అదే ఏప్రిల్!
అదే కరోనా!
——————–
“అదే నీవు అదే నేను అదే గీతం పాడనా?
కథైనా కలైనా కనులలో చూడనా?
కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము;
గువ్వ గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నాము;
అదే స్నేహము అదే మోహము
ఆది అంతం ఏదీ లేని గానము
Ads
నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు;
కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు;
అదే బాసగా అదే ఆశగా
ఎన్నిన్నాళ్ళీ నిన్న పాటే పాడను?”
అభినందన సినిమాలో ఆత్రేయ గీతం. ఇళయరాజా సంగీతం. బాలు గానం. సందర్భం ప్రేయసీ ప్రియుల వ్యవహారం. మానసిక సంఘర్షణ. ఎడబాటు భరించలేని విరహవేదన. నరకయాతన.
ఇదే పాటను మళ్లీ తిరగబెట్టిన కరోనాకు అన్వయించుకుని, అనువదించుకుంటే-
“అదే వైరస్ అదే కరోన
అదే గీతం పాడనా?
కథైనా కలైనా అవే వార్తలు చదవనా?
ఊరు వాడా గూడేల్లో
వైరస్ వచ్చి చచ్చాము;
గువ్వ గువ్వ కౌగిల్లో గూడు దాటకున్నాము;
అవే మాస్కులు అదే కడుగుడు;
ఆది అంతం ఏదీ లేని రోగమూ!
నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామనుకున్నాం;
కన్నీరైన బతుకుల్లో పన్నీరౌదామనుకున్నాం;
అదే బాసగా అదే ఆశగా;
ఎన్నిన్నాళ్ళీ నిన్న పాటే పాడను?”
——————–
కరోనా వచ్చి సంవత్సరం దాటింది. రెండు వ్యాక్సిన్లు వచ్చాయి. ఇంకో రెండు విదేశీ వ్యాక్సిన్లు దారిలో ఉన్నాయి. మళ్లీ నిరుడు మార్చి దాటి ఏప్రిల్లో ఎలా ఉందో అంతకంటే పరిస్థితి విషమించింది. స్కూళ్లు మూతపడ్డాయి. థియేటర్లు మూతపడేలా ఉన్నాయి. బార్లు మూతపడతాయేమో? ఆలయాల తలుపులు మూసుకుంటున్నాయి. ఉత్సవాలు కష్టం. విమానాశ్రయాల్లో కోవిడ్ పరీక్ష నెగటివ్ ఫలితముంటేనే ప్రయాణం. రాష్ట్రాల సరిహద్దుల్లో కంచెలు మొలుస్తున్నాయి. రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు కర్ఫ్యూలు మొదలయ్యాయి. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ లు. వలస కార్మికులు మళ్లీ సొంతూళ్లకు వెళుతున్నారు. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. లాక్ డౌన్ పెట్టముగాక పెట్టం అని ప్రభుత్వాలు అభయమిస్తున్నా పరిస్థితులు అలా కనిపించడం లేదు. కరోనా మరణాలతో శ్మశానాల్లో చోటు చాలడం లేదు. సామూహిక చితుల్లో అంత్యక్రియలకు అంతు ఉండడం లేదు. మళ్లీ మునుపటి మార్చి- ఏప్రిల్ వచ్చేశాయి. ఇక ఇప్పుడు బాల్కనీల్లో కొవ్వొత్తులకు కరోనా భయపడదు. కంచాల మీద గరిటెలతో కొడితే కరోనా పొయ్యేలా లేదు. వీధుల్లో సెలెబ్రిటీలు చప్పట్లు కొట్టి సోషల్ మీడియాలో పెట్టినా కరోనా వినేలా లేదు.
“అదే నువ్వు
అదే నేను
అదే కరోనా
అవే బాధలు”
-పమిడికాల్వ మధుసూదన్
Share this Article