తన వయస్సుకు తగినట్టు ఏవో విభిన్నమైన పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ వెంకటేష్ అందరి అభిమానాన్ని అలాగే నిలబెట్టుకుంటూ వస్తున్నాడు… దృశ్యం కావచ్చు, నారప్ప కావచ్చు, మరేదైనా కావొచ్చు… రొటీన్ ఫార్ములా పెంట పాత్రలు గాకుండా వైవిధ్యాన్ని ఆశ్రయించాడు… గుడ్… కానీ అదేదో దిక్కుమాలిన వెబ్ సీరీస్‌లో బూతు దరిద్రాన్ని కౌగిలించుకుని తన ఇమేజీ మొత్తం పోగొట్టుకున్నాడు… సరే, ఒక ఎఫ్-2 కూడా కామెడీ డిఫరెంట్ అనుకుందాం… అదే రీతిలో ఎఫ్-3 వచ్చి మరింత అసంతృప్తి మిగిల్చింది తన ఫ్యాన్స్‌కు…
అసలు ఏమైంది వెంకటేష్‌కు..? కాదు, ఏం తక్కువైందని మళ్లీ ఈ మసాలా రొటీన్ వాసనల వెంట ఉరుకు, పరుగు..? (కాకపోతే ఒకటి సంతోషం… నా ఫ్యాన్స్ నా నుంచి ఎలివేషన్సే కోరుకుంటున్నారు అనే ఓ పిచ్చి సమర్థన జోలికి పోలేదు…) ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ అంటూ జానర్ మార్చేసి ‘సైంధవ్’ అని సంక్రాంతి బరిలోకి వచ్చాడు… దర్శకుడి పేరు శైలేష్ కొలను… సైకో… హీరో పాత్ర పేరు సైంధవ్ కోనేరు… సైకో… సినిమా సైతం అలాగే కాస్త భయపెడుతూ, కాస్త నిరాశపరుస్తూ ఫాఫం వెంకటేష్ అనిపిస్తుంది…
ఈ సినిమాలో వెంకటేష్ ఎంచుకున్న కథ స్థూలంగా వోకే… స్పైనల్ మాస్క్యూలర్ ఎంట్రోపీ అనే ఓ అరుదైన వ్యాధి నుంచి బిడ్డను కాపాడుకోవాలంటే 17 కోట్ల విలువైన ఇంజక్షన్ కావాలి… (ఈమధ్య చాలా వార్తలు చదివాం కదా ఇలాంటి వార్తలు..? క్రౌడ్ ఫండింగ్ ద్వారా కలెక్ట్ చేస్తుంటారు నిధులు…) ఆ డబ్బు కోసం, బిడ్డ ప్రాణాల కోసం హీరో పడే తపనే సినిమా కథ… కానీ సినిమా ఎత్తుకోవడం దగ్గర్నుంచి, కథ నడపడం, కథ ముగించడం దాకా దర్శకుడు ఎక్కడెక్కడికో వెళ్లిపోయాడు… క్రిస్ప్‌గా లేక, కథనం రక్తికట్టించలేక దర్శకుడు నిరాశపరిచాడు…
Ads
కాకపోతే ఆ 17 కోట్ల ఇంజక్షన్ కోసం ప్రయత్నించే క్రమంలో తన బ్యాక్ గ్రౌండ్ బయటికి వస్తుంది… అసలు తన పేరు వెంటనే కార్టెల్ మనుషులు ఎందుకు వణికిపోతుంటారు..? చివరకు ఏమవుతుంది అనేదే కథ… (ఇంద్రప్రస్థ అనే ప్రాంతంలో యువతకు శిక్షణ ఇచ్చి వాళ్ళను ఆయుధాలతో సహా వివిధ గ్రూపులకు సరఫరా చేసే కాంట్రాక్టు తీసుకుంటారు ఒక గ్యాంగ్… ఈ గ్యాంగ్ విదేశాల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు… డ్రగ్స్, ఫేక్ కరెన్సీ తెప్పిస్తారు. ఇందులో ముకేశ్ రుషితో పాటు నవాజుద్దీన్ సిద్దిఖీ, జిష్ణు సేన్ గుప్తాలు ఉంటారు… వెంకీ కూడా గతంలో ఇదే టీం… ఇదీ క్లారిటీ…)
సరే, సైంధవ్ కోనేరు అనే ఓ సైకో పాత్రలో వెంకటేష్ మ్యాగ్జిమం ఎఫర్ట్ పెట్టాడు… అంత సీనియర్ నటుడు, తనకు వంక పెట్టడానికి ఏముంటుంది… కాకపోతే బలహీనమైన కథాకథనాలు, పాత్రల చిత్రీకరణల కారణంగా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ సహా ఆండ్రియా జెరెమియా, రుహానీ శర్మ కూడా నామ్‌కేవాస్తే… చివరకు అంతటి నవాజుద్దీన్ పాత్ర కూడా బలం లేకుండా మారింది.,.
యాక్షన్ సీన్లు బాగానే వచ్చినా… ఎమోషనల్ సన్నివేశాలు తేలిపోయాయి… విలన్స్ హీరో నడుమ బలమైన కాన్‌ఫ్లిక్ట్ కనిపించలేదు… పాత్రల చిత్రణ సరిగ్గా లేకపోవడమే అసలు లోపం… దర్శకుడికి మెరిట్ ఉంది… టేకింగ్ బాగానే ఉంటుంది… ఎటొచ్చీ ఈ సినిమాకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఫెయిల్యూర్ కనిపించింది… అన్నింటికీ మించి ఇలాంటి సినిమాలకు పాటలకన్నా బీజీఎం బాగుండాలి, అదే సీన్లు పైకి లేపేది… ఈ సినిమాలో అదీ నిరాశాపూరితమే… సో, సారీ వెంకటేష్… బెటర్ లక్ నెక్స్ట్ టైమ్… కానీ ఈ జానర్‌లో మాత్రం కాదు..!!
సంక్రాంతి బరిలో హనుమాన్ కాసుల ప్రస్థానంలో ఆల్‌రెడీ గుంటూరుకారం చప్పబడిపోయింది… ఇప్పుడు ఈ సైంధవుడూ అడ్డుతొలగినట్టే… ఇద్దరు టాప్ స్టార్లు ఎలిమినేటెడ్… ఇక మిగిలింది నాసామిరంగ… అదీ అయిపోతే హను-మాన్‌కు ఇక చూసుకో నాసామిరంగా… థియేటర్లన్నీ హనుమంతుడివే..! కథలో నీతి ఏమిటయ్యా అంటే… బుడ్డ హీరోయా, పెద్ద హీరోయా అనేది కాదు, సినిమా సక్సెస్‌కు కథలో దమ్ముండాలి, ప్రజెంటేషన్‌లో కొత్తదనముండాలి…!!
Share this Article