ఎవరో అడిగారు… కార్తీక పౌర్ణమికీ సోమవారానికీ… కార్తీక పౌర్ణమికీ చంద్రదర్శనానికీ… కార్తీక పౌర్ణమికీ తులసిపూజకూ… కార్తీక పౌర్ణమికీ గురుపౌర్ణమికీ… సంబంధం ఏమిటి..? పవిత్రత ఏమిటి..? సార్థకత ఏమిటి..? నిష్కర్షగా నిజం చెప్పాలంటే… పౌర్ణమికీ గురువుకూ సంబంధం లేదు… కార్తీక పౌర్ణమికీ గురుపౌర్ణమికీ సంబంధం లేదు… గురుపౌర్ణమి అనేదే లేదు… అన్నింటికీ మించి… గురువారం అనగానే సాయిబాబా గుళ్లలో విపరీతంగా క్యూలు కనిపిస్తాయి…
అసలు సాయిబాబాకు గురువారానికీ సంబంధం ఏమిటి..? తను గురువెలా అయ్యాడు..? ఎప్పుడయ్యాడు..? ఎవరికి ఏం నేర్పించాడు..? పైగా గురువారం అనేది ఓ గ్రహాన్ని సూచించే వారం పేరు… అంతే తప్ప టీచింగ్ గురువు కోసం ఉద్దేశించిన దినం కాదు… మరి గురువారానికీ సాయిబాబాకూ సంబంధం ఏమిటి..? గురువు అంటే ఓ శ్రీపాద శ్రీవల్లభ వంటి గురువుల్ని స్మరిస్తే ఓ అర్థముంది… అదీ పౌర్ణమి నాడే అక్కర్లేదు, గురువారం అసలే అక్కర్లేదు… కానీ సాయిబాబా-గురువారం సంబంధం పూర్తిగా అర్థరహితం… ఎవరో స్టార్ట్ చేస్తారు, జనం పోలోమంటూ అనుసరిస్తారు…
కార్తీక పౌర్ణమికీ సోమవారానికీ సంబంధం ఏమిటి అని మరో ప్రశ్న… కార్తీకమాసంలో ప్రతి దినమూ విశిష్టమే… కానీ సోమవారాన్ని ఇంకాస్త పవిత్రంగా చూస్తారు… ఒకవేళ కార్తీక పౌర్ణమి సోమవారం వస్తే మరింత భక్తి… అంతేతప్ప వేరే సంబంధం లేదు… కార్తీక పౌర్ణమికీ చంద్రదర్శనానికీ కూడా సంబంధం లేదు… కాకపోతే పౌర్ణమి కాబట్టి, చంద్రుడు నిండుగా ఉంటాడు… వెన్నెల కురుస్తూ ఉంటుంది… ఆ వెన్నెల్లో వెలిగే జలప్రవాహాల్లో ఆ రాత్రివేళ దీపాల్ని వదలడం ఓ ఉత్సవం… ఓ ఆనందం… అంతేతప్ప చంద్రదర్శనం, చంద్రఅర్చనం పదాలకు అర్థం లేదు…
Ads
సేమ్, కార్తీక పౌర్ణమికీ తులసి పూజకూ సంబంధం లేదు… మొన్ననే ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి అని తులసిపూజలు చేశారు కదా… మళ్లీ పౌర్ణమికీ తులసి పూజకూ ఏం సంబంధం..? అసలు క్షీరాబ్ది ద్వాదశే కొత్తగా ఆచరణలోకి వస్తున్న ఓ అర్చన… కొందరు చేస్తుంటారు… సో, కార్తీకపౌర్ణమికీ సోమవారానికీ, గురుపూజకూ, చంద్రదర్శనానికీ, తులసిపూజకూ ఏ సంబంధాలూ లేవు… మరేం చేయాలి..?
నిజానికి దీపావళి తరువాత కార్తీక పౌర్ణమి దాకా ప్రతిరోజూ దీపాలు వెలిగిస్తారు… ప్రధాన ద్వారాలకు ఇరుపక్కలా ఈ దీపాలు పెట్టే గూళ్లు ఇప్పటికీ పల్లెల్లో కనిపిస్తాయి… కార్తీక పౌర్ణమి కూడా దీపాల పండుగ… ఇష్టమున్నవాళ్లు శివుడినీ, విష్ణువును పూజిస్తారు వాళ్ల నమ్మకాల్ని బట్టి… అంధకారాన్ని రూపమాపి, వెలుగును నింపమని దేవుళ్లను కోరుకునే పండుగ… ఏ అంధకారం, ఎలాంటి వెలుగు వివరించడానికి వందల బాష్యాలు చెప్పుకోవచ్చు…
ఖచ్చితంగా ఉసిరి దీపాలే పెట్టాలని ఏమీ లేదు… కాకపోతే సగానికి కోసిన ఉసిరిని నీళ్లలో వేసి స్నానం చేస్తారు… అది ఆరోగ్యదాయకం… ఆరోజున ఉసిరితో పచ్చడి, ఇతర రెసిపీలు చేస్తారు… అదీ ఆరోగ్యదాయకం… చూడటానికి కూడా అందంగా ఉంటాయి దీపాలు… అవి చేయలేనివాళ్లు పిండితో చిన్న చిన్న ప్రమిదలు చేసి వెలిగిస్తారు…
కొందరు ధ్వజస్తంభాలకు, పెద్ద కర్రలకు దీపాల్ని కట్టి, పైకి ఎగరవేస్తారు… ఆకాశదీపాలు… ఇదీ దేవుడికి ఓ భిన్నమైన అర్చనరూపం… అంతకుమించి విశేషం ఏమీ లేదు… మరి వత్తులు కాల్చడం ఏమిటి..? అదీ కుటుంబసభ్యులు వేర్వేరు సంఖ్యల్లో వత్తుల్ని కాలుస్తారెందుకు..? ఈ ప్రశ్నలకు మళ్లీ ఎప్పుడైనా జవాబులు చెప్పుకుందాం…!!
Share this Article