.
నిన్న సాక్షి ఏపీ ఎడిషన్ తిరగేస్తుంటే… అయిదో పేజీ కావచ్చు, దిగువన ఓ మూలకు, చిన్నగా ఓ కాలమ్‌న్నర ఐటమ్ కనిపించింది… అదేమిటీ అంటే..? చంద్రబాబు కూటమి మేనిఫెస్టోలో అనేకానేక అలవిమాలిన హామీలు ఇచ్చింది కదా, అందులో ఒకటి ఆడబిడ్డ నిధి…
18 సంవత్సరాలు నిండితే చాలు, ప్రతి మహిళకూ నెలకు 1500 ఇస్తామనేది ఆ హామీ… విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం, మంగళపాలెంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ హామీ అమలు కావాలంటే ఆంధ్రాను అమ్ముకోవల్సిందే అన్నాడు…
Ads
సర్కారు ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలు, పింఛన్లకే ఖర్చయిపోతుంటే, చంద్రబాబు హామీలు నెరవేర్చడం అసాధ్యమని తాము ముందు నుంచీ అనుకుంటున్నదేనని చెప్పుకొచ్చాడు… అచ్చెన్న కొన్నిసార్లు ఫ్లోలో నిజాలన్నీ కక్కేస్తాడు, దాచుకోడు…
ఇదీ నిజమే… సదరు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీల్లో నిజంగా, నిజాయితీగా అమలైంది ఏది..? ఏమీ లేదు… పైగా కత్తెర్లు… ఉదాహరణకు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కేవలం జిల్లా పరిధిలోనేనట… సపోజ్, జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజలు తమ పక్కనే ఉన్న ఇతర జిల్లాల ఊళ్లకు ఉచితంగా వెళ్లలేరు… మరెందుకీ ఈ పథకం అంటారా..? అదే చంద్రబాబు మాయ..!!
ఏదో పేజీలో చిన్నగా, కనీకనిపించకుండా ఉన్న సాక్షి వార్త చదివాక… సాక్షి వ్యవస్థ మీద జాలి, సానుభూతి రెట్టింపయ్యాయి… ఆ వార్త ఇంపార్టెన్స్ ఏమిటో కూడా గమనించకుండా, అర్థం చేసుకోకుండా, నిన్ననే బొంబాట్ చేయకుండా వదిలేసిన తీరు నిజంగా ఫాఫం అనాల్సిందే…
దాన్ని మరీ అలా చిన్నగా పబ్లిష్ చేయడానికి బాధ్యులెవరైనా సరే, క్షమార్హులు కారు సాక్షి నిజకోణంలో… కంట్రిబ్యూర్ నుంచి బ్యూరో, బ్యూరో నుంచి జిల్లా డెస్క్, ఆ డెస్క్ నుంచి సెంట్రల్ డెస్క్… ఎవరికీ ఇది తమకు బాగా ఉపయోగపడే బాంబు అనే సోయి లేదా..?
ఎవరు తిట్టారో లేక వెక్కిరించారో గానీ… హఠాత్తుగా కళ్లు తెరుచుకుని, నాలుక కర్చుకుని… ఈరోజు ఫస్ట్ పేజీల్లో బొంబాట్ చేశారు, రెండు కార్టూన్లతో సహా… కూటమి చేజేతులా అస్త్రాలు ఇస్తున్నా సరే వాడుకోలేని దురవస్థ… సాక్షి ప్రక్షాళన పట్టని యాజమాన్యం…
ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది… ఏపీ మీడియాకు రీతిరివాజూ ఏమీ లేవు… ఏపీలో పాత్రికేయ ప్రమాణాలు అని ఎవరైనా మాట్లాడితే అది బూతు, నిషిద్ధం… ఇటు సాక్షి, అటు యెల్లో కూటమి… ఎవరూ తక్కువ కాదు… గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకల గురించి మాట్లాడటం కరెక్టు కాదు… కానీ..?
ఎదుటోడిపై బురద జల్లడానికి కూడా కాస్త ప్రొఫెషనాలిటీ, కాస్త నైపుణ్యం, కాస్త ప్రమాణాలు అవసరమేమో… అది ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి చేతనవుతోంది, కానీ సాక్షికి చేతకావడం లేదు… ఉత్త బండకొట్టుడు యవ్వారం… అయిదేళ్ల అధికారంలో ఎక్కడికక్కడ నిద్రాణ స్థితిలోకి జారిపోయి, ఇంకా మేల్కొన్నట్టు లేదు…
నిన్నో మొన్నో చూశాం కదా… మాజీ మంత్రి రోజాను సమర్థించటానికి ఎవరెవరో సినిమా తారలు అప్పుడెప్పుడో వేరే సందర్భంలో ఇచ్చిన ఖండన ప్రకటనల్ని ఇప్పుడు కట్ అండ్ పేస్ట్ చేసి, నవ్వుల పాలైంది సాక్షి… టీవీ, పార్టీ కేడర్ ఎంత బాగా వాడుకోవాలి అసలు ఈ అచ్చెన్నాయుడు మాటల్ని…
అన్నట్టుె… చంద్రబాబు హామీల దగ్గరకు వద్దాం… తనకూ తెలుసు, ఆ హామీలను నిజాయితీగా, సేమ్ స్పిరిట్‌తో అమలు చేయలేనని… కానీ ఎన్నికలు గట్టెక్కడానికి, జనానికి ఏవేవో మాయతెరలు కప్పేసి పబ్బం గడుపుకోవడానికే ఆ హామీలన్నీ అని..! అందుకే పీ4 వంటి దారిమళ్లింపు స్కీమ్స్, డొల్ల ఖజానా వంటి మాటలు… ఇవన్నీ చెబుతూ పోతే ఇక్కడ ఒడవదు, తెగదు, మళ్లీ ఎప్పుడైనా చెప్పుకుందాం…
Share this Article