దర్శకుడు సుకుమార్ షేర్ చేసుకున్న ఫోటో ఒకటి కనిపించింది… అది అసలే బన్నీ సినిమా పుష్పకు సంబంధించింది… ప్రస్తుతం విపరీతమైన హైప్ క్రియేటవుతోంది కదా ఆ సినిమా మీద… పైగా సమంత ఓ ఐటమ్ సాంగ్ చేస్తోంది… (విడాకులయ్యాక ఆమె స్వేచ్ఛ ఆమెకు మళ్లీ లభించింది…) అసలు సమంత సాంగ్ అంటే అదో హైప్… ఆ పాట ఏమిటంటే… అ అంటావా, అ ఆ అంటావా… పదో తారీఖు లిరికల్ వీడియో రిలీజ్ చేస్తాం అని దర్శకుడు చెప్పుకున్నాడు, ఇలాంటి లిరికల్ వీడియోలు ఇప్పుడు కామనే కదా… కానీ ఈ సమంత పాట సమాచారం ఆరా తీస్తే, నిజానికి బాగా ఆకర్షించింది అంశం వేరే ఉంది… ఆ పాట పాడింది ఓ కొత్త కెరటం…
ఇందు అలియాస్ ఇంద్రావతి… ఆమె ఎవరో కాదు, సింగర్ మంగ్లీ చెల్లె… మంగ్లీ కొన్నాళ్లుగా ఎంత పాపులర్ అయ్యిందో తెలుసుగా… ఇప్పుడిక ఇందు గొంతు కూడా… ఎక్కడో ఆమె పాట వీడియో చూసి, ఆమె గొంతులో ఫీల్ బాగా ఆకట్టుకుని దేవిశ్రీప్రసాద్ ఆమెను తనే పిలిపించుకుని పాట ఇచ్చాడు… రికార్డింగ్ టైంలో ఆమె పాట పడిన తీరుకు ఏక్దమ్ ఫ్లాట్ అయిపోయాడు… ఆమె మంచి డాన్సర్ కూడా… నిజానికి జార్జిరెడ్డి సినిమాలో ఆమె ఓ పాట పాడినట్టు, కానీ పాట రైట్స్ మీద ఏదో చిన్న కంట్రవర్సీ నెలకొని, ఆ పాటను సినిమాలో పెట్టకుండా వదిలేశారని అప్పట్లో విన్నట్టు గుర్తు… ఆల్ ది బెస్ట్ ఇందూ… సరే, ఇందూ పాటను పక్కన పెడితే… నిజానికి ప్రస్తుతం తెలుగు సినిమా పాటలకు సంబంధించి తెలంగాణ గొంతు ఓ కొత్త ట్రెండ్… తెలంగాణ లొకేషన్స్, తెలంగాణ యాస, తెలంగాణతనంలాగే ఇప్పుడు తెలంగాణ పాట వెండి తెరను ఉర్రూతలూగిస్తోంది…
Ads
సంగీత దర్శకులు కూడా కొత్తదనం కోసం అన్వేషిస్తున్నారు, పిలుస్తున్నారు, అవకాశాలిస్తున్నారు… అది తెలంగాణ జానపద గాయకులు వాళ్ల ప్రతిభ నిరూపించుకోవడానికి ఉపయోగపడుతోంది… అదీ ఇప్పుడు మనం చెప్పుకోదగిన విశేషం… ఇప్పుడు గమకాలు, స్వరజతులు, సంగతులు కాదు… స్వరంలో ఫీల్ ఉన్నవాళ్లు కావాలి… పల్లె గొంతు పల్లవించాలి… ఇదే దేవిశ్రీప్రసాద్ ఇదే పుష్ప సినిమా కోసం మామిడి మౌనికతో పాడించిన సామీ సామీ పాట ఎంత హిట్టయిందో తెలుసు కదా… అదరగొట్టేసింది…
మౌనిక పాడిన ఓ పాట యూట్యూబ్‌లో భారీ హిట్… అది చూసి, విని డీఎస్పీ మౌనికకు చాన్స్ ఇచ్చాడు… అంతెందుకు థమన్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ‘‘ఆడ గాదు, ఈడ గాదు, అమీరోళ్ల మేడా గాదు, గుర్రపునీళ్ల గుట్టకాడ, అలుగువాగ తండాలోన, బెమ్మజెముడు చెట్టున్నాది’’ పాటను సంప్రదాయ వాయిద్యకారుడు కిన్నెర మొగిలయ్యతో పాడించాడు… అదీ హిట్… అదే సినిమాలో థమన్ ఫోక్ సింగర్ దుర్గవ్వతో అడవితల్లిమాత పాట పాడించాడు… ఎసెన్స్ ఆఫ్ భీమ్లానాయక్ అంటూ ఆ లిరికల్ వీడియో విడుదలైంది… పాట జనంలోకి బలంగానే వెళ్లింది కూడా…
చిత్తూచిత్తుల బొమ్మ పాట యూట్యూబులో ఎంత హిట్టో తెలుసు కదా… ఆ పాట పాడిన కనకవ్వతో అదే పాటను నాని హీరోగా నటించే దసరా అనే సినిమా కోసం పాడించుకున్నాడు సంగీతదర్శకుడు సంతోష్ నారాయణన్… ఇక సింగర్ మోహన్ భోగరాజు పాడిన బుల్లెట్ బండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సూపర్ హిట్టో కొత్తగా చెప్పనక్కర్లేదు… ఆమె స్వస్థలం ఏలూరు అయినా పెరిగిందీ చదువుకున్నదీ హైదరాబాదే… అదే పాట మాకు కావాలని అఖండ సినిమా కోసం బోయపాటి, లైగర్ సినిమా కోసం పూరి అడిగారు, ఆమెకు ఓ పాత్ర ఆఫర్ చేశారు, కానీ తన గొంతుకు పట్టాభిషేకం చేసిన ఆ పాటను యూట్యూబ్ నుంచి తీసేయడానికి ఆమెకు మనస్కరించలేదు…
కొత్త నీరు వరదలా వచ్చేస్తోంది… ప్రేక్షకుడికీ కొత్తదనం కావాలి… అందుకే సంగీత దర్శకుల అన్వేషణ సాగుతోంది… తెలంగానం అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది… ఇదీ ట్రెండ్… మంచిదే… కొత్తొక వింత, కాదుకాదు, వీనులకు పులకింత… అన్నట్టు దసరా టీజర్ చూస్తుంటే నాని పలికిన డైలాగ్స్ ఇట్టే పట్టేసినయ్… ‘‘ఈ దసరా నిరుటిలెక్క ఉండదు బాంచెత్, జమ్మి పెట్టి చెప్పుతున్న, బద్దలు బాషింగాలైతయ్, ఎట్లయితే గట్లయితది, చూస్కుందాం…’’ పర్పెక్ట్ తెలంగాణ స్లాంగ్‌లో పలికాడు… కృష్ణాంజనేయయుద్ధంలో తమిళ బోర్డర్ భాషను ఎలాగైతే భలే పట్టేశాడో, ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ కూడా నేర్చుకున్నాడు… ఈ విషయంలో నాని ప్రశంసార్హుడు… సో, తెలంగాణ పాటే కాదు, తెలంగాణ మాట కూడా… అంతెందుకు తెలంగాణ కల్లు, తెలంగాణ తొక్కు కూడా ఫేమసే… బాలయ్య అఖండ సినిమాలో కల్లు మా మెడిసిన్, మా ట్రెడిషన్ అని ప్రజ్ఞా జైస్వాల్‌తో అనిపించారు కదా, బోలెడు మంది గీతకార్మిక నేతలు బోయపాటిని కలిసి ధన్యవాదాల్లో ముంచెత్తారు… సర్వాయి పాపన్న సినిమాను తీయాలని కూడా కోరారు… అదే బాలయ్యతో తీస్తే సరి…!!
Share this Article