ఒక బాహుబలి… తరువాత ప్రభాస్‌ను నిలబెట్టిన సినిమా లేదు… అంటే ఆ రేంజులో తనను ఫోకస్ చేసిందేమీ లేదు… సాహో కొంతమేరకు పర్లేదు… కానీ రాధేశ్యామ్ భీకరంగా తన ఫ్యాన్స్‌ను కూడా భయపెట్టింది… ఇక ఆదిపురుష్ అంతకన్నా ఘోరం… పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యేంత స్టామినా ఉండీ ప్రభాస్ సినిమాల ఎంపికలో వేసిన రాంగ్ స్టెప్స్ అవి… తన ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు…
తనే కాదు… ఈవెన్ బాలీవుడ్ మాఫియాను ఈసడించుకునేవారు సైతం ప్రభాస్ జాతీయ స్థాయిలో బలంగా నిలబడాలని కోరుకున్నారు… సల్మాన్, షారూక్, ఆమీర్… వీళ్లదే ‘‘ఖాన్సార్’’ రాజ్యం… బాలీవుడ్ మాఫియా మరో హీరో ఎవరూ నిలదొక్కుకోకుండా తొక్కింది… మరే హీరో నిలబడలేదు… ప్రభాస్‌కు చాన్స్ ఉండీ తప్పుటడుగులు వేశాడు… ఈరోజుకూ షారూక్ సిండికేట్ తమ స్వార్థం కోసమే అయినా సలార్‌ను తొక్కడానికి విశ్వప్రయత్నం చేసింది…
పైగా తన దైహిక సమస్యలు… ఫిట్‌నెస్ లేకపోవడం… వరుస ఫ్లాపులు… ఐనాసరే ప్రభాస్ అంటే క్రేజ్ తగ్గలేదు… పాపులారిటీకి వచ్చిన ఢోకా ఏమీ లేదు… ఈ స్థితిలో ప్రభాస్‌కు పెద్ద రిలీఫ్ అవసరం… తనకు ఓ పునర్జన్మ అవసరం… ఖచ్చితంగా సలార్ సినిమా ఆ అవసరాన్ని తీర్చింది… ఇదేమీ గొప్ప సినిమా కాదు, తప్పక చూడాల్సిన కేటగిరీ ఏమీ కాదు… కానీ ‘పర్లేదు, చూడొచ్చు’ అనుకునే సినిమా… పైసా వసూల్ సినిమా…
Ads
ఇప్పటి ట్రెండ్ యానిమల్, పఠాన్, జవాన్, అఖండ బాపతు ఫుల్ యాక్షన్ సినిమాలే కదా… ఇదీ అదే… ఓ మిత్రుడు వ్యాఖ్యానించినట్టు డార్క్ బ్లాక్ బస్టర్, క్రూడ్ బ్లాక్ బస్టర్ అని అంగీకరించలేం… కానీ ప్రభాస్ ఫ్యాన్స్‌కు, ప్రభాస్‌కు పెద్ద రిలీఫ్… నిజమే… సాక్షాత్తూ దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా చెప్పినట్టు ఇది ఉగ్రం, కేజీఎఫ్ సినిమాలకు హైబ్రీడ్ వెర్షన్… అదే యాక్షన్ సీన్లు దడదడ… నెత్తురు, హింస, బీభత్సం… ప్రశాంత్ సినిమా అంటే అంతే… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది కేజీఎఫ్-3, కాకపోతే యశ్ బదులు ప్రభాస్…
ఓ రొమాన్స్ ఉండదు, ఓ కామెడీ ఫ్లేవర్ ఉండదు… పెద్దగా ఎమోషన్స్ ఉండవు… గబగబా దంచుతూ వెళ్లిపోవడమే… కాకపోతే ఎక్కడా గ్రిప్ సడలకుండా ఒక బిగితో కథ నడిపించడం… అసలు కథాకాకరకాయ కూడా చెప్పుకోవడం దండుగ… ప్రభాస్ ఉగ్రరూపాన్ని చూడటమే… ప్రశాంత్ మార్క్ ప్రజెంటేషన్, దానికి తగినట్టు సినిమాటోగ్రఫీ, బీజీఎం… తిక్క పాటలకూ, స్టెప్పుల గెంతులకు ప్రశాంత్ సినిమాలో చాన్స్ ఉండదు… ఇదీ అంతే… సేమ్, కేజీఎఫ్ బాపతు నేపథ్యంతోనే మొదలవుతుంది సినిమా…
ఎక్కడో ఓ బొగ్గు గని ఏరియాలో అనామకంగా గడుపుతున్న హీరో… తల్లి ఓ టీచర్, తను ఓ మెకానిక్… హింసకు దూరంగా… కానీ కథే హీరోను వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది… తల్లి అస్థికల్ని గంగలో కలపడానికి వచ్చిన హీరోయిన్ ఇక్కడికి చేరుతుంది… ఆమెను ఖతం చేయడానికి ప్రయత్నాలు, హీరోతో పరిచయం… ఆమెను కాపాడే ప్రయత్నాలు… విలన్ తన ఉనికిని సందేహించడం… కథ బ్యాక్ గ్రౌండ్‌లోకి వెళ్తే ఇద్దరు దోస్తులు, ప్రత్యర్థులుగా ఎలా మారారు..? ఖాన్సార్ అనే రాజ్యమేమిటి..? కుట్రలేమిటి..? యుద్ధవిరమణ ఏమిటి..? తల్లితోకలిసి అజ్ఞాతంలో ఎందుకు బతుకుతుంటాడు గట్రా అంశాలే కథ… రెండో పార్టు వైపు పయనం…
ప్రభాస్‌కు ఫుల్లు ఎలివేషన్… మరి ప్రశాంత్ బాపతు ఎలివేషన్స్ అలాగే ఉంటయ్… ప్రభాస్‌కు ఆ ఎలివేషన్స్ సూటయ్యాయి… తన ముందు పృథ్విరాజ్, జగపతిబాబు, శృతిహాసన్ అందరూ తేలిపోతారు… తల్లిగా ఈశ్వరీరావు బెటర్… మరి షారూక్ ‘డన్కీ’తో పోలిక అంటారా..? అవసరం లేదు… దేని కథ దానిదే… ఎస్, ప్రభాస్ ఈ సినిమాతో తిరిగి బాలీవుడ్‌లో నిలబడ్డట్టే అనిపిస్తుంది… నిజంగానే సినిమా టాక్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్… హైదరాబాదులో అనేకచోట్ల హంగామా చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు… జయహో ప్రభాస్…
చివరగా… దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్, నిర్మాత హొంబలె కిరగందూర్… ఎవరు చెప్పినా సరే, మీ సినిమాలో చెప్పిన ‘ఖాన్సార్’ ఏరియా అంటే… ఆ ముగ్గురు ఖాన్‌ల రాజ్యం అనేనా..?! షారూక్ కొమ్ముకాసిన పీవీఆర్-ఐనాక్స్ మొహం పగిలిపోయినట్టేనా..?!
Share this Article