.
Rochish Mon
….. ‘సాక్షి మార్క్ పేలాపన’… కీ.శే. కోట శ్రీనివాసరావుపై…
—————————–
Ads
తెలుగులో వచ్చిన అత్యంత గొప్ప నటుల్లో ఒకరైన కోట శ్రీనివాసరావు దివంగతులయ్యాక తెలుగువాళ్లందరూ ఆ గొప్ప నటుణ్ణి సముచితమైన రీతిలో స్మరించుకుంటూంటే ఇవాళ్టి సాక్షి ఫ్యామిలీ పేజ్‌లో కోట గురించి ఎవరో ‘కె’ అన్న తెలివిడి లేని ‘మేధావి’ అసమంజసంగానూ, అనర్థదాయకంగానూ కోట గారి గొప్పతనాన్ని చిన్నబుచ్చే పేలాపన చేశాడు.
సొంత పేరే రాసుకోవచ్చు కదా… ఈ ఏకాక్షర పరిచయాలు..? ఎడిట్ పేజ్ వ్యాసాల్లో వాస్తవ వ్యతిరేక పేలాపనలతో సాక్షి తన మార్క్ పాత్రికేయాన్ని చాటుకుంటూ ప్రజా క్షేత్రంలో నవ్వులపాలు ఔతూండడం మనకు తెలిసిందే. ఆ క్రమంలో ఇవాళ ఫ్యామిలీ పేజ్‌లోనూ సాక్షి తన మార్క్ పాత్రికేయమైన తప్పుడుతనాన్ని ప్రదర్శించింది.
- రండి వివరాల్లోకి వెళదాం… కోటపై వ్యాసంలోని పేలాపనలు
1 …. “కోటది నాగభూషణం స్కూలు” — ఈ మాట పుర్తిగా పేలాపన. సినిమా నటన అన్నదానిపై మామూలు ఆలోచన ఉన్న ఎవరికైనా ఈ మాట విదుషకత్వంగా తెలిసిపోతుంది. కోట శైలిలో ఎంత మాత్రమూ నాగభూషణం శైలి లేదు. నటుడుగా కోట నాగభూషణంకన్నా ఎంతో మిన్న.
2 ….. “…సీరియస్ విలన్‌లుగా రాణించిన కైకాల, రావు గోపాలరావుల అంశ కోటలో ఉన్నా కోట ఎప్పటికీ వారిలా సీరియస్ విలన్‌గా పండలేదు. కామెడీ టచ్ ఉంటే చెలరేగుతారు…” — కోటలో కైకాల, రావు గోపాలరావుల అంశ ఉందనడం తప్పు. ఆ మాట విదూషకత్వం మాత్రమే కాదు…
ఆలోచిస్తే అది ఈ వ్యాస రచయిత అభివ్యక్తి అజ్ఞానం అని కూడా తేటతెల్లం ఔతోంది. ఒక నటుడిపై మరొక నటుడి ప్రభావం ఉంటుంది కానీ అంశ ఉండదు. హతవిధీ ‘కె’ అన్న ఈ వ్యాస రచయిత భాష, భావనల వికృతానికి ఒక్క సాక్షి మాత్రమే చోటుపెట్టగలదు. ఏ ఇతర పత్రికా ఇంతటి అజ్ఞాన్ని భరించలేదు. ఈ అజ్ఞానాన్ని పాఠకులు ఎలాగూ భరించరు.
3 ….. “…ఎం. ఆర్. రాధ బాడీ లాంగ్వేజ్ మాట విరుపు కూడా కోటలో ఉన్నాయి. మాటను నెమ్మది చేసి పెంచడం ఎం.ఆర్. రాధ స్టయిల్. నాన్ సీరియస్‌గా కనిపించే సీరియస్ విలన్…” — ఇది పూర్తిగా విదూషకపు పేలాపన. ఈ రచయిత తనను తాను పెద్ద సినిమా- జ్ఞాని అని అనుకుంటూ విదూషకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు.
కోట body language, సంభాషణ శైలి పూర్తిగా ఎమ్. ఆర్. రాదా (రాధ కాదు) ధోరణికి భిన్నమైనవి. ఎమ్. ఆర్. రాదా కన్నా కోట అన్ని రకాలుగానూ ఎంతో గొప్ప నటుడు. ఎమ్. ఆర్. రాదా ప్రభావం ఏ మాత్రమూ కోట నటనపై లేదు. “కోటది పూర్తిగా ప్రత్యేకమైన శైలి. మొత్తం దేశంలోనే కోట నటన శైలి అపూర్వమైనది”
4 …. “తమిళంలో గౌండర్ మణి, సెంథిల్ ద్వయం చేస్తున్న కామెడీకి తెలుగు రిప్లికాగా కోట, బాబూ మోహన్ తయారు కావడం…” —– తమిళ్ష్‌లో కౌణ్డమణి, సెన్దిల్ (గౌండర్ మణి, సెంథిల్ కాదు) ద్వయం చేసిన కామెడీకి కోట, బాబూ మోహన్ తెలుగు రెప్లికా కాదు. అసలు ఇక్కడ రెప్లికా అన్న పదమే సరైంది కాదు. ఎక్కడ ఏ పదం వాడాలో తెలియక ఈ వ్యాస రచయిత ఏదో రాసేశాడు.
కోట, బాబూ మోహన్ ఇద్దరూ తమిళ్ష్ కౌణ్డమణి, సెన్దిల్ కన్నా గొప్ప నటులు. కౌణ్డమణి, సెన్దిల్ అంటూ వాళ్ల ప్రసక్తి అప్రస్తుతం, అసమంజసం. కౌణ్డమణి కన్నా కోట వందరెట్లు గొప్ప నటుడు. తన మాటలతో ఈ రచయిత తన సాక్షి మార్క్ మేధను ప్రదర్శించాడు.
5 “… దర్శకులే ఆర్టిస్టులను తయారు చేస్తారు. కోటకు ఆ సంగతి తెలుసు. నేను డైరెక్టర్ల ఆర్టిస్టును అని అంగీకరించేవారు…” — తాను డైరక్టర్ల నటుణ్ణి అని కోట చెప్పడాన్ని ఈ రచయిత తన అద్భుత మేధతో వేరేలా అర్థం చేసుకున్నాడు. దర్శకులు ఆర్టిస్టులను తయారుచెయ్యలేరు, చెయ్యరు. ఆర్టిస్టులు తమ ప్రతిభతో దర్శకులు అంచనాల మేరకు నటిస్తారు.
ఒక దర్శకుడికి ఏం కావాలో అది నేను ఇస్తాను, డైరక్టర్ల అంచనాల మేరకు నటిస్తాను అన్న అర్థంలో నేను దర్శకుల నటుణ్ణి అని కోట అన్నారు. హతవిధీ.. సాక్షిలో మాత్రమే ఈ స్థాయి మేధ ఎలా చేరిందో? సాక్షిలో మాత్రమే ఇలాంటి మేధ ఎందుకు పెల్లుబుకుతూంటుందో?
కోటను కౌణ్డమణి వంటి నటులతో పోల్చి, కోటపై నాగభూషణం, ఎమ్.ఆర్. రాదా ప్రభావం ఉందని అర్థంలేని పేలాపన చేసి కోట గొప్పతనాన్ని కించపరిచినందుకు, అపకీర్తి పాలు చేసినందుకు ఈ వ్యాస రచయిత ఎంతైనా గర్హనీయుడు; ఈ వ్యాసాన్ని ప్రచురించిన సాక్షి సంపాదక వర్గం గర్హనీయం.
మంచి సంపాదక వర్గంతో, మంచి వ్యాసకర్తలతో సాక్షి తన మార్క్ పాత్రికేయాన్ని వదులుకుని మామూలు పాత్రికేయానికి ఇకనైనా అలవాటుపడాలి.
ఈ వ్యాసం ద్వారా కోట వంటి మహా నటుణ్ణి అవమానించడం మాత్రం క్షమార్హం కాదు. కె. అన్న వ్యాస రచయితను, సాక్షి సంపాదక వర్గాన్ని కోట ఆత్మ క్షమిస్తుందా? …….. రోచిష్మాన్ 9444012279
.
(ఒకవేళ సాక్షి గానీ, సదరు రచయిత గానీ ఈ వ్యాసరచయిత అభిప్రాయానికి వివరణో, స్పష్టీకరణో, ఖండనో ఇవ్వదలిస్తే వెల్‌కమ్...)
Share this Article