంబర్, జనవరి నెలలు చాలా కీలకం యూరోపుకి. చూద్దాం చలి తట్టుకోలేక ప్రజలు ఎలా రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తారో అలాగే ఎంతకాలం సబ్సిడీలు ఇస్తూ పోతారో !
2023 లో ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం వస్తుంది, ఇది తప్పదు కానీ ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు, కాబట్టి ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యే అవకాశాలని కొట్టిపారవేయలేము. అసలు యూరోపియన్ యూనియన్ కి సగం పైగా నిధులు సమకూర్చే జర్మనీ నాకెందుకు ఈ కంచి గరుడ సేవ అనుకోని పక్కకి జరిగిపోదని ఎవరన్నా చెప్పగలరా ? అసలు అమెరికా ఛత్ర చాయ నుండి బయట పడితేనే కానీ మనం సుఖంగా ఉండలేము అన్న సత్యాన్ని ఇకనైనా గ్రహిస్తాయా యూరోపు దేశాలు ?
గ్లోబల్ ఎకానమీ అంటూ అన్ని దేశాలు ఒక దాని మీద ఇంకొకటి ఆధారపడం వలన అభివృద్ధి ఏమో కానీ ఎవరో వేల మైళ్ళ దూరంలో తుమ్మితే ఆ తుంపరలు మన మీద పడే రోజులు ఇవి…
Share this Article