.
పార్టీ పత్రికలు… అంటే ఇప్పుడు పార్టీ రహిత పత్రికలు అంటూ ఏమీ లేవు కానీ… కనీసం న్యూట్రల్ అనే ముసుగు కూడా లేని పత్రికలు… నమస్తే తెలంగాణ కావచ్చు, సాక్షి కావచ్చు… చివరకు సొంత పార్టీ జనం కూడా విరక్తిగా నవ్వుకునే రోజులు ఇవి…
ఉదాహరణ ఏమిటంటే..,? మొన్నటి కావేరీ బస్సు ప్రమాదం ఫాలోఅప్… సరే, ఆ ఓనర్లు సాక్షికి పడని తెలుగుదేశం బాపతు కావచ్చు, వ్యతిరేక కులం కావచ్చు… దాన్నలా వదిలేస్తే…
Ads
ఈరోజు, నిన్న సాక్షి స్టోరీలు గమనించారా..? వాడెవడో మందుగాడు ఏదో బెల్టు షాపులో మందు తాగాడు, వాడు డివైడర్‌ను గుద్దుకున్నాడు, ఆ మోటార్ సైకిల్‌ను బస్సు డ్రైవర్ గమనించాడో, గమనించీ అలాగే స్పీడ్ కంటిన్యూ చేశాడో గానీ, దాన్ని ఈడ్చుకెళ్తుంటే నిప్పు రవ్వలు ఎగిసి, ఇంధనం అంటుకుని, అలాగే లగేజీలో ఉన్న మొబైల్స్ పేలి, చాలామంది సజీవ దహనం అయ్యారు…. ఇదే కదా బహుళ ప్రచారంలోకి వచ్చిన వార్తాకథనాలు…
కానీ సాక్షి ఎంతసేపూ బెల్టు షాపులో వాడు మందు తాగడమే ఈ ప్రమాదానికి అసలు కారణం అన్నట్టుగా… పిచ్చి కథనాలను రాస్తోంది… మందు తాగడం కాదు, బెల్టు షాపులో మందు తాగడం… బెల్టు షాపుల్లో మందుకూ, లైసెన్సుడు మందు షాపులో మందుకూ అంత తేడా ఉంటుందా…? అది ప్రమాదాలకు దారితీస్తుందా..?
అది కాదు, సాక్షి వాదన… ఏపీలో బెల్టు షాపులున్నయ్, కూటమికి పాలన చేతకాదు అని ఎస్టాబ్లిష్ చేసే ఓ శుష్క వ్యూహం… డొల్ల ఎత్తుగడ… అసలు మద్యం విషయంలో జగనే పెద్ద దోషి… ఆ నిర్వాకాలు, కేసులు ఎలా ఉన్నా సరే… బెల్టు షాపుల్లేని రాష్ట్రం ఉందా..? అదేమైనా సొంతంగా చీప్ లిక్కర్ తయారు చేసే ఫ్యాక్టరీయా..?
బెల్టు షాపుల్లో అమ్మేది కూడా లైసెన్స్‌డ్ మందే… తాగేవాడు ఎక్కడ తాగినా అదే మందు… కాకపోతే దీన్నే ప్రమాదకారకంగా ఎస్టాబ్లిష్ చేయడానికి సాక్షి పాత్రికేయం విఫల ప్రయత్నం చేస్తోంది… కూటమి ప్రభుత్వం అంతకన్నా మూర్ఖం కదా… నో, నో, అది లైసెన్సుడ్ షాపే, బెల్టు షాపు కాదు అని ఎక్సయిజు శాఖతో కౌంటర్ రిలీజ్ చేయించింది….

మళ్లీ సాక్షిలో మరో ప్రధాన వార్త… కాదు, అది బెల్టు షాపే, కావాలనే బెల్టు ఫుటేజీ మాయం చేశారు, ఆ దుకాణం మూసేశారు అని మరో ఫాలోఅప్… ఎహె, సాక్షి కావాలని రాజకీయం చేస్తోందని ఆంధ్రజ్యోతిలో ఇంకో కౌంటర్… ఏపీలో నిజంగానే దిక్కుమాలిన పాత్రికేయం… బోత్ యెల్లో, యాంటీ యెల్లో…
నిజానికి చర్చకు రావల్సినవి ఏమిటి..? ప్రైవేట్ బస్సుల ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్లు, సీటింగ్ నుంచి బెడ్స్ ఆల్టరేషన్, ఆ కంపెనీ బస్సుల ప్రమాదకర డిజైన్లు, ఏసీ బస్సుల్లో తెరుచుకోని తలుపులు, డ్రైవర్ల పనివేళలు, నిర్లక్ష్యాలు, స్పీడ్… ఇదంతా ఓ పెద్ద మాఫియా… అధికారగణంలో కూడా ఎవరూ శుద్ధపూస కాదు, అందరికీ అన్నీ తెలుసు… ఇలాంటి బోలెడు అంశాలు…
ఓ ప్రమాదం జరగ్గానే అధికారులు శుద్ధపూసల్లాగా (ఏపీ, తెలంగాణ ఎక్కడైనా సరే) తనిఖీలు, దాడులు… ఈ రెండు రోజుల దాడులు, తనిఖీలతో వందల నియమోల్లంఘనలు కనిపించాయట రవాణా శాఖకు… ప్రమాదం జరగ్గానే యాదికి వస్తున్నయా ఇవన్నీ… ఇన్నాళ్లూ ఏం చేస్తున్నట్టు..? అవి కదా చర్చనీయాంశాలు… కనీసం బతికి ఉన్న బాధితులు ఎలా ఉన్నారో కాస్త రాసి తగలడండి…
చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు..? దానికీ రకరకాల సమీకరణాలు ఉంటాయి, అవి కదా సాక్షి ఎక్స్‌పోజ్ చేయాల్సింది… మరీ ఈ బెల్టు షాపు మద్యం అనే ఓ శుష్క, డొల్ల వాదనతో పేజీలు నింపడం ఏమిటి…? పాపం జగన్… తన వైఫల్యాల్లో సాక్షి అతి పెద్దది..!!
Share this Article