.
ఇటు చంద్రబాబు… అటు జగన్… ఇటు చంద్రబాబు వాయిస్ ఆంధ్రజ్యోతి… అటు జగన్ సొంత గొంతుక సాక్షి… రెండు రాజకీయ పార్టీల కరపత్రికల్లా, డీజే మైకుల్లా… తెల్లారిలేస్తే టన్నులకొద్దీ బురదను ఎత్తిపోసుకుంటుంటాయి…
తాజాగా రెండింటి మధ్య ఓ దిక్కుమాలిన వివాదం… అది పత్రికలు, టీవీల గురించి కాదు… ఆయా మీడియా సంస్థల న్యూస్ వెబ్‌సైట్ల గురించి… రెండూ తప్పుడు వాదనలనే తలకెత్తుకున్నాయి… ఆంధ్రజ్యోతిది ఓతరహా మూర్ఖత్వం అయితే, సాక్షిది మరోతరహా అబద్ధాలు, అతిశయాలు…
Ads
ఆంధ్రజ్యోతి పాపులారిటీని వాడుకుని, సాక్షి రీడర్‌షిప్ పెంచుకునేందుకు కుట్రలు చేస్తోందనీ, తన వెబ్‌సైట్ పేజీల్లో ఆంధ్రజ్యోతిని ట్యాగ్ చేస్తోందనీ, ఇంత దిగజారుడుతనానికి, నీచానికి క్షమాపణ చెప్పడమే కాదు, తక్షణం ఆ ట్యాగులన్నీ తీసేయాలని మొన్నటి నుంచీ ఆంధ్రజ్యోతి ఒకటే గాయి…
ఎహె, అసలు ట్యాగ్స్ అంటే ఏమిటో, ఎందుకు చేస్తారో తెలియకుండా పిచ్చి కూతలు, తిక్క రాతలు ఏమిటనేది సాక్షి కౌంటర్… ఈరోజు సాక్షి ఎడిట్ పేజీలో ఎడిటర్ పేరుతో ఓ సుదీర్ఘ వివరణ కూడా జతచేసింది… కేవలం ఆంధ్రజ్యోతి వార్తల్ని ప్రస్తావించి, వాటికి కౌంటర్స్ రాస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆ పత్రిక పేరును ట్యాగ్ చేస్తామనీ, దాంతో తమ రీడర్‌షిప్‌కు వచ్చే ఫాయిదా ఏమిటనీ ప్రశ్నిస్తోంది… ముందుగా సోషల్ మీడియా ట్యాగింగ్ గురించి అవగాహన పెంచుకో అని హితవు చెబుతోంది…
ఆంధ్రజ్యోతిలో కూడా ఓ వార్త వచ్చింది… తమ వరుస కథనాలతో ఇక తప్పనిసరై సాక్షి మా ట్యాగ్ తీసేసిందనీ, కానీ క్షమాపణ చెప్పకపోతే లీగల్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించింది… ఇలాంటి కేసులతో వచ్చేది లేదు, పోయేది లేదు… ఎవరిా రీడర్స్ వాళ్లకుంటారు… జ్యోతి ట్యాగ్ క్లిక్ చేస్తే రీడర్స్ జ్యోతి వెబ్ పేజీలకే వెళ్తారు గానీ సాక్షి వెబ్ పేజీలకు వెలా వెళ్తారు..? ఈ-పేపర్లు, వెబ్‌సైట్లు చదివే పాఠకులకు ఏ పేపర్ కావాలంటే దాన్నెలా ఓపెన్ చేసుకోవాలో తెలియదా..? ఎవరి పొలిటికల్ లైన్ ఏమిటో వాళ్లకు ప్రత్యేకంగా చెప్పాలా..?
నిజంగా సాక్షి అలాంటి టెక్నికల్ కుట్రలకు దిగే పక్షంలో నెంబర్ వన్ పత్రిక ఈనాడు ట్యాగే వాడుకుంటుంది కదా, ఆంధ్రజ్యోతి ట్యాగే దేనికి…? ఐతే ఒకటి మాత్రం నిజం… సాక్షి వెబ్ సైట్ సాంకేతిక నిర్వహణ అధ్వానం… కంటెంట్ గురించి కాదు చెప్పేది… రెండు వెబ్‌సైట్ల కంటెంట్ వాటి పొలిటికల్ లైన్స్ బట్టే ఉంటుంది… ఇక అసలు విషయానికి వద్దాం…
సాక్షి ఎడిటర్ రాసుకొచ్చాడు… ‘‘సాక్షి వార్తలతోపాటు వాస్తవాల్ని అందించే సాక్షికి ఉన్న ఆదరణ ఆంధ్రజ్యోతి (వెబ్‌సైట్ల విషయంలో)కి ఎప్పుడూ లేదు… అలాంటప్పుడు ట్రాఫిక్ డైవర్ట్ చేసుకునే కుట్రలు మాకెందుకు..? సాక్షికి విశ్వసనీయత ఉంది కాబట్టే ఆంధ్రజ్యోతికన్నా డిజిటల్ రేటింగ్స్‌లో ముందుంది…’ అని…!
అబద్ధం… విశ్వసనీయత విషయంలో ఆంధ్రజ్యోతి ఎంతో సాక్షీ అంతే… అఫ్‌కోర్స్, ఈనాడు, నమస్తే కూడా అంతే… ఐతే డిజిటల్ ర్యాంకుల విషయానికి వస్తే సాక్షికన్నా ఆంధ్రజ్యోతే మెరుగు… సాక్షి వాదన అక్షర అసత్యం… ఇవి చూడండి… ఇవి ఆంధ్రజ్యోతి డిజిటల్ ర్యాంక్స్… (సిమిలర్‌వెబ్ ర్యాంకింగ్స్ సైట్ ప్రకారం…)
ఇప్పుడు సాక్షి ర్యాంకింగ్స్ చూడండి…
క్లియర్… వరల్డ్ ర్యాంక్, కంట్రీ ర్యాంక్, ఇండస్ట్రీ ర్యాంక్… ఏ పారామీటర్ చూసుకున్నా ఆంధ్రజ్యోతే సాక్షికన్నా మెరుగు… ఇంకొన్ని పారామీటర్స్ కూడా చూడండి… సాక్షి చాలా వెనుకబడి ఉంది, కారణం దాని సాంకేతిక నిర్వహణ అడ్డదిడ్డంగా ఉండటమే… (తన సైట్ మెయింటెనెన్సే సరిగ్గా చేతకాదు, ఇక వేరే పత్రికల ట్రాఫిక్ తమవైపు మళ్లించుకునే తెలివి ఉందా సాక్షి టెక్నికల్ టీమ్‌కు..?)
నెలవారీ విజిట్స్, విజిట్ వ్యవధి, ఒక విజిట్‌కు చూసే పేజీల సంఖ్య, స్థూలంగా పేజీ వ్యూస్… ఏ పారామీటర్ తీసుకున్నా సరే (ఒక్క బౌన్స్ రేటు మినహా…) ఆంధ్రజ్యోతి సైట్ చాలా మెరుగు… నిజం ఇదీ… ఎప్పటిలాగే సాక్షి తన గొప్పతనం గురించి గొప్పగా అబద్ధాలు రాసుకుంది…!! (కాదు, నిజంగా మా సైటే ఆంధ్రజ్యోతికన్నా బెటర్ అని చెప్పడానికి ఏదైనా బెటర్ ర్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ పేరు చెబితే క్రాస్ చెక్ చేస్తాం..)
ఏబీఎన్ తన చానెల్‌లో, ఆంధ్రజ్యోతి తన పత్రికలో ఎడాపెడా సాక్షి కుట్ర అని రాసుకోవడమే కాదు… పలు ఇతర యూట్యూబ్ చానెళ్లలో పదునైన థంబ్ నెయిళ్లతో ప్రసారం అయ్యాయి… ఏబీఎన్ దెబ్బకు భయపడిన భారతి, దెబ్బకు అవుట్ అని ఒకరు… ఏబీఎన్ దెబ్బకు తోకముడిచింది సాక్షి అని మరొకరు… వంకర బుద్ది మార్చుకో సాక్షీ, ఇదే లాస్ట్ వార్నింగ్ అని ఇంకొకరు… ఇష్టారాజ్యం… సరే, ఆ బురద ప్రసారాల కథ వేరు..!
Share this Article