సాబుదాన.. సాబుదాన్లు.. సాబుదాన్ బియ్యం.
మాకిది ఉపాహారమూ, ప్రత్యేక వంటకమూ కాదు.
వీటితోటి పాయసాలూ, నైవేద్యాలూ ఏవీవుండవు.
Ads
జొన్నలు, రాగులు, సజ్జలు, చెల్కలదొరికె గడ్డలలెక్క
ఆరోగ్యం కోసం కాచుకునుటానికి ఇదీ ఓ జావ మాత్రమే !
అప్పటిదప్పుడు కోమట్ల ఇంటికివోయి చెటాకు సాబుదాన తెచ్చి
నానబోసి, పాలువోసి చెక్కరేసి మెత్తగ ఉడుకవెట్టి జావజేద్దురు.
కని, కడుపుల ఇంత ఆసరవడితె పానానికి జెప్పన సత్తువస్తది.
కండ్లుమూసుకోని గిలాసెడంత గటగటదాగు అని బల్మిజేద్దురు.
ఇంకోదిక్కు పిలగండ్లు ఆ జావకోసం ఆశగ చూసుడు మామూలే.
ఇంత కటోరలవోసి చెంచావేసి చేతికిస్తే ఓ గంటసేపు సాగదీద్దురు !
అంతేగని, వీటితోటి పాశపుబువ్వలు, గారెలు, ఉప్పుడువింఢ్లు,
అప్పడాలు,సాయిబాబకు నైవేద్యాలు, నూలుచీరెలకు గంజినీళ్లు
ఒక ఇరువయి ఏండ్లకిందటి వరకూ ఇవన్నీ ఎవ్వి లేనేలెవ్వు మరి.
ఊరన్నకాడ ఒకటిరెండు దుకాండ్లలాల తప్ప ఇవి దొరికేవే కావు.
ఇప్పటిలెక్క కిలోలకొద్ది పోట్లాలు తెచ్చి వాడుకునుడు ఎక్కడిది.
జెరమచ్చినప్పుడు తెచ్చినై మిగులుతె, మల్ల జెరమస్తెనే తీసుడు.
ఇప్పటోళ్లకు ఇదంతా ఓ గమ్మతుముచ్చట. కని ఇది ఒకనాటి కథ !
ఇది.. మన తిండి – మన ఆహారచరిత్ర…. ~ డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి… (ఫోటో :: రాత్రి పలుచగ జావగాస్తే ఒడువలే, పొద్దటికి పాశం లెక్క గిట్ల గట్టిగైంది) —
Share this Article