అమరన్… ఇది శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా… త్వరలో రాబోతోంది… తాజాగా ఆ సినిమాలో సాయిపల్లవి పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు… అందులో ఎర్రకోట దగ్గర ఆర్మీ పరేడ్, మోడీ ఫీడ్ యథాతథంగా వాడుకున్నట్టున్నారు… తప్పు లేదు…
తన సాహసానికి, తన త్యాగానికి గుర్తుగా మరణానంతరం అశోకచక్ర పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ అది… అందులో మేజర్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రను సాయిపల్లవి పోషిస్తోంది… ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇదొక బయోపిక్ అని వెల్లడించలేదు…
నిజానికి తన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటే తప్ప సాయిపల్లవి కథల్ని వోకే చేయడం లేదు కదా… మరి ఇందులో తన పాత్ర ఏమిటనేది ఓ ఇంట్రస్టింగ్ ప్రశ్న… ఎందుకంటే..? ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ఓ ముఖాముఖి ఎన్‌కౌంటర్‌లో ముకుంద్ వరదరాజన్ తీవ్రంగా గాయపడి, సంఘటన స్థలం నుంచి తరలిస్తున్న దశలోనే ప్రాణాలు వదిలేశాడు…
Ads
ఎన్నాళ్లుగానో ఆర్మీ వేటాడుతున్న ఓ ఉగ్రవాద నేతను ఎలాగైనా మట్టుపెట్టడానికి ముకుంద్ చేసిన పోరాటం, త్యాగం అనుపమానం… ఈ సినిమా కథలోనూ అదే ఆవిష్కరింపబడాలి… అదే అవసరం… మరి సాయిపల్లవి పాత్రకు ఏమిటి ప్రాధాన్యం..? నిజజీవితంలో ముకుంద్ తన చిన్నప్పటి నుంచీ స్నేహితురాలు ఇందుకు పెళ్లి చేసుకుంటాడు… ఓ బిడ్డ…
మరణానంతరం ప్రకటించబడిన అశోకచక్రను తను అందుకుంటుంది… సో, సినిమాలో వాళ్ల ప్రేమ కథను కూడా యాడ్ చేశారేమో… లేక బయోపిక్ నచ్చి, తన పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేకపోయినా అంగీకరించిందేమో… తెలియదు… కానీ సినిమా మీద మాత్రం తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది…
విరాటపర్వం తరువాత ఆమెకు గ్యాప్ వచ్చింది… గ్యాప్ తరువాత అంగీకరించిన చిత్రం ఈ అమరన్… తరువాత హిందీ రామాయణం, తెలుగు తండేల్… ఒక దశలో ఆమె సినిమాల్ని మానేసిందనే వార్తలు కూడా వచ్చాయి… సో, ఈ అమరన్ చిత్రం మీద తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేటైంది…
సాయిపల్లవి పాత్రను పరిచయం చేసే వీడియోలో… తన భర్త ఆర్మీ ఆఫీసర్‌తో సరదాగా కనిపిస్తున్న సాయిపల్లవి తన మరణానంతరం, అశోకచక్ర స్వీకరణ వేళ కూడా గాంభీర్యాన్ని, ఉదాత్తతను కనబరుస్తోంది… సరే, ఆమె నటనకు వంకపెట్టేదేముంటుంది గానీ… దర్శకుడు ముకుంద్ వరదరాజన్ బయోపిక్ కథకు కావల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నట్టుంది చూడబోతే… ఆమె పాత్రకూ ప్రాధాన్యం పెంచడానికి..! హీరో గడ్డం మీసం లుక్కు సహా..!
ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్… ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ అనే పుస్తకం నుంచి ముకుంద్ ఎపిసోడ్‌ను తీసుకున్న దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి… పలుసార్లు ముకుంద్ కుటుంబాన్ని కలిసి ఇతరత్రా వివరాలు కూడా సేకరించి కథకు యాడ్ చేసుకుని, తనదైన శైలిలో కథను రాసుకున్నాడట…!!
ఇందు ఫోటోలు చూస్తుంటే… గతంలో రామోజీరావు అశ్విని, మయూరి సినిమాలకు నిజజీవిత వ్యక్తులనే వాళ్ల బయోపిక్కు సినిమాలకు తీసుకున్న తీరు గుర్తొచ్చింది… ఇందు అంగీకరిస్తుందని కాదు… కానీ వాళ్లు యాదికొచ్చారు..!!
Share this Article