ముందుగా సీనియర్ జర్నలిస్ట్ Nancharaiah Merugumala.. రాసిన ఓ పోస్టు చదవండి… ‘‘ప్రసిద్ధ రచయిత దివంగత కొడవటిగంటి కుటుంబరావు భార్య వరూధిని గారు 97 సంవత్సరాల వయసులో మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆమె భర్త కుటుంబరావు గారు 1980లో 71 ఏళ్లు నిండే సమయానికి మరణించారు. ఆమె కొడుకు, ప్రముఖ రచయిత రోహిణీ ప్రసాద్ 2012లో, కూతురు, రచయిత్రి శాంతసుందరి 2020 నవంబర్‌లో చనిపోయారు. కొడుకూకూతుళ్లు ఇద్దరూ 70 ఏళ్లు నిండాకే కన్నుమూశారు.
మొన్న ‘ఈనాడు’లో వచ్చిన ఈ వార్త చదివాక రాజకీయ దురంధరుడు, గొప్ప భారతీయుడు చక్రవర్తి రాజగోపాలాచారి ఉరఫ్ రాజాజీ (1878–1972) 50 ఏళ్ల క్రితం అన్న మాటలు గుర్తుకొచ్చాయి.1972 డిసెంబర్‌లో 94 సంవత్సరాల వయసులో కన్నుమూయడానికి ఏడాది ముందు, రాజాజీని, ‘మీరు 90 ఏళ్లు దాటిన సంపూర్జ జీవితం ఇంకా గడుపుతున్నారు. ఇంత కాలం జీవించి ఉండడం మీకు చాలా ఆనందంగా ఉంది కదా?’ అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు కాస్త భయం భయంగా.
‘నిజమే, తొమ్మిది దశాబ్దాలు దాటి బతకడం సంతోషంగానే ఉంది. కాని, ఈ ఆనందంతోపాటు అనేక విషాదాలు కూడా నా జీవితంలో భాగమయ్యాయి. నాకంటే ఎంతో చిన్నవాళ్లయిన కడుపున పుట్టిన పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు చనిపోవడం ఈ కళ్లతో చూడాల్సి వచ్చింది. అన్నిటికీ మించిన విషాదం నా భార్య అలిమేలు మంగాలమ్మ 40 ఏళ్లు నిండకుండానే ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చి 1916లో కన్నుమూసింది. ఇలా 90 సంవత్సరాలు దాటి బతకడం వల్ల నాకంటే కొన్ని దశాబ్దాలు వెనుక పుట్టిన అయినవాళ్ల చావులు అనేకం చూడాల్సివచ్చింది,’ అని రాజగోపాలాచారి జవాబిచ్చారు.
Ads
రాజాజీ మాటలు గొప్ప వాస్తవాన్ని వెల్లడించాయి. 85–90 ఏళ్లు దాటి బతికితే, ఎవరైనా వారు తమ కుటుంబసభ్యుల్లో పలువురి మరణాలు చూడక తప్పదు మరి.ఈనాడు హైదరాబాద్ నగర పేజీల్లో వచ్చే చావు ప్రకటనలు (అబిచ్యువరి యాడ్స్) చూస్తుంటే– వాటిలో కన్నుమూసినవారి ఫోటోల కింద–మరణించిన 80–90 సంవత్సరాలు దాటిన వృద్ధురాళ్లు లేదా వృద్ధుల సంతానం పేర్లు కొన్నింటికి ముందు కీర్తిశేషులు అని రాసి ఉండడం కనిపిస్తుంది…’’
Share this Article