Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాహుల్ ద్రవిడ్ గొప్ప సంస్కారం… సీఎం నితిశ్ వింత నమస్కారం…

July 12, 2024 by M S R

ద్రవిడ్ సంస్కారం…  నిన్న పత్రికల్లో రెండు మంచి వార్తలు. లోపలెక్కడో అప్రధాన వార్తలుగా వచ్చినా… విషయప్రాధాన్యం ఉన్న వార్తలు.

రాహుల్ ద్రవిడ్ పెద్ద మనసు

రాహుల్ ద్రవిడ్ క్రీడాకారుడిగా ఎన్ని మ్యాచులాడాడు? ఎన్ని ఓడాడు? ఎన్ని మ్యాచులను ఒంటి చేత్తో గెలిపించాడు? ఎన్ని గెలుపుల్లో అతడి వాటా ఎంత? లాంటి చర్చల స్థాయిని ఏనాడో దాటేశాడు కాబట్టి ఇప్పుడు ఆ క్రీడా చర్చలు అనవసరం. పోతపోసిన సంస్కారంగా, మన పక్కింటి మధ్యతరగతి మనిషిగా ద్రవిడ్ ను చూసి నేర్చుకోవాల్సింది మాత్రం చాలా ఉంది.

Ads

రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ జట్టు ఇటీవల టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలవడంలో జట్టు ప్రధాన కోచ్ గా ద్రవిడ్ పాత్ర కీలకం. గెలిచిన జట్టుకు అభినందనగా బి సి సి ఐ 125 కోట్ల నజరానా ప్రకటించింది. అందులో ప్రాధాన్య నిష్పత్తి ప్రకారం హెడ్ కోచ్ గా ద్రవిడ్ కు అయిదు కోట్లు వస్తుంది. మిగతా జూనియర్ కోచ్ లకు రెండున్నర కోట్లు, ఇంకా కింది సిబ్బందికి అంతకంటే తక్కువ వస్తుంది.

నేనొక్కడినే అయిదు కోట్లు తీసుకుంటే నా జూనియర్ కోచ్ లను తక్కువ చేసినట్లవుతుంది. వారికిచ్చినట్లుగానే నాక్కూడా రెండున్నర కోట్లే ఇవ్వండి- అప్పుడు కోచ్ లందరికీ సమానంగా ఇచ్చినట్లవుతుందని ద్రవిడ్ బిసిసిఐని కోరాడు. తనకు ప్రకటించిన నజరానాలో సగం వద్దన్నాడు.

అంతకుముందు అండర్ 19 కోచ్ గా నజరానా అందుకునే సమయంలో కూడా ఇలాగే మిగతావారితో సమానంగా ఉండాలని ప్రకటించిన నజరానాలో సగానికి సగం కోతపెట్టుకున్నాడు.

“తనను తాను తగ్గించుకున్నవాడే…హెచ్చింపబడతాడు”.
-బైబిల్ వాక్కు

శెభాష్ ద్రవిడ్!
నీలాంటివారు కోటికొక్కరైనా ఉండబట్టే వర్షాకాలంలో ఇంకా వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలంలో ఇంకా ఎండలు కాస్తున్నాయి. చలికాలంలో ఇంకా చలిగాలులు వీస్తున్నాయి.

నీ కాళ్లు మొక్కుతా!

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పటికి ఎన్నిసార్లు ఊసరవెల్లికి పాట్నాలో పాఠాలు చెప్పారు? ఆ ఊసరవెల్లి ఆయన పాఠాలను ఎంతవరకు విని అర్థం చేసుకోగలిగింది? ఊసరవెల్లులు పాట్నాలో ఎందుకు సిగ్గుతో తలదించుకుని తమ మానాన తాము రంగు వెలిసిన మొహాలతో తిరుగుతున్నాయి? అన్నది ఇక్కడ అనవసరం.

బీహార్ రాజధాని పాట్నాలో ఒక అధికారిక కార్యక్రమం. ‘జెపి గంగా పథ్’ ప్రాజెక్టు మూడో దశ పనులు మొదలుపెట్టే బహిరంగ వేదిక. ప్రాజెక్టు పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాజెక్టు నత్తనడక మీద ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.

రెండు దశల్లో ఆ పనులు చేసిన కాంట్రాక్టరు ‘ప్రతిభ’ తెలిసిన ముఖ్యమంత్రి నితీష్ మూడో దశ పనులైనా త్వరగా పూర్తీ చేయాలని… అక్కడే ఉన్న ఆ సంస్థ ప్రతినిధి వైపు వెళ్లి.. .”మీ కాళ్లు మొక్కుతా… త్వరగా పనులు పూర్తీ చేయండి” అంటూ రెండు చేతులు జోడించి నిజంగా పాద నమస్కారం చేయబోయారు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆ ప్రతినిధి… “సార్! సార్! మీరు పెద్దవారు… అలా చేయకండి” అని వారించాడు.

అంతకుముందు కూడా ఒక సమీక్షలో ఒక ఉన్నతాధికారి కాళ్లు మొక్కబోయారు నితీష్.

“దండం” దశగుణం భవేత్! అంటే ఏమో అనుకున్నాము కానీ…సామ- భేద- దాన- దండోపాయాలు వర్కవుట్ కానప్పుడు “చేతులు జోడించిన దండమే” గండం గట్టెక్కిస్తుందని; కాళ్లు మొక్కబోతే ఎంతగా కళ్లు మూసుకున్న అహంకారి అయినా కరిగి దిగివస్తాడని నితీష్ నిరూపిస్తున్నారు.

చెంపలు చెళ్లుమనిపించడం; జుట్లు పట్టి, కొంగుపట్టి లాగి అవమానించడం; బెదిరించడం; బదిలీలు చేయడం; కాంట్రాక్టులు రద్దు చేయడం; కిడ్నాపులు చేయడం; కాళ్లు చేతులు విరవడం; హత్య చేయడంలాంటి పరమ సున్నిత సర్వ సాధారణ పనులతో పోలిస్తే… రెండు చేతులు జోడించి పాద నమస్కారం చేయబోవడం ఏరకంగా చూసినా సర్వోత్తమమైనది. నయాపైసా పెట్టుబడి, కనీసం శారీరక శ్రమ కూడా లేనిది.

మిగతా ముఖ్యమంత్రులు కూడా ఈ తరణోపాయాన్ని అందిపుచ్చుకుంటే అనేక రాష్ట్రాల్లో పెండింగ్ ప్రాజెక్టులు అతి త్వరగా పూర్తి అయ్యే వీలుంది!

“కాళ్లకు మొక్కండి.
పోయేదేమీ లేదు-
పనులు కావడం తప్ప!”
అన్నది నితీష్ నిరూపిస్తున్న సిద్ధాంతం!

ద్రవిడ్ సంస్కారానికి నమస్కారం.
నితీష్ నమస్కారానికి ప్రతినమస్కారం సంస్కారం. – పమిడికాల్వ మధుసూదన్  9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions