.
Mohammed Rafee
……. అదృష్ట మరణం! ప్రివ్యూ చూస్తూ దర్శకుడు ఎస్.రాంబాబు కనుమూత
మరణాలలోనూ అదృష్టం వుంటుందా అని ఆశ్చర్యం కలిగించినా అది నిజం! విహారయాత్రకు వెళ్లి కారుతో సజీవ దహనం, హెలికాప్టర్ కూలి ముక్కలు ముక్కలు అయిపోవడం ఇలాంటి మరణాలు దురదృష్టకర మరణాలు!
Ads
యాక్సిడెంట్ కు గురై ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ ఇబ్బందులు పడటం ఎంత కష్టం! ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లో నిద్రలోనే సునాయాసంగా కనుమూయడం ఎంత అదృష్టం! శరీరాన్ని కష్టపెట్టకుండా, శస్త్ర చికిత్సలతో నరక యాతన పడకుండా అందరితో మాట్లాడుతూ హాయిగా ఈ లోకాన్ని వదలడానికి ఎంతో అదృష్టం ఉండాలి!
ఎస్.రాంబాబు రాత్రి అదృష్ట మరణం పొందారు! ఒక కళాకారుడు ఆ వేదికపై కనుమూయడం వెనుక ఎంతో అదృష్టం ఉండాలి! పూర్వ జన్మ సుకృతం కలిగి ఉండాలి! ఒక కళాకారుడు రవీంద్రభారతి వేదికపై నాటకం ప్రదర్శిస్తూ కళ్లెదుట చనిపోయారు కొన్నేళ్ల క్రితం! అది ఆ కళాకారుడు చేసుకున్న అదృష్టం!
రాంబాబు గారు సినిమా మనిషి! సినిమానే లోకం! ఎప్పటికైనా సినిమా తీసి చూపించాలనే పట్టుదల! బ్రహ్మాండంగా తీశారు మొత్తానికి! ఆ సినిమా పేరు బ్రహ్మాండ! పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకుని సెన్సార్ కానిచ్చుకుని విడుదలకు సిద్ధం చేశారు! ఆయన దర్శకత్వంలో తొలి సినిమా బ్రహ్మాండ! రాత్రి ప్రివ్యూ షో చూస్తూ థియేటర్ లోనే చనిపోయారు!
ఆ సినిమా అద్భుతంగా వచ్చిందనే ఆనందమో తెలియదు! ఇంకాస్త మెరుగులు దిద్దుకుని ఉంటే బావుంటుందని అనుకుంటూ ఒత్తిడికి గురయ్యాడో తెలియదు. శివైక్యం చెందారు! తెలంగాణ బిడ్డగా సినిమా తీయాలనే తన కలను నిజం చేసుకుని తృప్తిగా వెళ్ళిపోయాడు! మిత్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు!
ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు తన స్వగ్రామం అల్లీపూర్ లో అంత్యక్రియలు! ఆయనకు రెండు పేర్లు ఉన్నాయి! నగేష్ అని పిలుస్తారు! సినిమా రంగంలో ఎస్.రాంబాబు అంటారు! తొలి సినిమా తీసి విడుదల చేయకుండానే ఆ విజయోత్సవం చూడకుండానే సునాయాసంగా చనిపోయిన రాంబాబుకు అశ్రు నివాళి. – డా. మహ్మద్ రఫీ
Share this Article