.
కేసీయార్‌ను ఏమన్నా సరే…. తన ఆత్మీయుడు, జాన్‌జిగ్రీ దోస్త జగన్ పత్రిక తెగ ఉడుక్కుంటోంది… తన తెలంగాణ వ్యతిరేకతను మరోసారి బలంగా తెరమీదకు తీసుకొచ్చింది… చంద్రబాబును కార్నర్ చేస్తున్నాననే పేరుతో… అడ్డగోలు వాదనకు పూనుకుంది…
(విభజన చివరి దశ వరకూ జగన్ తన తెలంగాణ వ్యతిరేకతను అడుగడుగునా బలంగా ప్రదర్శించిన సంగతి తెలిసిందే… ఆ తరువాత కేసీయార్, జగన్ ఒక్కటిగా కలిసిపోయారు… విభజన, సమైక్యం చెట్టపట్టాలు వేసుకున్నాయి…)
Ads
నిన్న తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు..? ‘‘జగన్‌ను ఇంటికి పిలిచి, పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి, భుజం తట్టి ప్రోత్సహించాడు కేసీయార్… (సీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు ఎట్సెట్రా ప్రాజెక్టులు)… నేను చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమైనప్పుడు ఒత్తిడి తెస్తే, మామీద గౌరవంతో సీమ లిఫ్ట్ పనులు ఆపించాడు చంద్రబాబు… నిజమో కాదో తేల్చడానికి నిజనిర్ధారణ కమిటీ వెళ్లినా ప్రాబ్లం లేదు…’’
(ఇక్కడ మరో పాయింట్ చెప్పుకోవాలి… పదే పదే బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ రాజేయడానికి… చూశారా, చూశారా, చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు… నల్లమలసాగర్ కోసం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు… అసలు తెలంగాణలో చంద్రబాబు పాలనే నడుస్తోంది అంటూ కొత్త పల్లవులు ఎత్తుకుంది కదా… దానికి రేవంత్ రెడ్డి కౌంటర్ అది… గురువు లేదు, శిష్యుడు లేదు… ఎవరి రాజకీయం వాళ్లదే, ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్లవే… లిఫ్టు ఆపేయమని ఒత్తిడి తెచ్చాను, అవసరమైతే వెళ్లి చెక్ చేసుకొండి అని ‘చంద్రబాబు శిష్యుడు- చంద్రబాబు పాలన’ అనే ముద్రలను బద్దలు కొట్టేశాడు…)
ఇందులో అబద్ధం ఏమీ లేదు… రెండు రాష్ట్రాల నడుమ సత్సంబంధాలు ఉంటే తప్ప సాగునీటి వ్యవహారాలు తెగవనే భావనతో చంద్రబాబు కూడా అంగీకరించాడు… అంతే, ఇక ‘‘అయిపోయింది, నాశనం పదారుగంతలు, 5 కోట్ల ఆంధ్రుల హక్కులకు మరణశాసనం… సీమ లిఫ్టు ఆపేయడం ద్వారా పాలమూరు- రంగారెడ్డికి అనుమతులు’’ అంటూ ఏవేవో గాయిగత్తర శోకాల్ని ఫస్ట్ పేజీలో మొత్తుకుంది…

రేవంత్ రెడ్డి ఏమీ దాపరికం ప్రదర్శించలేదు… నేరుగా అసెంబ్లీలోనే అన్నాడు… చంద్రబాబును తిట్టాలనుకుని ఏదేదో రాసుకుంటూ పోయింది సాక్షి…
(ఇదే స్టోరీ మరి తెలంగాణ ఎడిషన్‌లో ఎందుకు రాయలేదు… రాస్తే జగన్ తెలంగాణ వ్యతిరేకత మరోసారి బహిరంగమై పత్రికను ఛీత్కరిస్తారు కాబట్టి… అక్కడో మాట, ఇక్కడో మాట… నిజానికి జగన్, కేసీయార్ దొందూ దొందే… ఇది నమస్తే సాక్షి… నమస్తేను మించిన సాక్షి…)
సాక్షి ఇంకా రాసుకొచ్చిందీ అంటే… పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీ (చెన్నై)లో కేసు వేయించింది టీడీపీ వాళ్లట… మరి కాంగ్రెస్ వాళ్లు వేయించారని హరీష్ రావు అంటాడేమిటి..? ఎవరికి ఏది తోస్తే అది మాట్లాడేయడం, రాసేయడం… నిజానికి ఆ కేసులు వేసిన వాళ్లను ఎంకరేజ్ చేసి, బీఆర్ఎస్ టికెట్ కూడా ఇచ్చి వెన్నుతట్టింది కేసీయార్… మరి అదే కేసీయార్ దోస్త్ జగన్ పత్రిక టీడీపీ మీద అభాండాలు వేస్తున్నదేమిటి..?
వోటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి… పాలమూరు- రంగారెడ్డి పనుల్ని, అదీ రోజుకు 2 టీఎంసీలు తరలించుకుపోయేలా కేసీయార్ పనులు చేస్తున్నా అపెక్స్ మీటింగులో చంద్రబాబు కిక్కుమనలేదట… ‘‘నువ్వు కిక్కుమనకు, అలాగైతేనే నీమీద వోటుకునోటు కేసు విషయంలో సైలెంటుగా ఉంటాను’’ అని చంద్రబాబుకు కేసీయార్ హామీ ఇచ్చాడా ఏమిటి కొంపదీసి..? అసలు పాలమూరు- రంగారెడ్డికీ వోటుకునోటు కేసుకూ లింకేమిటి..? మోకాలికీ బోడిగుండుకూ లంకె పెట్టినట్టుంది..!!

పాలమూరు- రంగారెడ్డి డీపీఆర్‌పై కేంద్ర వైఎస్సార్సీపీ అభిప్రాయం అడిగితే… 2022లో ‘‘నో, నో, దానికి నీటి లభ్యతే లేదు, అనుమతి ఇవ్వొద్దు, ఏపీ హక్కులకు భంగకరం’’ అని వైఎస్సార్సీపి చెప్పిందట, దాంతో కేంద్రం దాన్ని వెనక్కి పంపించిందట… (మరి రేవంత్ రెడ్డికి చేతగాక కేంద్రం వాపస్ పంపించిందని హరీష్ రావు పదే పదే ఆరోపిస్తున్నాడు, అదేమిటి..?)
మరి కేసీయార్ నీ పట్ల అంత సానుకూలంగా ఉండి, నీతో కలిసి ఓ మెగాకాళేశ్వరాన్ని దుమ్మూగూడెం నుంచి కట్టాలనీ, ఇద్దరమూ బాగుపడదామని చెప్పినా సరే… అంత స్నేహం నటిస్తూనే పాలమూరు- రంగారెడ్డికి ద్రోహం తలపెట్టావా అయితే..? మరోసారి జగన్ తన తెలంగాణ వ్యతిరేకతను బలంగా చాటుకున్నాడని సాక్షి స్వయంగా వెల్లడిస్తోందా..?
సీమ లిఫ్టు... 2. పోతిరెడ్డిపాడు విస్తరణ 3. పాలమూరు-రంగారెడ్డికి మోకాలడ్డు... అన్నీ అంతే...

2029 నాటికి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సింహభాగం పనులు పూర్తి చేసిందట… 60 – 70 వేల కోట్ల ప్రాజెక్టులో 25 వేల కోట్ల ఖర్చుతోనే సింహభాగం పనులు పూర్తయ్యాయా..? దీన్నే క్షుద్ర సమర్థన అంటారు… ఆ మొత్తం కథనంలో ఇలాంటివెన్నో అబద్ధపు వాదనలున్నాయి… (ఇక్కడ హరీష్ రావు వివరణల్లాగే)…
ఇక సాక్షి నెత్తికెత్తుకున్న (జగన్ మాటే) ఈ తెలంగాణ పక్కా వ్యతిరేక వాదనకు 11 మంది వైసీపీ అంతేవాసుల మద్దతు ప్రకటనలు, అభిప్రాయాలతో ఓ ఫుల్ పేజీ కక్కేసింది సాక్షి… దీనికి ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటనలు ఇస్తూ, ప్రోత్సహిస్తోంది…
సర్, సాక్షి గారూ... ఈ మొత్తం కథనాన్ని హైదరాబాద్, తెలంగాణ ఎడిషన్లలోనూ ప్రచురించవా ప్లీజ్..!! ఈ పత్రిక తెలంగాణకు ఎంత వ్యతిరేకమో తెలంగాణ పాఠకులకు కూడా ఓ క్లారిటీ వస్తుంది..!! నువ్వు రాసింది నిజమే అయితే తెలంగాణ ప్రజలకు చెప్పడానికి వెనుకంజ దేనికి..?!
Share this Article