సాయిపల్లవిని చాలా విషయాల్లో మెచ్చుకున్నాం… కుంటాం కూడా… ఆ బురద ఇండస్ట్రీలో ఆమె ఓ డిఫరెంట్ కేరక్టర్… ఆ బురద లక్షణాలేమిటనేది పక్కన పెడదాం… ఒకప్పుడు అలాగా బతుకు బతికిన నటులకు మంచి చాన్సులు దొరికితే, అనుకోకుండా హిట్టయితే… ఇక ఫ్యాన్స్, అట్టహాసాలు, హంగామాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా…
ఆడలేడీస్ అయితే ఇక రాణివాసపు పోకడలే… సుకుమారంగా పెరిగినట్టు పోకడలు, ఫోజులు… అడుగు తీసి అడుగేస్తే అందం ఎక్కడ కందిపోతుందో అన్నట్టుగా మేకప్పులకు తరచూ టచ్చప్పులు… ఎట్సెట్రా… మేకప్ తీసేస్తే ఏమిటనే ప్రశ్న దయచేసి అడక్కండి… ఇవి చూస్తున్న స్థితిలో సాయిపల్లవి మెంటాలిటీ, స్వయంగా పెట్టుకున్న కొన్ని నైతిక ఆంక్షలు ఆశ్చర్యాన్ని కలిగిస్తయ్… ఆమె పట్ల సదభిప్రాయాన్నీ కలిగిస్తయ్…
అఫ్‌కోర్స్, నటనలో కూడా మేటి, డాన్సులో వీరమేటి… కాకపోతే ఈమధ్య నాలుగైదు సినిమాలు ఎదురుతన్ని డిమాండ్ లేకుండా పోయింది, అది వేరే సంగతి… కొన్నాళ్లు హఠాత్తుగా మాయమైపోయి, ఈమధ్యే ఏదో తమిళ సినిమా ప్రారంభం దగ్గర కనిపించింది… హైదరాబాదులో లేదు, తరచూ మీడియా దగ్గరకు రాదు, దాంతో సాయిపల్లవిని తెలుగు సినిమా జర్నలిజం కూడా ఇగ్నోర్ చేసింది… పట్టించుకోవడం మానేసింది… బరువు తక్కువ కవర్లయినా వోకే, కానీ కవర్లకే దిక్కులేదు కదా ఇక్కడ…
Ads
ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ వార్తల్లోకి వచ్చింది… ఆంధ్రజ్యోతి వాడైతే మాస్ట్‌మెడ్ పక్కన వేశాడు వార్త… ఆమెకు దక్కుతున్న గౌరవం పట్ల ఇతర చిల్లర పైసల్లాంటి హీరోయిన్లు కుళ్లుకోవాలేమో… విషయం ఏమిటంటే… ఆమె అమరనాథ్ యాత్ర చేసింది… అదీ ఒంటరిగా కాదు… 60 ఏళ్ల వయస్సున్న తల్లిదండ్రులతోపాటు…!
అమరనాథ్ యాత్ర అంటే కేవలం ఆధ్యాత్మికం కాదు… దేవుడి కోసం జరిపే యాత్ర మాత్రమే కాదు… అది మనలోని సంకల్పశక్తికీ, ధైర్యానికీ, ఓర్పుకూ ఓ కఠిన పరీక్ష… అఫ్‌కోర్స్, మన ఆరోగ్యం, దేహసామర్థ్యం కూడా సహకరించాలి… అమరనాథ్ యాత్ర తరువాత మనిషి నడవడిక, జీవనశైలి పాజిటివ్‌గా మారిపోతాయనే ఒక అంచనా ఉంది… ఏసీ కార్లు, స్టార్ హోటళ్ల రేంజ్ దాటకుండా, పాదం కందిపోని సున్నిత జీవనశైలిలో అమరనాథ్ యాత్రకు సాయిపల్లవి సగటు భక్తురాలిగా సిద్ధపడటమే ఓ విశేషం… వృద్ధులైన అమ్మానాన్నలతో వెళ్లడం మరో విశేషం…
రెండు చిన్న వీడియో బిట్లు, రెండుమూడు ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసుకుంది… మధ్యలో సీఆర్పీఎఫ్ జవాన్లు ఆమెను సన్మానించి, ఆమె పట్ల ప్రేమాభిమానాల్ని, గౌరవాన్ని ప్రదర్శించారు… సాధారణంగా వాళ్లు హిందీ యాక్టర్లను ఎక్కువగా లైక్ చేస్తారు… సాయిపల్లవి పెద్దగా హిందీ సినిమాల్లో లేదు కదా, మరి ఈ అభిమానం ఎలా సాధ్యమైంది..? ప్రశ్నార్థకమే…
ఇక్కడ మనం చెప్పుకునేది కూడా ఆమె ఆధ్యాత్మికత గురించి కాదు… ఆమె స్వయంగా సాయిబాబా భక్తురాలు, చేతిలో ఎప్పుడూ జపమాల ఉంటుంది… ఆమె పేరు పెట్టిందే సాయిబాబా… కానీ ఒకసారి ఫేమ్ రాగానే, అదీ ఇండస్ట్రీలోనే హీరోయిన్ అయ్యాక అమరనాథ్ యాత్ర వంటి క్లిష్ట, కష్ట యాత్రలకు నడుం కట్టరు… నడవాలి, వాతావరణ అననుకూలతల్ని ఓర్చుకోవాలి, ఎక్కడపడితే అక్కడ టెంపరరీ గుడారాల్లో ఉండాలి, దొరికిందేదో తినాలి, పైగా పక్కన ముసలి తల్లిదండ్రులు… వాళ్లకు మధ్యలో అనారోగ్యం, ఊపిరాడదు, ఛాతి పట్టుకుని ఆయాసపడిపోయారట… అఫ్‌కోర్స్, చాలామందికి ఈ స్థితి ఎదురవుతుంది… అందుకే సాయిపల్లవి అమరనాథ్ యాత్ర వార్త ఆకర్షించింది ఇలా…
Share this Article