Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సృష్టికి ప్రతిసృష్టి ఎప్పుడూ డేంజరే… అప్పుడప్పుడూ ప్రాణాంతకాలు కూడా…

November 11, 2023 by M S R

Ruthless Robo: వెనుకటికి ఒక బద్దకస్థుడు ఏ పనయినా చిటికెలో చేసి పెట్టే దయ్యం కోసం ఘోరమయిన వామాచార అభిచార హోమం చేశాడు. అతడి హోమానికి మెచ్చి దయ్యం ప్రత్యక్షమయ్యింది.
“నాకు నా పళ్లు తోముకోవడం కూడా బద్దకమే. ఎప్పుడూ నా వెంట ఉండి…నేను నోటితో చెప్పడం ఆలస్యం…నువ్వు ఆ పనులన్నీ చేసి పెడుతూ ఉండాలి” అన్నాడు.
“దానికేమి భాగ్యం! అలాగే. అయితే- ఒక షరతు. నాకు పనులు చెబుతూనే ఉండాలి. పనులు చెప్పనప్పుడు… నేను నిన్ను మింగేస్తాను...లేదా అదృశ్యం అయిపోతాను” అంది.

సరే అని మనవాడు-
“ఇల్లు శుభ్రం చేయి
నీళ్లు తోడి పెట్టు
కట్టెలు కొట్టు
పొలం దున్ను
ఎడ్లకు మేత పెట్టు
నాకు అన్నం కలిపి ముద్దలు నోట్లో పెట్టు
నాకు జోల పాడు”
అని విసుగు విరామం లేకుండా పనులు చెబుతూనే ఉన్నాడు. అలుపు సొలుపూ లేకుండా దయ్యం చేస్తూనే ఉంది.

Ads

హమ్మయ్య!
అని మొదటిరోజు రాత్రి హాయిగా పడుకున్నాడు. ఇలా రెండు, మూడు రోజులు గడిచాక మనవాడికి చెప్పడానికి పనులు మిగల్లేదు. దయ్యమేమో పని పని అని మీది మీదికి వస్తోంది. పని చెప్పకపోతే దయ్యం మిగేస్తుందన్న భయం, అదృశ్యం అవుతుందన్న ఆందోళన మొదలయ్యింది. ఊళ్లో ప్రఖ్యాత భూత వైద్యుడిని సంప్రదించాడు. అతడు చెవిలో ఒక రహస్యం చెప్పాడు. ఇంటికి రాగానే దయ్యం పని పని అంటూ మీద పడబోయింది. ఒక పొడుగాటి వెంట్రుకను ఇచ్చి “దీన్ని కర్రలా నిటారుగా చేయి” అన్నాడు. ఎంతకూ ఆ వెంట్రుక కర్రలా అవడం లేదు. ఆ రోజు నుండి ఈరోజు వరకు మళ్లీ ఇంకో పని చెప్పే వరకు మధ్యలో దయ్యం చేతికి ఒక వెంట్రుకను ఇస్తుంటాడు. భూతవైద్యుడు చెవిలో చెప్పిన చిట్కా ఇది!

(తాంత్రిక, క్షుద్ర పూజల్లో అభిచార హోమం అంటే ఇంకొకరిని హింసించాడనికి క్షుద్ర శక్తులను, క్షుద్ర గణాలను ఆవాహన చేసేవి లేదా ఆహ్వానించేవి. రాముడితో యుద్ధానికి తన శక్తి చాలదని రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తు చేయబోయింది నికుంభిలా అభిచార హోమమే. ఆ హోమం పూర్తి అయితే వాడిని గెలవడం రాముడికి కూడా సాధ్యమయ్యేది కాదు. వీటి మీద మరిన్ని వివరాలు కావాల్సినవారు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి నాగార్జున సర్కిల్ చట్నీస్ ఎదురుగా ఉన్న శ్మశానం గోరీల మధ్య నల్లటి దుప్పటి కప్పుకుని ఎవరి కంటా పడకుండా నిరీక్షించగలరు!)

ఇప్పుడు కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏ.ఐ.) దయ్యం అలాగే తయారయ్యేట్లుంది. మన పని బరువు తగ్గించుకోవడానికి యంత్రాలను కనుకున్నాం. ఆ యంత్రాలను కూడా నడిపే ఓపిక లేక యంత్రాలను యంత్రాలే నడుపుకునేలా సాఫ్ట్ వేర్లు తయారు చేసుకున్నాం. చివరికి ఆ సాఫ్ట్ వేర్లను కూడా సాఫ్ట్ వేర్లే రాసి పెట్టే కృత్రిమ మేధ తయారయిన కాలంలో ఉన్నాం.

పాతికేళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణలకు మనం ఉబ్బి తబ్బిబ్బయ్యాము. ఇప్పుడది శ్రుతి మించి మన కొంప ముంచే దశ వచ్చేసరికి కాలిన చేతులతో లోకం ఆకులు వెతుకుతోంది.

కవితలు, పాటలు రాసే చాట్ బోట్లు ఇప్పుడు బొమ్మలు కూడా వేస్తున్నాయి. కాన్సెప్ట్ చెబితే యానిమేషన్ చిత్రాలను, వీడియోలను ఇచ్చే కృత్రిమ మేధ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ వల్ల జరగబోయే అనర్థాల మీద భయాందోళనలు మొదలయ్యాయి.

ప్రపంచ ప్రఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్ దాదాపు వందేళ్ల కిందటే మోడరన్ టైమ్స్ సినిమాలో యంత్రాలు చేయబోయే విధ్వంసం గురించి తమాషాగా చూపించాడు. హోటల్ కు వచ్చిన కస్టమర్లు టేబుల్ ముందు కూర్చోగానే ఒక ప్లేటును యంత్రం ముందుకు తోస్తుంది. అందులో బ్రెడ్డు ముక్క, కేక్, ఇతర ఆహార పదార్థాలు ఉంటాయి. యంత్రమే వాటిని మన నోట్లో పెడుతుంది. తిన్న తరువాత యంత్రమే మన మూతి తుడుస్తుంది. డెమోలో మొదట అంతా బాగుంటుంది. కాస్త వేగం పెంచగానే యంత్రం మన మూతి పళ్లు రాలగొట్టి, మొత్తం కేకును మన మొహానికి పూస్తుంది.

మనిషి యంత్రాల చక్రాల మధ్య ఎలా నలిగిపోతున్నాడో! బోల్టులో బోల్టుగా ఎలా మారిపోయాడో! మెదడు కోల్పోయి ఎలా యాంత్రికంగా తయారయ్యాడో! ఆనాడే మూగ బాసలతో చెప్పిన చార్లీ చాప్లిన్ భవిష్య దృష్టికోణం అనన్యసామాన్యం.

తాజాగా కొరియాలో ఒక రోబో సెన్సార్ సరిగ్గా పనిచేయక అట్టపెట్టెను కన్వేయర్ బెల్ట్ మీద పెట్టాల్సిన చోట…పక్కనున్న కార్మికుడిని అట్టపెట్టెగా అనుకుని…అతడిని ఎత్తి కన్వేయర్ బెల్ట్ మీద కుదేసి…లేవకుండా నొక్కి పట్టుకుంది. అతడి ఎముకలు విరిగాయి. మొహం నుజ్జు నుజ్జు అయ్యింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు కన్ను మూశాడు. ఇంతకుముందు కూడా కొరియాలో ఇలాంటి రోబో ప్రమాదాల్లో చాలా మంది కార్మికులు చనిపోయారు.

సృష్టికి ప్రతి సృష్టి ఎప్పటికయినా వినాశ హేతువే. ఇన్నాళ్లూ మనిషి మెదడు, మనసు, ఆలోచనలు, సృజనాత్మకతకు ప్రత్యామ్న్యాయం లేదు; రాలేదు; రాబోదు అనుకున్నాం. ఇప్పుడు ఉంది; వచ్చింది; వెర్రి వేయితలలతో కృత్రిమ మేధ ఇంకా ఇంకా విస్తరిస్తుంది.

కల్పిత కథలో దయ్యానికి భూత వైద్యుడి చిట్కా అయినా పని చేసింది. ఈ కృత్రిమ మేధ నిజం కథలో దయ్యానికి ఏ చిట్కాలూ పని చేయవు- మనకు మనం అర్పణ కావడం తప్ప!    – పమిడికాల్వ మధుసూదన్     9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions