కాసేపు ఈనాడును పక్కన పెడదాం… కేసీయార్ కోసం నమస్తే తెలంగాణ పత్రిక (పాఠకులు క్షమించాలి, దాన్ని పత్రిక అని సంబోధించినందుకు…), జగన్ కోసం సాక్షి, చంద్రబాబు కోసం ఆంధ్రజ్యోతి అవిశ్రాంతంగా పోతరాజుల్లాగా కొరడాలతో చెళ్లుచెళ్లుమని బజారులో నిలబడి, ఆయా పార్టీల రంగులు రుద్దుకుని, మరీ కొట్టుకుంటాయి కదా…
26 పార్టీలతో ఓ బలమైన బీజేపీ వ్యతిరేక కూటమి ఒకటి తయారైంది… మీటింగులు పెడుతోంది… INDIA అని పేరు కూడా పెట్టుకున్నారు… కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి రచిస్తున్నారు… ఆ వార్తలకు ఇంపార్టెన్స్ ఉంది… సేమ్ 39 పార్టీలతో బీజేపీ కూడా తాజాగా మీటింగ్ పెట్టింది… విపక్ష కూటమిపై విరుచుకుపడింది… దేశరాజకీయాల్లో ఈ వార్తకు కూడా బోలెడంత ఇంపార్టెన్స్ ఉంది…
కానీ వీటిలో ఏ కూటమి కూడా టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీలను పిలవలేదు… కలుపుకోలేదు… దేనికీ విశ్వసనీయత లేదు, ఎవరూ తమతో కలుపుకోరు… అవసరమైతే కేసీయార్, చంద్రబాబుల నుంచి డబ్బు సాయం మాత్రం కావాలి… ఎందుకు..? వైసీపీ పేరుకే తటస్థ పార్టీ… కానీ బీజేపీ కూటమిలో దాదాపు సభ్యురాలే… కానీ అనధికారికం… అందుకే బీజేపీ కూటమిలో అధికారికంగా లేడు జగన్… కాంగ్రెస్ ఎలాగూ దూరమే…
Ads
కేసీయార్‌ను ఎవరూ నమ్మరు… సో, అటు కాంగ్రెస్ రమ్మనలేదు, ఇటు బీజేపీ రమ్మనలేదు… బీజేపికి పరోక్షంగా ఉపయోగపడాల్సిందే తప్ప నేరుగా కూటమిలో చేరడు, చేరనివ్వరు… ఈ అభిప్రాయంతోనే ఉన్న కాంగ్రెస్ బీజేపీ బీటీం కదాని దగ్గరకు రానివ్వదు… ఎంఐఎం మీద కూడా ఇలాంటి ఆరోపణే చేస్తుంటుంది కాంగ్రెస్… సో, అదీ దూరమే… గత ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ మనిషి… మస్తు సాయం చేసిండు… కానీ తరువాత బీజేపీ ప్రాపకం కోసం తన్లాడిండు…
గతానుభవాల రీత్యా మోడీ ఈరోజుకూ చంద్రబాబును దగ్గరకు రానివ్వడం లేదు… రేప్పొద్దున జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వైసీపీపై పోరాడతాయనే మాటలే తప్ప నిర్మాణాత్మకంగా ఆవైపు పడిన అడుగులేమీ లేవు… ఇప్పుడు బీజేపీ కూటమి మీటింగుకు కూడా పవన్‌ను రమ్మన్నారు తప్ప చంద్రబాబును రమ్మనలేదు… అంటే తనను నమ్మడం లేదనే అర్థం… బిజూజనతాదళ్ ఎప్పుడూ తటస్థమే… రాష్ట్రంలో తనకు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి, కాంగ్రెస్ అంటే పట్నాయక్‌కు పడదు ఎందుకో… ఈ స్థితిలో…
కేసీయార్, చంద్రబాబు, జగన్ పాదసేవల్లో మునిగితేలే పత్రికల్లో INDIA, NDA మీటింగుల వార్తలు ఎలా వచ్చాయో చూద్దామనిపించింది… ముందుగా కేసీయార్ భజనపత్రిక, కరపత్రిక నమస్తే చూస్తే… ఫస్ట్ పేజీలో కనీసం ఇండికేషన్ కూడా లేదు… ఎక్కడో లోపల ఓ చిన్న సింగిల్ కాలమ్ వార్త… అదీ కనీకనిపించకుండా… అందులోనూ ఎన్డీయే మీటింగ్ గురించి కాదు, విపక్ష కూటమి వార్త… అదీ స్పాట్ న్యూస్ కాదు, దీనికి నాయకుడు ఎవరో ప్రకటించలేదు అని ఎద్దేవా చేస్తూ… (ఈ పత్రిక పాఠకుల మీద జాలేసింది… అందులో నేనూ ఉన్నాను…) దాని ప్రయారిటీ ఉచిత కరెంటు మీద రేవంత్ రెడ్డిని కడిగేయడం… రాస్తూనే ఉంది…
నమస్తేతో పోలిస్తే సాక్షి చాలా చాలా నయం… పత్రిక లక్షణాల్ని పణంగా పెట్టలేదు… రెండు జాతీయ కూటముల వార్తలకు సరైన, సమతూకపు ప్రాధాన్యం ఇచ్చి, ఫస్ట్ పేజీలో పక్కపక్కనే కవర్ చేసింది… సరైన ప్రయారిటీ జడ్జిమెంట్… సాక్షిలాగే ఆంధ్రజ్యోతి… ‘మా బాబును రమ్మనరా’ అనే బాధ, కోపం ఉన్నట్టున్నా సరే, ఒక పత్రికగా రెండు కూటముల వార్తల్ని ఫస్ట్ పేజీలోనే కవర్ చేసింది…
మరి ఈనాడు సంగతేమిటి అంటారా..? ఇలాంటి ప్రాధాన్య సందర్భాల్లో అది ఎప్పుడూ ఓ పత్రికగానే సమప్రాధాన్యాల్ని ఇస్తుంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా ఈ కథనంలోకి పట్టుకురాలేదు… ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ తదితర భాషల పత్రికలన్నీ ఈ రెండు వార్తల్ని ప్రముఖంగా ప్రచురించాయి… కానీ ఒక్క ఆ నమస్తే అనబడే డొల్లపాత్రికేయ కాగితం మాత్రం తన ‘గుణాన్ని’ చూపించుకుంది… ఫాఫం…
Share this Article