శేఖర్ కమ్ముల తీస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా మీద ప్రేక్షకులకు మంచి హోప్స్ ఉన్నయ్… మంచి రేట్లకు హిందీ రైట్స్, ఓటీటీ రైట్స్, టీవీ రైట్స్ గట్రా ఎప్పుడో బిజినెస్ జరిగింది… ఫాఫం, కరోనా అడ్డంకి రాకపోతే గత ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాలి… ఎట్ లాస్ట్, పూర్తయి, థియేటర్ రిలీజ్‌కే రెడీ అవుతున్నట్టుగా ఉంది… తన కెరీర్లో ఈరోజుకూ కిందామీదా పాడుతున్న నాగచైతన్యకు దీని మీద బాగా నమ్మకాలున్నయ్… అఫ్ కోర్స్, శేఖర్ బేకార్ సినిమా ఏమీ తీయడు అనే నమ్మకం ప్రేక్షకుల్లోనూ ఉంది… కానీ తన టీజర్ చూస్తే అందరికీ ఒక్కసారిగా ఉసూరుమంది… అయితే టీజర్లు సినిమాలోని సరుకును శాంపిల్‌గా చూపించలేకపోవచ్చు గానీ… ప్రొమోయే ఇలా ఉందంటే అసలు సరుకు ఎలా ఉందనే అపనమ్మకం అయితే కలుగుతుంది…
సాయిపల్లవి ఫోజు భలే భలే ఉంది… సూ- ప- ర్… ఆమె ఎనర్జీ, డాన్స్, యాక్షన్ గురించి పదే పదే చెప్పుకోవడం అనవసరం గానీ… ఇద్దరూ ఒక ఊరి నుంచి సిటీకి కొలువుల అవకాశాల కోసం వస్తారు… ప్రేమలో పడతారు… బాగానే ఉంది… కానీ ఊళ్లో వీథుల నుంచి భయపడుతూ, వెనక్కి వెనక్కి చూస్తూ పారిపోతున్న సీన్ మాత్రం ఎందుకో కాస్త విచిత్రం అనిపించింది… ఇంత కమ్యూనికేషన్ ప్రబలిన కాలంలో కూడా… ఆ పాత సినిమాల్లోలాగే… ప్రేమికులు పరుగెత్తుకొచ్చి రైలు వెనుక గార్డ్ పెట్టె ఎక్కి తేలికగా ఊపిరి పీల్చుకోవడం… రోడ్డు మీదకు వచ్చి ఏదో లారీ డ్రైవర్‌ను బతిమిలాడి రహస్యంగా సిటీ చేరుకోవడం వంటి సీన్లు ఉంటాయా కొంపదీసి..? సరే, ఊహాగానాలు దేనికిలే గానీ…
Ads
ఈ సినిమాలో నటిస్తున్న తారాగణం చూస్తుంటే మౌస్ ఒక్కసారిగా దేవయాని అనే పేరు దగ్గర ఆగిపోతుంది… గుర్తుందా..? ప్రేమలేఖ అనే ఓ పాతికేళ్లనాటి సినిమా… అజిత్, దేవయాని… రైలులో మరిచిపోయిన ఓ బ్యాగ్ ఓ ప్రేమకథను రచిస్తుంది… అప్పట్లో హిట్… దేవయానికి మంచి గుర్తింపు వచ్చింది… ఎరుపు లోలాకు కులికెను కులికెను, ముక్కుపుల్లాకు మెరిసెను మెరిసెను….. ప్రియా నిను చూడలేక, ఊహలో నీరూపు రాక… పట్టూపట్టు పరువాల పట్టు… చిన్నదాన, ఓసి చిన్నదాన ఆశపెట్టి పోమాకే కుర్రదానా… దిగులు పడకురా సహోదరా… తమిళం నుంచి తెలుగులోకి బలవంతంగా అనువదించినట్టు గాకుండా… తెలుగు ఒరిజినల్ గీతాల్లాగా భలే ఉంటాయి… కానీ ఆ సినిమాతో వచ్చిన గుర్తింపు ఆమెకు తెలుగులో పెద్దగా ఫలించలేదు…
ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకోవడం అంటే..? లవ్ స్టోరీ కథలో సాయిపల్లవి, నాగచైతన్య ప్రేమకథలాగే దేవయానిది కూడా నిజజీవితంలో లవ్ స్టోరీయే… సేమ్, ఈ టీజర్లో చూసినట్టే… రహస్యంగా, ఓ ప్లాన్ ప్రకారం పారిపోయి పెళ్లి చేసుకున్నారు దేవయాని దంపతులు… ఎంత ప్లాన్ అంటే, పెళ్లివేదిక దగ్గరకు చేరేసరికి కూడా దేవయానికి ఎక్కడికి పోతున్నామో తెలియనంత..!
నిజానికి దేవయాని ముంబైలో పుట్టింది… తరువాత ఆమెకు కోలీవుడ్ అవకాశాలు, ఇద్దరు సోదరులకు అవకాశాల రీత్యా చెన్నైలో ఉండేవాళ్లు… వినుక్కుం మన్నుక్కం, సూర్యవంశం అనే సినిమాలలో దేవయాని చేస్తున్నప్పుడు రాజకుమరన్ అనే ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌తో పరిచయం… స్నేహం… తన రెండు సినిమాలలో ఆమె హీరోయిన్… మెల్లిమెల్లిగా ఆమెను ఏం చెప్పి పడేశాడో తెలుసా..? పదేళ్ల క్రితం నాటి నీ ఫోటో అనుకోకుండా చూశాను, దాంతోనే ఫస్ట్ లవ్‌లో పడిపోయాను అన్నాడు… క్రమేపీ స్నేహం ప్రేమగా మారింది… తను డైరెక్టర్ అయ్యాడు… పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి వాళ్లూవీళ్లూ ఒప్పుకోలేదు… చెన్నై వెడ్స్ ముంబై కదా… 2001లో… ఇక లాభం లేదు అనుకుని ఇద్దరూ ప్లాన్ చేసుకుని, రహస్యంగా పెళ్లిచేసుకుందాం అని తేల్చేసుకుని, పెద్దలకు మస్కా కొట్టి పారిపోయారు… రెండువైపులా పెద్దలు వెళ్లి తిరుపతిలో వెతుకుతుంటే… వీళ్లు తిరుత్తణి వెళ్లి, అక్కడ హడావుడిగా పెళ్లిచేసుకుని, కొన్నాళ్లకు చెన్నై వచ్చారు… లవ్ స్టోరీ టీజర్లో చైతూ, సాయిపల్లవి ఊరి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్తున్న సీన్ చూస్తే… అదే సినిమాలో నటిస్తున్న దేవయాని రియల్ లవ్ స్టోరీ గుర్తుకువచ్చింది… అదీ సంగతి… ఓసోసో, నాగచైతన్యది కూడా నిజజీవితంలో లవ్ స్టోరీయే కదా అంటారా..? అది పారిపోయి రహస్యంగా పెళ్లిచేసుకున్న బాపతు కాదు కదా…!!
Share this Article