.
మరాఠీ జనం శంభాజీ ఛత్రపతి చరిత్ర ఛావా సినిమాలో చూసి, తెలుసుకుని, ఆ కథతో కనెక్టయి, శోకిస్తున్నారు… హరహరమహాదేవ అని నినదిస్తున్నారు… అన్నింటికీ మించి పరమ క్రూరుడైన ఔరంగజేబు శంభాజీని పెట్టిన చిత్రహింసలు చూసి మహారాష్ట్ర యావత్తూ ఉద్వేగానికి గురవుతోంది…
మరి మన తెలుగు వారికి ఇలాంటి కథలు, అవీ క్రూర పాలకులపై పోరాడిన రాజుల కథలు… స్వధర్మం కోసం ప్రాణాలర్పించిన కథలు లేవా..? ఉన్నాయి… కానీ మనవాళ్లకు ఆ చరిత్రను చిత్రస్థం చేసే అభిరుచి లేదు, ఆసక్తి లేదు, ఎంతసేపూ స్మగ్లర్లు, పిచ్చి వక్రీకరణల తిక్క కల్పిత కథలపై ఆసక్తి… అవీ వెగటు వేషాలతో… (బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు ఈ విమర్శ నుంచి మినహాయింపు)…
Ads
ఉదాహరణకు… శంభాజీకి తీసిపోని పాత్ర మన తెలుగు చరిత్రలో ఉంది… తన పేరు వినాయకదేవుడు… కాస్త వివరాల్లోకి వెళ్దాం… మన తెలుగు జనం మరిచిపోని యుగపురుషుల గురించి చెప్పుకోవాలంటే… శాతవాహనుడు, గౌతమీ పుత్ర శాతకర్ణి, కాకతీయ గణపతిదేవుడు, శ్రీకృష్ణదేవరాయులు… మరొకరు కాకతీయుల తరువాతి ముసునూరి కాపయనాయుడు…
ఈ కాపయనాయుడి కొడుకే వినాయకదేవుడు… సాహసి, వీరుడు, యుద్ధనిపుణుడు, స్వధర్మం మీద అంతులేని ప్రేమ… కాపయనాయుడి కాంక్ష మొత్తం తెలుగుదేశాన్ని (తెలంగాణసహా) మ్లేచ్ఛుల పాలన నుంచి విముక్తం చేయడం… ఆంధ్ర దేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాణ బిరుదులతో కాపానీడు (కాపయనాయుడు) పాలన ఓ చరిత్ర… కాకపోతే తన జీవితమంతా ఈ పోరాటాలకు, రాజీలకు, కష్టాలకు సరిపోయింది…
జాఫర్ ఖాన్ అనువాడు ఢిల్లీ సుల్తానులపై తిరుగుబాటు ప్రకటించి, మన కాపయనాయుడిని సాయం అడుగుతాడు… ఢిల్లీ సుల్తానులను బలహీనపరచడం లక్ష్యంగా కాపయనాయుడు సాయం చేస్తాడు… కానీ బహమనీ రాజ్యం స్థాపించి సదరు జాఫర్ ఖాన్ భస్మాసురుడై ఈ కాపయనాయుడిపైనే దండెత్తుతాడు…
కాపయనాయుడికి ఓటమి తప్పలేదు, సంధి కుదుర్చుకున్నాడు… ఓ కోటను సమర్పించుకున్నాడు… తరువాత అల్లావుద్దీన్ దాడి… గుళ్ల ధ్వంసం, మసీదుల నిర్మాణం, హిందువుల ఊచకోతలు, అత్యాచారాలు… దీంతో కాపయనాయుడు మళ్లీ సంధి, కప్పం కట్టడానికి ఒప్పందం…
అల్లావుద్దీన్ కొడుకు మహమ్మద్ షా… గతంలో కోల్పోయిన కోటల్ని తన నుంచి గెలవటానికి కాపయనాయుడు తన కొడుకు వినాయకదేవుడిని యుద్ధానికి పంపిస్తాడు… అందులో మహమ్మద్ షా ఓడిపోతాడు… కానీ కొద్దికాలానికే మళ్లీ దాడి చేసి వినాయక దేవుడిని ఓడిస్తాడు… కాపయనాయుడికి మళ్లీ సంధి తప్పలేదు…
ఐనా సరే, వినాయక దేవుడిపై పగతో రగులుతున్న మహమ్మద్ షా ఏదో ఓ కుంటిసాకుతో యుద్ధం ప్రకటించి, వినాయకదేవుడిపై దండెత్తుతాడు… అందులో వినాయకదేవుడు ఓడిపోతాడు, పట్టుబడతాడు… మహమ్మద్ షా ఔరంగజేబులాగే వినాయకదేవుడికి అనేక షరతులు పెడుతుంటే వినాయకదేవుడు అంగీకరించకుండా ధిక్కరిస్తాడు…
శంభాజీని చిత్రహింసల పాలుచేసినట్టే వినాయకదేవుడిని కూడా మహమ్మద్ షా హింసిస్తాడు… నాలుక కోయిస్తాడు, కళ్లు తీయిస్తాడు, తల నరికి, కోటపై ఉండే ఫిరంగి నుంచి కోట బయట మంటల్లో పడేట్టుగా పేలుస్తాడు… నరకంకన్నా ఎక్కువ… ఇది చూసిన తెలుగుజనంలో కోపం కట్టలు తెంచుకుని, మహమ్మద్ షా సైన్యాన్ని ఎక్కడికక్కడ అడ్డగించి ఊచకోత కోస్తారు… గాయాలపాలై పారిపోతాడు షా…
తరువాత రెండు యుద్ధాల్లో కాపయనాయుడు ఓడిపోతాడు… శంభాజీపై సొంత మనుషులే కుట్రపన్నినట్టుగా కాపయనాయుడికీ తెలుగు రాజులతో కుట్రలు ఎదురై చివరి యుద్ధంలో హతుడవుతాడు… ఇదీ చరిత్ర… మనవాళ్లకు మన చరిత్ర చెప్పుకునే తెలివి లేదు, సోయి లేదు, దమ్ములేదు… అదొక విషాదం..!!
Share this Article