Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక యువ ప్రేమ… ఒక ప్రౌఢ ప్రేమ… ఓ పాత ప్రేమ… వెరసి సంసారం..!!

December 3, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… మరో సంసారం కధ . మహిళా సెంటిమెంట్ కోసం సంసారం అనే టైటిల్ పెట్టి ఉండవచ్చు . వాళ్ళ లెక్క కూడా వర్కవుట్ అయింది . మహిళలకు నచ్చిన సినిమా అయింది . వాళ్ళు మెచ్చిన సినిమా అయింది . హిట్టయింది .

సందట్లో సడేమియా ఏందంటే 1+2 కధ కూడా . ఆ 1+2 కూడా శోభన్ బాబు , శారద , జయప్రద . మరింక మహిళలు విజృంభించి సినిమాను హిట్ చేసి పడేసారు .

Ads

కధ కాస్త మన చిన్నప్పటి గుణ సుందరి కధలాగా ఉంటుంది . రాజు గారి మొదటి ఇద్దరు కూతుళ్లు మెహర్బానీ మాటలు మాట్లాడి తండ్రి మెప్పు పొందుతారు . ఆఖరి కూతురు ఉన్నది ఉన్నట్లు మాట్లాడి తండ్రికి దూరం అవుతుంది . షేక్స్పియర్ కింగ్ లియర్ కధ లాగా .‌

ఈ సినిమా కూడా అంతే . పెద్ద పారిశ్రామికవేత్త , క్రమశిక్షణకు మారు పేరయిన శోభన్ బాబు , శారదలకు ఇద్దరు కొడుకులు , ఒక కూతురు . పెద్ద కొడుకు IAS , పెద్ద కోడలు విదేశాలలో చదువుకొని వచ్చిన పెద్దింటోళ్ళ అమ్మాయి . కూతురు చదువుకుంటూ ఉంటుంది . రెండో కొడుకు రాజేంద్రప్రసాద్ తండ్రికి పూర్తిగా విరుధ్ధం . వాళ్ళ ఫేక్టరీ లోనే మామూలు ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు .కామన్ మేన్ . తండ్రికి చెవిలో జోరీగ అయి , తండ్రి ఉద్దేశంలో వ్యర్ధుడు అవుతాడు .

రాజేంద్రప్రసాద్ ఓ సాధారణ యువతి రజనితో ప్రేమాయణం జరుపుతూ ఉంటాడు . ఇంతలో ప్రసాద్ బాబు రూపంలో విలన్ ఎంటరవుతాడు . కాళ్ళావేళ్ళా పడి ఉద్యోగం ఇప్పించుకుని తోటి వర్కర్లను రెచ్చగొట్టి సమ్మె , నిరాహారదీక్షల దాకా తీసుకుని వెళతాడు .‌

ఈ పరిస్థితుల్లో మరో ముఖ్య పాత్ర , శోభన్ బాబు మాజీ ప్రేయసి జయప్రద ఎంటరవుతుంది . లేబర్ ఆఫీసరుగా శోభన్ బాబు ఫేక్టరీ సమ్మె వివాదం ఆమె వద్దకే వెళుతుంది . శోభన్ బాబు MD గా రాజీనామా చేసి అల్లుడు సుధాకర్ని MD ని చేస్తాడు .‌ఈలోపు విలన్ ప్రసాద్ బాబు నేరాల చిట్టాను పోలీసులు విప్పి అతన్ని లోపలేస్తారు .‌

శోభన్ బాబు భార్యతో తనకు , జయప్రదకు పూర్వాశ్రమంలో ప్రేమాయణాన్ని నిజాయితీగా , మంచి బాలుడు అనిపించుకోవటానికి చెపుతాడు . ఆమె అర్థం చేసుకుంటుంది . కానీ ఇన్నాళ్లు దాచి పెట్టినందుకు మనోభావాలు దెబ్బతిని చనిపోతుంది . జయప్రద బదిలీ అయి వెళ్ళిపోతుంది . కట్టుకున్నది చనిపోతుంది . పాత ప్రేయసి నిష్క్రమిస్తుంది .

shobhan

ఒంటరి అయిపోయిన శోభన్ బాబు పెద్ద కొడుకు , కోడలు వద్దకు వెళ్ళి వాళ్ళకు ఫోన్ బాయిగా , బెల్ బాయిగా ఉండటం ఇష్టం లేక కూతురు దగ్గరకు వచ్చేస్తాడు . అల్లుడి దుష్ప్రవర్తనకు నొచ్చుకుని ఘర్షణ పడి బయటకు నెట్టి వేయబడతాడు . వ్యర్ధుడు అనుకున్న చిన్న కొడుకే ఆసరా అవుతాడు . అతని ఇంటికి చేరడంతో సినిమా ముగుస్తుంది .

కధ , కధనం , దర్శకత్వం సంసారపక్షంగా ఉంటుంది . 1988 లో కాబట్టి ప్రేక్షకులు , ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు , ఆదరించారు . ఇప్పటి స్పీడు కాలంలో అనుమానమే . అప్పట్లో కూడా కధలో చాలా మెరుపులు ఉండటం వలన సక్సెస్ అయింది . ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న భార్యాభర్తలుగా శోభన్ బాబు , శారద నటన సూపర్బ్ . జయప్రద గ్లామర్ గురించి మాట్లాడటానికి మనమెంత !

మూడో ప్రధాన పాత్ర రాజేంద్రప్రసాదుదే . తన సిధ్ధాంతాలతో రాజీపడకుండా , సరదా సరదాగా ఉంటూ , ఈజీ గోయింగ్ పాత్రలో బాగా రాణించాడు . అతని ప్రేయసిగా , భార్యగా ,రజని మరో గ్లామర్ స్లాటుని ఫిల్ చేసింది . ఇతర ప్రధాన పాత్రల్లో గొల్లపూడి మారుతీరావు , సాక్షి రంగారావు , సుధాకర్ , వరలక్ష్మి , హరిప్రసాద్ , రాజ్యలక్ష్మి  ప్రభృతులు నటించారు .

సినిమా బాగా ఉండటానికి రాజ్-కోటి సంగీతం , వేటూరి , ఆత్రేయ , జొన్నవిత్తుల లిరిక్స్ , బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , శైలజ , చిత్ర , ఆనందు గాత్రం దోహదపడ్డాయి . బాగా శ్రావ్యమైన పాట శోభన్ బాబు , జయప్రదల మీద సాగే కొమ్మలో కోయిల సరిగమలు కోరికల మల్లెల ఘుఘఘుమలు . దర్శకుడు రేలంగి నరసింహారావు అందంగా చిత్రీకరించారు .

రాజేంద్రప్రసాద్ , రజని రెండు డ్యూయెట్లు , వాళ్ళ డాన్స్ బాగుంటాయి . నీ ఒళ్ళు వయ్యారం , రాలుగాయి రంభలాంటి అమ్మాయిరో డ్యూయెట్లు హుషారుగా ఉంటాయి . రాజేంద్రప్రసాద్ , గొల్లపూడి , రజని మధ్య సాగే రీమిక్స్ పాట ఓ తప్పతాగిన శాస్త్రవేత్తలారా చాలా బాగుంటుంది . విషాద గీతం ఎవరమ్మా నీకు జోల పాడింది ఎవరమ్మా నిన్ను నిదురపొమ్మంది కూడా బాగుంటుంది .

మన తెలుగు సినిమా తమిళ సినిమా Thaiku Oru Thaalaattu కు రీమేక్ . శివాజీ గణేశన్ , పద్మిని , సుజాత లీడ్ రోల్సులో నటించారు . ఈ తమిళ సినిమాకు మాతృక మళయాళ సినిమా Oru Painkilikatha . తెలుగు , తమిళ సినిమాలు ఒకలా ఉంటాయి .

రాముడు , ఇల్లాలు అనే పదాలతో ఎన్ని సినిమాలు వచ్చాయో ఈ సంసారం అనే పదం గల సినిమాలు అన్ని వచ్చి ఉంటాయి . యన్టీఆర్ నటించినవే రెండు సంసారం సినిమాలు ఉన్నాయి . 1950 లో వచ్చిన సినిమాలో ANR కూడా ఉన్నారు . మళ్ళా యన్టీఆర్ , జమునలతో 1975 లో ఇంకో సంసారం వచ్చింది .‌

ఈ 1988 సినిమా యూట్యూబులో ఉంది . పెద్దగా స్లో అని అనిపించదు . రాజేంద్రప్రసాద్ , రజని స్పీడుగానే లాగిస్తారు . శోభన్ బాబు , శారద ప్రౌఢ ప్రేమ సరసంగా ఉంటుంది . మధ్యలో తళుక్కుమనే జయప్రద ప్రేక్షకులను అలరిస్తుంది .

వెరశి చూడబులే సినిమాయే . It’s a romantic , sentimental , emotional movie . Would have been a feel good one too but for the sad exit of both Sarada and Jayaprada from the life of Sobhan Babu .

నేను పరిచయం చేస్తున్న 1183 వ సినిమా … #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక యువ ప్రేమ… ఒక ప్రౌఢ ప్రేమ… ఓ పాత ప్రేమ… వెరసి సంసారం..!!
  • నో సారీ…! జస్ట్ సైలంట్…! దిష్టి వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ పెడసరం..!!
  • గ్లోబల్ సమిట్ అతిథులకు ప్రత్యేక కిట్లు… తెలంగాణతనంతో..!
  • Rage Bait …. ఈ సంవత్సరం మాటగా ఆక్స్‌ఫర్డ్ ఎంపిక… అంటే ఏమిటి..?
  • మద్య వ్యాకరణం..! తాగుబోతులే ఆర్థిక వ్యవస్థలకు అతి పెద్ద దిక్కు..!!
  • క్యూర్… ప్యూర్… రేర్…! తెలంగాణ విజన్-2047 లో ఏమిటి ఈ పదాల అర్థం..!!
  • కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి… ఇదీ తెలంగాణపై కేంద్ర బీజేపీ వివక్ష లెక్క…
  • ఏందమ్మా జగద్ధాత్రీ… పవిత్ర టీవీ సీరియళ్ల సంప్రదాయం బ్రేక్ చేస్తావేం..?!
  • సైబర్ క్రైమ్స్… ఖచ్చితంగా బ్యాంకర్లే ప్రథమ ముద్దాయిలు… ఎలాగంటే..?
  • ఏమిటీ ఈ భూతశుద్ధి..! సమంత- రాజ్ పెళ్లి క్రతువు అసలు విశేషాలు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions