ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు… ఇదీ విషాదం… నిజానికి అది ప్రమాదం కాదు, ఖచ్చితంగా రెండు రాష్ట్రాల జెన్‌కో అధికారులు చేసిన హత్యలే…. ఆశ్చర్యంగా ఉందా..? మొత్తం చదివాక మీరే అంగీకరిస్తారు… ముందుగా ఈ వార్తను కాస్త ప్రామినెంట్‌గా కవర్ చేసిన ఆంధ్రజ్యోతికి అభినందనలు, అదేసమయంలో ఉపనయనమే ఉసురు తీసిందనే తిక్క హెడింగ్ పట్ల అభ్యంతరాలు..! ఉపనయనం ఉసురు తీయడం ఏమిటి..?
ముందుగా ఇన్సిడెంట్ ఏమిటో చూద్దాం… హర్షిత్ అలియాస్ వాచస్పతి ట్రిపుల్ ఐటీ గౌహతిలో చేస్తున్నాడు… 20 ఏళ్లు… ఎప్పుడో ఉపనయనం జరిగి ఉండాల్సింది, ఎందుకో లేటైంది… ఆ క్రతువు కోసం నాగార్జునసాగర్‌లోని పెద్దనాన్న దత్తు ఇంటికి చేరుకున్నారు అందరూ… హైదరాబాద్‌కు చెందిన నాగరాజు కూడా దీనికోసమే సాగర్ వచ్చాడు… సాగర్ ప్రధాన జలవిద్యుత్తు కేంద్రం దిగువన ఓ స్నానవాటికలో మూడు రోజులుగా క్రతువు కొనసాగుతోంది…
గురువారం తెల్లవారుజామున హర్షిత్, నాగరాజు, దత్తు కొడుకు చంద్రకాంత్ స్నానాలు చేస్తున్నారు… ఈలోపు హఠాత్తుగా నీటి వరద వచ్చి ముగ్గురూ కొట్టుకుపోయారు… తల్లిదండ్రులు లబోదిబో మంటూ సాగర్ పోలీసులకు సమాచారం ఇచ్చి, స్థానిక పుట్టి జాలర్ల సహకారంతో గాలించారు… చివరకు రాత్రికి ముగ్గురి మృతదేశాలు స్నానఘాట్‌కు సమీపంలోనే కనిపించాయి… వీరిలో దత్తు కొడుకు చంద్రకాంత్ ఐటీ జాబ్‌తోపాటు పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు… ఇదీ వార్త…
Ads
మరి అధికారులు వైఫల్యం ఏమిటి అంటారా..? ముగ్గురికీ ఒకేసారి మృత్యువు రాసిపెట్టి కాబట్టి అలా కొట్టుకుపోయారు అని ఖర్మసిద్ధాంతం వల్లిస్తున్నారా..? తప్పు… చీకటి, సాగర్ హైడల్ ప్లాంటు నుంచి ఒకేసారి 20 వేల క్యూసెక్కుల వరద ముంచెత్తితే ఇదే కదా జరిగేది… ఈత వచ్చిన వాళ్లు సైతం ఆ ఉధృతికి కొట్టుకుపోతారు… అది చిన్న వరదేమీ కాదు… మరి నీటిని దిగువకు వదిలేటప్పుడు అలారమ్ సిస్టమే లేదా..?
నీళ్లు వదిలినప్పుడు దిగువన ఉన్న కొన్ని కీలక ప్రాంతాల్లో అలారమ్ మోగే ఏర్పాట్లు చేతకాలేదా జెన్‌కో అధికారులకు..? అప్పటికప్పుడు రక్షించడానికి ఆ చీకటివేళ ఎవరూ ఉండరు… ఎవరో కొద్దిమంది ఇలా స్నానాలు చేసేవాళ్లు తప్ప… పైగా చీకట్లో ఎవరూ ఏమీ చేయలేరు… కనీసం నీళ్లు వదులుతున్నామని గుర్తించేలా సాగర్ డ్యామ్‌పైన నాలుగైదుసార్లు లైట్లు వేసి, ఆర్పేసినా సరే, దిగువన ఉన్నవాళ్లు అలర్ట్ అవుతారు… ఏ హెచ్చరిక లేకుండా ప్లాంటులో కరెంటుత్పత్తి కోసం నీళ్లు అన్ని క్యూసెక్కుల నీటిని వదిలేస్తే, అది ఇలాంటి ఉపద్రవాలకే దారితీస్తుంది… ఇప్పుడు చెప్పండి ఇవి హత్యలా..? ప్రమాదమా..? విధి రాతా..?! ఈ ఉసురు తగిలేదెవరికి..?!
Share this Article